సత్యం పాతాళం నుంచి ఆకాశాన్ని తాకింది …
డిపాజిట్ దక్కని పార్టీ అధికారంలోకి వస్తుంది …
జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ బిజినెస్లే…
జనవరి 2009 టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లోకి వెళుతుంటే ఓ యువకుడు ఫోన్లో సత్యం షేర్లు లక్ష కొన్నాను – అని గట్టిగా చెబుతున్నాడు . అప్పటివరకు దాదాపు ఐదు వందల రూపాయలు ఉన్న సత్యం 2009 లో స్కామ్ బయటపడగానే తగ్గుతూ పది రూపాయలకు వచ్చింది . ఆ సమయంలో ముందు చూపు ఉండి ధైర్యం చేసిన వారి పంట పండింది . పది లక్షలతో లక్ష షేర్లు కొన్న ఆ యువకుడికి ఇప్పటి ధర ప్రకారం పన్నెండు కోట్ల రూపాయల ఆస్తి . సత్యంను టెక్ మహేంద్ర విలీనం చేసుకున్న తరువాత ఆ స్టాక్ దశ తిరిగింది . పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మంగళవారం స్టాక్ మార్కెట్ ఘోరంగా పడిపోవడం, ఆంధ్రాలో టీడీపీ జనసేన విజయంతో పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి…
అసెంబ్లీ సమావేశాల అజెండాలో సభా కార్యక్రమాలను బిజినెస్ అని రాస్తారు . ఆ మాట నాకు బాగా నచ్చుతుంది … జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ బిజినెస్లే … పగలు , రాత్రి ఉన్నట్టే బిజినెస్ అన్నాక బాగా నడిచే రోజులు ఉంటాయి . దెబ్బ తినే రోజులు ఉంటాయి . మన జీవితంలో ఎగుడు దిగుడులు ఉన్నట్టే స్టాక్ మార్కెట్ , రాజకీయాల్లో ఎగుడు దిగుడు ఉంటాయి .
Ads
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉప ఎన్నికల్లో ఆంధ్ర , తెలంగాణల్లో టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది . అలాంటి టీడీపీ 2014లో ఆంధ్రాలో అధికారంలోకి వచ్చింది . ఉద్యమ కాలంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు పోటీ కూడా చేయని తెరాస హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారి 99 సీట్లు గెలిచింది . ఐదేళ్ల పాలన తరువాత ఆంధ్రాలో 23 సీట్లకు పరిమితం అయిన టీడీపీ , ఇప్పుడు వైయస్ ఆర్ కాంగ్రెస్‌ను 11 సీట్లకు మరిమితం చేసింది . రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఇప్పుడు 21 స్థానాల్లో జనసేన పోటీ చేసి 21 చోట్ల గెలిచింది . వంద శాతం విజయం ఇదో రికార్డ్ …
చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి ఓడిపోయినప్పుడు ఏం చేద్దాం అని అభిప్రాయాలు సేకరిస్తూ టీడీపీలో ఉన్నప్పుడు బాగా పరిచయం ఉన్న ఎ.యం.రాధాకృష్ణ ఫోన్ చేసి… చిరంజీవి అడుగుతున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అని అడిగారు . రాజకీయం వేరు , సినిమాల్లో హీరోలు వేరు . అన్నీ సమకూర్చాక హీరో వచ్చి నటిస్తాడు . రాజకీయం అలా కాదు, చాలా ఓపిక ఉండాలి . వచ్చే ఐదేళ్ల వరకు పార్టీని నిలబెట్టి ఉద్యమాలు చేయగలరు అనుకొంటే ఓకే . అంత ఓపిక లేదు అనుకొంటే కాంగ్రెస్‌లో విలీనం అయితే రాజ్యసభ , మంత్రి పదవితో కాలక్షేపం చేయవచ్చు అని నా అభిప్రాయం చెప్పాను .
ప్రజారాజ్యం నుంచి గెలిచిన శాసనసభ్యులు చిరంజీవిని కలిసి కాంగ్రెస్‌లో కలిసి పోతున్నాం, మీరు వస్తే మీ నాయకత్వంలో కలుస్తాం , లేదంటే మేమే కలిసిపోతాం అని చెప్పడంతో చిరంజీవి కాంగ్రెస్‌లో కలిసిపోయారు . ఎన్టీఆర్‌ను దించేసే సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్గం శాసనసభ్యులు సైతం సరిగ్గా ఇదే డైలాగు వినిపించారు . సినిమా నటులు రాజకీయ పార్టీలను నడపడం అంత ఈజీ కాదు . పవన్ కళ్యాణ్ పార్టీకి 21 సీట్లు వచ్చినా నా అభిప్రాయం అదే .
చంద్రబాబు వంద శాతం రాజకీయ నాయకుడు . పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు . యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో మాత్రమే . ఈ విషయం కాలమే చెబుతుంది . చంద్రబాబు రాజకీయం ముందు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడే నిలువ లేక పోయారు .
