Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘ముందు అతడిని పంపించేయండి – లేదంటే నేను షూటింగ్‌కే రాను’’

August 10, 2026 by M S R

.

Mohan Goteti … కృష్ణ గారు చెప్పిన మహేశ్ బాబు సంగతి!
అది ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా షూటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ, గ్లామర్ క్వీన్ విజయశాంతి హీరోహీరోయిన్లు.
అందులో బాలనటుడిగా రెండు పాత్రల్లో మహేశ్ బాబు.
దీనికి దర్శకత్వ బాధ్యతలు కూడా కృష్ణ గారే.

ఆ రోజు మహేశ్ బాబు, మరి కొందరు ఫైటర్స్ పై ఓ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారు సూపర్ స్టార్.
సెట్స్ లో చుట్టూ ఒకసారి చూసిన చిన్నారి మహేశ్ కి ఓ డౌట్ వచ్చింది..
ఎందుకంటే.. ఆ పక్కనే తనలాంటి డ్రెస్సే వేసుకుని .. తన లాంటి హెయిర్ స్టయిల్ తోనే వున్న ఒకతను నిలబడి వున్నాడు.
“ఎవరతను.. నాలాంటి డ్రెస్సే వేసుకున్నాడు?” అనడిగాడు మహేశ్.

Ads

“అతను నీకు డూప్.. రిస్కీ ఫైట్స్ వున్నప్పుడు నీ బదులు అతను చేస్తాడు..” అని చెప్పారు కృష్ణ గారు నవ్వుతూ.
“నా ఫైట్స్ అతను చేయడం ఏమిటి? ఇంక నేనెందుకు?” అన్నాడు మహేశ్.
అప్పటికి అతనికి తెలియదు.. హీరోల రిస్కీ ఫైట్స్ ను తమలాగే డ్రెస్ వేసి, మేకప్ చేసి.. డూప్ ల చేత చేయిస్తారని!
మహేశ్ ప్రశ్నకి సూపర్ స్టార్ కి ఏం చెప్పాలో వెంటనే తోచలేదు.

“అలాంటి ఫైట్స్ మనం చేస్తే దెబ్బలు తగిలే ప్రమాదం వుంది నానీ. ఆ డూప్స్ వాటిలో ఎక్స్ పర్ట్స్.. అందుకని వాళ్లని పెడుతుంటాం” అని విడమరచి చెప్పారు కృష్ణ గారు.
మహేశ్ కి అదేమీ నచ్చలేదు..
కుదరదంటే కుదరదన్నాడు..
తనే చేస్తానని మొండిపట్టు పట్టాడు.
కృష్ణ గారు ఎంత నచ్చచెప్పినా తను వినలేదు..
చేసేది లేక.. “సరే.. నువ్వే చేద్దువుగానిలే” అన్నారు సూపర్ స్టార్.

ఊహూ.. మహేశ్ వినలేదు..
షాట్ కి రావడం లేదు..
“అతనిని ఇక్కడ నుంచి పంపించేయండి.. అతను ఇక్కడ వుంటే నేను షూటింగ్ చేయను” అంటూ భీష్మించాడు.
చేసేది ఏమీ లేక.. ఇక ఆ డూప్ ని షూటింగ్ స్పాట్ నుంచి పంపించేశారు.
ఆ తర్వాత మహేశ్ ఆ షాట్ తనే సొంతంగా చేయడానికి ఉపక్రమించాడు..
ఓపక్క కన్నకొడుకు డూప్ లేకుండా చేస్తానన్నాడన్న ఆనందం, గర్వం..
మరోపక్క, తన చిన్నారికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన..
ఆ టెన్షన్ లోనే ఆ షాట్ ను ఎక్కడా రాజీ పడకుండా కృష్ణ గారు అద్భుతంగా చిత్రీకరించారు.

