ఫతేపూర్ బేరి… బబ్లీ బౌన్సర్ సినిమాలో చూపించిన ఈ గ్రామం నిజంగానే ఉంది… ఢిల్లీ పరిసరాల్లో ఉంటుంది… అక్కడి యువకులు రోజూ బాగా వ్యాయామాలు అవీ చేసి, కండలు పెంచి, ఫుల్ ఫిజికల్ స్టామీనాతో ఢిల్లీలో బౌన్సర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా కొలువులు సంపాదిస్తారు… ఆ ఊరు దీనికి చాలా ఫేమస్ కావడంతో పలు సెక్యూరిటీ సంస్థలు కూడా వాళ్లకు ఇట్టే కొలువులు ఇచ్చేస్తాయి… నమ్మకస్థులు…
యువకులు మాత్రమే బౌన్సర్లు కావాలా..? మేమేం తక్కువ అని సవాల్ చేసి, తనూ బౌన్సర్ అవుతుంది ఓ అమ్మాయి… ఒకరితో పెళ్లి ఫిక్స్… మరొకరితో లవ్వు… నిజానికి బౌన్సర్లకు కేంద్రంగా మారిన ఆ ఊరి కథను కేంద్రంగా తీసుకుని, ఈ అమ్మాయి కథను దాని చుట్టూ తిప్పితే బాగుండేదేమో… ఆ ఊరి కథ పెద్దగా లేదు… అదొక్క నిరాశ…
సినిమా పేరు చెప్పలేదు కదా… బబ్లీ బౌన్సర్… హాట్‌స్టార్ ఓటీటీలో విడుదల చేశారు… ఆ అమ్మాయి పాత్రను, అదేనండీ, బబ్లీ బౌన్సర్ పాత్రను తమన్నా పోషించింది… దర్శకుడు మధుర్ భండార్కర్… నిజానికి తను లేడీ ఓరియెంటెడ్ సినిమాల్ని బాగానే తీస్తాడని పేరు… కానీ మరీ ఈ పేలవమైన సినిమాను తీశాడంటే ఆశ్చర్యమే…
Ads
సినిమాలో మిగతా నటీనటులు, సంగీతం, ఎట్సెట్రా మాట్లాడుకోవడం వేస్ట్… ఎందుకంటే దర్శకుడు దీన్ని ఓ సీరియస్ సినిమాగా తీయలేదు… రొటీన్ కథకు కాస్త ఫన్ కలిపి, ఏదో అలా అలా సినిమా పూర్తి చేశాం అనిపించాడు… సినిమాలో హీరోయిన్ కూడా తరచూ ఐయామ్ ఫన్నీ అంటూ ఉంటుంది… నిజమే, జస్ట్, ఫన్ ఓన్లీ… అదీ పెరిఫెరల్… థియేటర్లలో విడుదల చేయకుండా దర్శకుడు ప్రేక్షకుల్ని బతికించాడు… లేకపోతే తమన్నాను పోస్టర్లలో చూసి, వెళ్లి, పర్సులు ఖాళీ చేసుకునేవాళ్లు కదా కొంతమందైనా…
ఎస్, ఈ సినిమాకు బలం తమన్నాయే… వయస్సు పెరుగుతున్నా ఆమె అందం, ఫిజిక్ అలాగే… పైగా పాత్రకు తగిన నటనను ఇవ్వడానికి కష్టపడుతుంది… గొప్పగా ఏమీ చేయకపోవచ్చుగాక, కానీ పాత్రకు అన్యాయం మాత్రం చేయదు… అలాంటప్పుడు బబ్లీ బౌన్సర్ కథను ఇంకాస్త సీరియస్‌గా రాసుకుని, మెరుగ్గా ప్రజెంట్ చేసి ఉంటే ఆామెకు పేరు వచ్చి ఉండేది… సాధారణంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటేనే ఏదేని సీరియస్ ఇష్యూ డిస్కషన్ ఉంటుందని ఆశిస్తాం కదా…
ఇందులో అదేమీ కనిపించదు… ఓ లవ్ స్టోరీ, అంతే… పోనీ, అదైనా బాగా తీశాడా అంటే అదీ లేదు… ఎమోషన్స్ జాడలు పెద్దగా కనిపించవు… ఆమె కోరికను ప్రోత్సహించే తండ్రి, నో, పెళ్లిచేసి పంపించేయాలనే తల్లి… సంబంధాలు ఎత్తగొడుతూ ఉంటుంది… కానీ తప్పనిసరై తనను ఇష్టపడే ఒకతనితో పెళ్లికి అంగీకరిస్తుంది… కానీ ఆమె మనసేమో మరొకరిపై ఉంటుంది… పదో తరగతి కూడా ఐదుసార్లు ఫెయిలై, గ్రామస్థులు వెక్కిరించే ఆమె అందరూ మెచ్చుకునే పనేం చేసింది..? పెళ్లికి ఆమె పెట్టిన షరతులేమిటి అనేదే సినిమా కథ… ఓపిక ఉంటే ఓటీటీ యాప్ తెరవండి… ఏదో ఓ సాదాసీదా హిందీ సినిమా… అంతే…!!
Share this Article