సర్లె ఎన్నెన్నో అనుకుంటాం, అనుకున్నవన్నీ అవుతాయా ఏం..? అని బాలకృష్ణ డైలాగు ఒకటి ఫేమస్… నిజమే కదా… మనం అనుకున్నవన్నీ అయ్యేదుంటే మనం మనుషులం ఎందుకవుతాం..? బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ అధినేత కేసీయార్ పరిస్థితి చూస్తే ఒకరకంగా జాలేస్తుంది… ప్రస్తుతం ఆయన ఎవరూ వెంటలేని ఏకాకి…
ఒకప్పుడు కారు, సర్కారు, సారు, పదహారు అని నినదిస్తూ ఉరికిన శ్రేణులు ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఎక్కడా కనీస జోష్ కనబర్చలేకపోయారు… రెండు చోట్ల రెండోస్థానం… మిగతా అన్నిచోట్లా ప్రజలు మూడో స్థానానికి నెట్టేశారు నిర్దాక్షిణ్యంగా… ఏడు చోట్ల డిపాజిట్లు గల్లంతు… (కేవలం 16 శాతం వోట్లు)… అదీ చాలా భారీ వోట్లు తేడా… సింపుల్‌గా చెప్పాలంటే ఈసారి అసలు బీఆర్ఎస్ పోటీలో ఉన్నట్టే లేదు… మొత్తం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్… అంతే…
జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నా, గాయిగత్తర లేపుతా, రాజ్యాంగాన్నే మార్చేస్తా అంటూ… ఏకంగా పరిస్థితులు కలిసొస్తే ప్రధాని కుర్చీలోనే కూర్చోవాలని ఆశపడిన కేసీయార్‌కు జనం పెద్ద ‘జీరో’ చూపించారు… తన జాన్ జిగ్రీ దోస్త్ జగన్ దారుణంగా మట్టికరిచాడు ఏపీలో… తను తీవ్రంగా వ్యతిరేకించే చంద్రబాబు మళ్లీ సీఎం అవుతున్నాడు ఏపీలో… కొన్నేళ్లుగా నానారకాలుగా నిందించిన మోడీ మళ్లీ ప్రధాని అవుతున్నాడు కేంద్రంలో…
Ads
అన్నింటికీ మించి తనకు పడని చంద్రబాబు కేంద్రంలో అధికారానికి ఆక్సిజన్ కావడం..! లోకసభ ఫలితాల తరువాత కేటీయార్ ఓ ప్రకటన చేస్తూ… తమ పార్టీ ప్రస్థానంలో ఒడిదొడుకులు చాలా చూశామని, ఈ ఫలితాలు నిరాశ కలిగిస్తున్నా సరే, ఫీనిక్స్ పక్షిలా మళ్లీ పైకెగురుతామని పేర్కొన్నాడు… నిజానికి కేసీయార్ సభలకు జనం బాగానే వచ్చారు, ఎంతోకొంత పుంజుకుంది ఈ పార్టీ అనుకున్నారు కొందరు… నో, తెలంగాణ ప్రజానీకం ఇప్పట్లో కేసీయార్‌ను క్షమించే సూచనల్లేవు…
జాతీయ రాజకీయాలకు వస్తే… ఇండి కూటమికి తనంటే పడదు ఇప్పుడు… ఎన్డీయే కూటమితో డిష్యూం డిష్యూమే… ఎవరికీ పట్టని ఏకాకి… అనేక స్థానాల్లో బీఆర్ఎస్ వోట్లు కాంగ్రెస్, బీజేపీలకు క్రాస్ అయిపోయాయి… ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు, ఈ జీరో ఫలితాలతో ఇక పార్టీ మీద ఆశలు చంపుకుని మరింత మంది కాంగ్రెస్ వైపు వెళ్తారు…
ఈ పరిస్థితిని వాడుకుని బలపడే స్థితి బీజేపీలో పెద్దగా కనిపించడం లేదు… దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బాగానే పుంజుకుంది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఓ నైతిక స్థయిర్యం వచ్చింది… అది బీఆర్ఎస్ కేడర్‌ను ఆకర్షిస్తుంది… జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే వార్తలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు సూమోటోగా విచారణ చేపట్టిందని వార్తలొచ్చాయి… ఒకవేళ హైకోర్టు గనుక తమ నేతృత్వంలోనే ఈ విచారణ జరగాలని ఆశిస్తే కేసీయార్‌కు చాలాచిక్కులు తప్పవు… కాగల కార్యం హైకోర్టు తీర్చిందని రేవంత్‌కూ హేపీ…
ఇందులో కేసీయార్ స్వయంగా ఇరుక్కునే చాన్స్ ఉంది… ఇవి గాకుండా కాళేశ్వరం ఎట్సెట్రా బాగోతాలు, విచారణలు, కేసులు ఉండనే ఉన్నాయి… ఈ స్థితిలో బీఆర్ఎస్ నిత్యసమరమే… కేడర్‌ను కాపాడుకోవడం ఇంకా పరీక్ష… ఒకవేళ చంద్రబాబు గనుక ఏపీ కోసం తెలంగాణ ప్రయోజనాలను గోకడం మొదలుపెడితే… రేవంత్ గనుక అడ్డుకోకపోతే అప్పుడు బీఆర్ఎస్‌కు వాళ్లు స్వయంగా చమురు పోసినట్టే… లేకపోతే ఇప్పట్లో బీఆర్ఎస్ కోలుకోవడం కష్టం… అదెన్నాళ్లు అనేది కాలమే చెప్పాలి..!!
Share this Article