చిన్నారి మహేశ్ సాహసానికి యూనిట్ సభ్యులంతా క్లాప్స్ కొట్టి అభినందించారు.
ఈ విషయాన్ని ఓసారి మహేశ్ ప్రస్తావన వస్తే కృష్ణ గారే నాకు స్వయంగా చెప్పారు.
మరి ఆ చిన్నారి ఎవరు.. సాహసాలకు మారుపేరైన సూపర్ స్టార్ కొడుకు!
ఆయనలోని ఆ సాహసం.. ఆ ధైర్యం ఎక్కడికి పోతాయి?
అచ్చుగుద్దినట్టు కొడుకులో వచ్చేశాయి..
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు కదా.. అందుకే, ఘట్టమనేని నట వారసత్వ పరిమళం మహేశ్ లో కూడా అలాగే చిన్నప్పటి నుంచీ పరిమళించింది.

మహేశ్ ని బాలనటుడిగా ఉన్నప్పటి నుంచీ చూస్తున్నాను.
మద్రాసులో కృష్ణ గారి కోసం, రమేశ్ బాబు కోసం వారింటికి వెళ్లినప్పుడు.. షూటింగుల్లోనూ కనిపించేవాడు.
ఒకసారి హైదరాబాదులో పద్మాలయా స్టూడియోలో కృష్ణ గారితో మాట్లాడుతుంటే.. గబుక్కున అక్కడ ప్రత్యక్షమయ్యాడు మహేశ్.
ఆ మేని ఛాయ.. ఆ ముఖ వర్చస్సు.. మిలమిల మెరిసిపోతున్నాడు..
అప్పటికింకా హీరోగా చేయలేదు.. త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు..
కృష్ణ గారు నాకు పరిచయం చేస్తే చాలా మర్యాదగా.. గౌరవంతో మాట్లాడాడు.

హీరోగా తొలి సినిమా ‘రాజకుమారుడు’!
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారు డైరెక్షన్.. భారీ చిత్రాల నిర్మాత అశ్వనీదత్ గారు నిర్మాత.. ఇంకేం.. గ్రాండ్ ఎంట్రీ.
1998 లో పద్మాలయా స్టూడియోలో చాలా వైభవంగా జరిగింది ఈ సినిమా ప్రారంబోత్సవం..
ముహూర్తపు షాట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాప్ కొట్టడం విశేషం!
ఆ రోజు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమాన జనంతో పద్మాలయా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది!

ఆ తర్వాత ‘యువరాజు’.. ‘వంశీ’.. అన్నీ భారీ చిత్రాలే!
ఆ తర్వాత వచ్చింది కృష్ణవంశీ రూపొందించిన ‘మురారి’!
మహేశ్ బాబులోని నటుడు ఒక్కసారిగా బయటికి వచ్చాడు..
ఎంత నేచురల్ గా యాక్ట్ చేశాడో!
ఎంత ఈజ్ తో నటించాడో!
ఇక ఆ తర్వాత కొన్నాళ్లకి వచ్చింది గుణశేఖర్ రూపొందించిన ‘ఒక్కడు’!
దుమ్మురేపింది!

తండ్రికి తగ్గా మాస్ హీరో గా అతనిని ప్రేక్షకుల ముందు నిలబెట్టింది!
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’ మహేశ్ కెరీర్లో ఒక క్లాసిక్ లాంటిది.
అటు క్లాస్.. ఇటు మాస్.. అన్ని ఎలిమెంట్స్ వుంటాయి..
టీవీల్లో అది ఎన్నిసార్లు వచ్చినా.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతూ ఎంజాయ్ చేస్తుంటారు.
ఇక ఆ వెంటనే వచ్చిన ‘పోకిరి’ మరో మాస్ ఎంటర్ టైనర్!
బాక్సాఫీసుని కుదిపేసి రికార్డులు కొట్టింది.

అదే వరుసలో ‘దూకుడు’.. ‘శ్రీమంతుడు’.. ‘సరిలేరు నీకెవ్వరు’..
ఇవి కూడా కుమ్మేశాయి.. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టాయి..
ఇక అసలు సిసలు సినిమా ఇప్పుడు వస్తోంది..
అదే ‘వారణాసి’!
ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తుండడంతో బోలెడు అంచనాలు!
గొప్ప దర్శకుడు.. గొప్ప నటుడు.. గొప్ప కథ.. మరి, ఇది కూడా సంచలనం కాక మరేమవుతుంది?
ఇప్పుడు అందరి కళ్లూ ఈ సినిమాపైనే వున్నాయి..
ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు.. మొత్తం దేశ సినీరంగం దృష్టంతా దీనిపైనే వుంది!
రాజమౌళి, మహేశ్ కలిసి ఎటువంటి మ్యాజిక్ చేయబోతున్నారు? అన్నదే అందరిలోనూ కుతూహలాన్ని పెంచుతోంది..