పడిపోయిన స్టాక్ మళ్ళీ లేస్తుంది . పాతాళంలోకి వెళ్లిన సత్యం ఆకాశంలోకి దూసుకువెళ్లింది . ఆకాశంలోకి వెళ్లిన స్టాక్ పడిపోనూ పోవచ్చు . ఈ పోస్ట్ రాసేప్పుడు స్టాక్ మార్కెట్ ఇండెక్స్ చూస్తే నా ఫోర్ట్ పోలియో ఈ రోజు మూడు శాతం మైనస్‌లో ఉంది . కొంత పోస్ట్ రాసి ఇప్పుడు మళ్ళీ చూస్తే మూడు శాతం మైనస్ కవర్ కావడంతో పాటు అరశాతం ప్లస్ లోకి వచ్చింది . 1990 ప్రాంతంలో స్టాక్ మార్కెట్ గురించి తెగ చదివే అలవాటు ఉండేది .
ఆంధ్రప్రభ దినపత్రికలో ఆదివారం స్టాక్స్ రికమండేషన్స్ వచ్చేవి . యునిటెక్ అనే ఓ స్టాక్ 40 రూపాయలు ఉండేది . ఎందుకో అది బాగా గుర్తుండి పోయింది . ఈ మధ్య మిత్రులతో చర్చిస్తూ ఆ స్టాక్ ప్రస్తావన వచ్చింది . మూడున్నర దశాబ్దాల తరువాత ఆ స్టాక్ ఎక్కడుందో చూద్దాం అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే తొమ్మిది రూపాయల వద్ద కనిపించింది . ఆ స్టాక్ కాలం కాటేయడంతో మూడున్నర దశాబ్దాల తరువాత 9 రూపాయల వద్ద తచ్చాడుతోంది .. ఆంధ్రాలో కాంగ్రెస్‌లా …
ఆంధ్రా పప్పు అని గెలిచేసిన లోకేష్ ఘన విజయం సాధించారు . జాతీయ స్థాయిలో బీజేపీ సోషల్ మీడియా దశాబ్దన్నర కాలం నుంచి జాతీయ స్థాయిలో పప్పు అని రాహుల్ గాంధీని గేలి చేసింది . అదే పప్పు తనను తాను దేవుడిని అని ప్రచారం చేసుకున్న మోడీకి చుక్కలు చూపించారు … వచ్చే ఎన్నికలకు దేవుడికి విశ్రాంతి ఇచ్చి రాహుల్ గాంధీ ప్రధాని కావచ్చు కూడా .
తాను చీదరించుకున్న చంద్రబాబు , నితీష్ కుమార్ల మధ్దతుతో ఇప్పుడు దేవుడు ప్రజలను పాలించబోతున్నారు . తెరాసలో ఒక సాధారణ చోటా నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి . ఒకప్పుడు మూడు రూపాయలు ఉన్న బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ఇప్పుడు తొమ్మిది వేల రూపాయలను దాటి పది వేల రూపాయల వైపు పరుగులు తీస్తోంది . నిన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు అన్ని స్టాక్స్ దాదాపు 20 శాతం వరకు పడిపోతే , చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ 5 శాతం పెరిగింది . కాలం కలిసి వస్తే అంతే …
రాజకీయాల్లో అయినా, స్టాక్ మార్కెట్లో అయినా ఓపిక ఉన్నవారికే ఫలాలు అందుతాయి . కరోనా సమయంలో నాగార్జున కంస్ట్రక్షన్ స్టాక్ 17 రూపాయలు , ఇప్పుడు 280 … 17 రూపాయలప్పుడు ఓపిక వహిస్తే 280 అవుతుంది . 23 సీట్లు వచ్చినప్పుడు ఓపిక వహించిన నాయుడుకి 135 వచ్చాయి … జూదగాళ్ళకు నిమిషంలో ఫలితం తేలవచ్చు . లాంగ్ టైం ఇన్వెస్టర్లు లాభాల పంట చూడాలి అంటే దీర్ఘకాలిక ఓపిక , సహనం అవసరం … జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ వ్యాపారాలే … ఏ వ్యాపారంకైనా ఓపిక అవసరం . సబర్ కా ఫల్ మీటా హోతా హై అంటారు . గీతలో కృష్ణుడు చెప్పినట్టు నీ పని నువ్వు చెయ్ ఫలితం ఆశించకు . ఫలితం అదే వస్తుంది . స్టాక్ మార్కెట్లో నైనా .. రాజకీయ మార్కెట్ లో నైనా ..
నాయకులు , ఓటర్లు , మీడియా వాళ్ళు.. వీళ్లు అందరూ వ్యాపారులే .. అందరిదీ వ్యాపారమే, ఎవరూ అమాయకులు కాదు, అందరూ వ్యాపారులే .. అందరి లక్ష్యం లాభమే .. లాభసాటి వ్యాపారమే – చెప్పొచ్చేది ఏమిటంటే ఒక్క నెల రోజులు ఓపిక పడితే స్టాక్ మార్కెట్ మళ్ళీ పరుగులు తీస్తుంది … కరోనానే జయించి నిలబడిన మార్కెట్‌కు సంకీర్ణ రాజకీయాలు కొత్త కాదు .. దేవెగౌడ , గుజ్రాల్‌ల పాలన చూసిన మార్కెట్‌కు ఇదేం పెద్ద సంక్షోభం కాదు . – భయపడకండి మనుషులను కాదు, మార్కెట్ ను నమ్మండి – – – బుద్దా మురళి
Share this Article