మహేశ్ ఈవేళ కేవలం మాస్ హీరో మాత్రమే కాదు.. అటు క్లాస్ హీరో కూడా!
ఫ్యామిలీలు, మహిళలు అతనిని ఎంతగానో ఇష్టపడతారు..
అతని సినిమా వస్తోందంటే ఫ్యామిలీతో వెళదామని ఎదురుచూస్తుంటారు..
ఈ రోజు మహేశ్ అంతటి ఇమేజ్ సంపాదించుకున్నారు.
నిజానికి మహేశ్ బాబులో వున్న ప్రతిభలో ఇప్పటివరకు మనం చూసింది అతి తక్కువ..
అతనిలో ఇంకా ఎంతో టాలెంట్ వుంది..
మట్టిముద్ద లాంటివాడు.. ఎలా అయినా అతనిని మౌల్ద్ చేసుకోవచ్చు..
ఏ తరహా చేసినా అందులో ఇట్టే ఒదిగిపోతాడు..
ఎటొచ్చీ అతనిలో వున్న మరెంతో టాలెంటుని బయటకు తేవాల్సింది రచయితలూ, దర్శకులే!

మహేశ్ వ్యక్తిత్వం విభిన్నం!
ఎన్ని విజయాలు వరిస్తున్నా తను మాత్రం అప్పుడెలా వున్నారో .. ఇప్పుడూ అలాగే వున్నారు.. డౌన్ టు ఎర్త్.. అచ్చం తండ్రిలానే!
ఎవరికైనా సాయం చేయడంలో కూడా తండ్రిలానే మహేశ్ ముందుంటారు.
‘మహేశ్ బాబు ఫౌండేషన్’ ద్వారా ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఆదుకుంటూ వుంటారు..
ఇప్పటివరకు కొన్ని వేలమంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి పేదల జీవితాల్లో వెలుగులు నింపారు.

మహేశ్ చాలా కామ్ గోయింగ్..
తన పనేదో తాను చేసుకుంటూ పోతారు.. ఇతరుల విషయాలలో అస్సలు జోక్యం చేసుకోరు.
షూటింగ్ వుంటే సెట్స్ లో వుంటారు.. లేకపోతే ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు.. పక్కా ఫ్యామిలీ మ్యాన్! (నిన్న మహేశ్ బర్త్ డే)

-మోహన్ గోటేటి  
#maheshbabu
#SuperstarKrishna
#Rajamouli
#varanasimovie .

·
·

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘ముందు అతడిని పంపించేయండి – లేదంటే నేను షూటింగ్‌కే రాను’’
  • … అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్… నిజమేనా !!
  • రిటైరయ్యాక ఆయుష్షు ఎనిమిదేళ్లేనట ! ఆంధ్రజ్యోతిలో ఓ పిచ్చి సర్వే !!
  • ప్రభాత ఉదయం ! ఎవరిది ఈ కొత్త పత్రిక ? అంతుచిక్కని గోప్యత !!
  • కనిపించే దృశ్యం రికార్డవుతుంది – మరి పరిమళం, రుచి మాటేమిటి ?
  • ఆర్థిక సంస్కరణలకు అసలు సూత్రధారి… వెంకిట రమణన్ !!
  • జీనత్ అమన్‌కూ ‘తెహెల్కా’ తేజ్‌పాల్‌కూ ఏమిటి సంబంధం?!
  • బొద్దింకలు సజీవంగా, చురుకుగా ఉండాలట – రాజకీయాల్లోకి రావద్దట..!!
  • … అంటే నగరజనం కాలుష్యంలోనే బతకాలా మిస్టర్ కేటీఆర్ ?!
  • GOBARdhan ! పెట్రోల్‌లో ఇథనాల్‌లాగే- గ్యాస్‌లో బయో CNG మిక్స్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions