Murali Buddha హైదరాబాద్ లో మూడు రాష్ట్రాల ముగ్గురు గవర్నర్లు… శ్రీకృష్ణ కమిటీ నివేదిక వందేళ్లకు వస్తుంది… తేల్చేసిన ఎడిటర్… బిల్లు సవరణ ప్రతిపాదనలు రామబాణం అన్న టీడీపీ… జర్నలిస్ట్ జ్ఞాపకాలు
___________________________________________
ఆ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం కార్యాలయంలోకి వెళితే శాసన సభ్యులంతా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టుగా ఉంది . నేను పదవ తరగతి పరీక్షలకు వెళుతున్నప్పుడు ఆ దృశ్యం అచ్చం అలానే ఉండేది . ఒకరు శ్రద్దగా చదువుతుంటాడు , ఇంకో విద్యార్ధి పరీక్షలో కాపీ కొట్టే విధంగా చిన్న అక్షరాలతో రాస్తుంటాడు . అలానే ఉన్న దృశ్యం… వీరందరికీ మధ్యలో కూర్చొని టీడీపీ శాసన సభ్యులు దూళిపాళ నరేంద్ర సలహాలు ఇస్తున్నారు . వారి సందేహాలు తీరుస్తున్నారు .
Ads
2013 డిసెంబర్ 16న అసెంబ్లీలో రాష్ట్ర విభజనపై ముసాయిదా బిల్లు ప్రవేశపెడతారు . అంతకన్నా ముందు రోజు tdlp లో కనిపించిన సీన్ ఇది . ఏం జరుగుతుంది అని అడిగితే రామబాణం వేయబోతున్నాం అని ఉత్సాహంగా చెప్పారు . ముసాయిదా బిల్లును సభలో ప్రవేశ పెడుతున్నారు కదా ? మేం బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తున్నాం . ఎన్ని సవరణలు అయినా ప్రతిపాదించవచ్చు . ఒక్కో శాసన సభ్యుడు కనీసం వంద సవరణలు ప్రతిపాదిస్తాడు . ప్రతిపాదిస్తున్న సవరణలు రాసి అసెంబ్లీ కార్యదర్శికి ముందే ఇవ్వాలి . దానికోసం ఈ కసరత్తు . అలా ఇస్తే ఏమవుతుంది ? అని అడిగితే సవరణలు వేలలో ఉంటాయి . ప్రతిపాదించిన ప్రతి సవరణపై చర్చ జరగాల్సిందే అంటే ఆలోచించండి , ఏడాది గడిచినా చర్చ పూర్తి కాదు . ఇదే మా రామబాణం అని చెప్పుకొచ్చారు .
తెలంగాణ ను అడ్డుకోవడానికి ఏ ఒక్కరు ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోలేదు . కేంద్రంలో అధికార పక్షం , ప్రధాన ప్రతిపక్షం అనుకూలంగా ఉన్నప్పుడు ఏ ప్రయత్నం ఐనా వృధానే అని చెప్పాలని ఉన్నా , అక్కడి వాతావరణం చెప్పడానికి వీలుగా లేకపోవడంతో మౌనంగా చూస్తూ ఉండిపోయాను .
****
నాలుగు తెలుగు దిన పత్రికలు ఉంటే, సర్క్యులేషన్ లో నాలుగవ స్థానంలో ఉన్నా ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్రి తెలంగాణను అడ్డుకోవడానికి చేయని ప్రయత్నం లేదు . లాభసాటి ప్రయత్నాలు చేశారు . లాభసాటి అంటే ఫలించే ప్రయత్నాలు అని కాదు . సమైక్యాంధ కోసం ఏదో రాయడం , దాన్ని పుస్తకంగా ప్రచురించడం , ఏదో తక్కువ జీతంతో నెట్టుకొచ్చే కాంట్రాక్ట్ ఉద్యోగులైన తెలంగాణ జర్నలిస్ట్ లకు బుక్స్ అంటగట్టి అమ్మి పెట్టమనడం …. పర్మనెంట్ ఉద్యోగులకు వేజ్ బోర్డు సిఫారసులు అమలవుతాయి . జీతం ఎక్కువ , ఉద్యోగ భద్రత ఉంటుంది . నేను తెలంగాణ కోరుకుంటున్నాను అని ధైర్యంగా చెప్పే అవకాశం ఉంటుంది . కాంట్రాక్ట్ వాళ్లకు చాలా తక్కువ జీతం, కనీసం నోరు తెరిచి తెలంగాణ కోరుకుంటున్నాను అని చెప్పే స్వేచ్ఛ ఉండదు , పైగా సమైక్యాంధ్ర కోసం రాసిన పుస్తకాలు అమ్మి పెట్టాలి . ఉద్యమ సంఘాల వార్తలు రాసే రెడ్డి అనే కుర్రాడి ఇంట్లో ఈ పుస్తకాల కట్టలు కనిపించాయి . ఓ నాయకుడు ఇతని పరిస్థితి గమనించి డబ్బు ఇచ్చి , పుస్తకాలు నీ వద్దనే ఉండనివ్వమని వదిలేశాడు .
****
హైదరాబాద్ కేంద్రంగా మూడు రాష్ట్రాలు ఏర్పడతాయి అని ఒకసారి ఎడిటర్ అద్భుతంగా రాశారు . ముగ్గురు గవర్నర్లు ఉంటారని సెలవిచ్చారు . తీరా చూస్తే విభజన తరువాత రెండు రాష్ట్రాలకు చాలా కాలం ఒకరే గవర్నర్ ఉన్నారు . తెలంగాణ ఏర్పడితే చీకటి , నక్సలైటు విజృంభిస్తారు అని అందరూ రాశారు . మూడు రాష్ట్రాలు , ముగ్గురు గవర్నర్లు అనే కొత్త కోణం బాగుంది అనిపించింది . రాస్తున్నది అబద్దం అని తెలిసినప్పుడు ఆకట్టుకునే అబద్దమే రాయాలి .
ఓ రోజు ఎన్టీఆర్ భవన్ లో నలుగురు రిపోర్టర్లతో ఎర్రంనాయుడు పిచ్చాపాటి మాట్లాడుతూ తెలంగాణ రాదు అని చెబుతూ నక్సలైట్ల సమస్య , శాంతిభద్రతలు అంటూ యేవో చెప్పుకుంటూ పోతున్నారు . అవి కాదు కానీ మీకు అంతకన్నా బలమైన కారణం చెబుతాను అని ఓ సలహా ఇచ్చాను వ్యంగ్యంగా… అమెరికా ఒప్పుకోవడం లేదు , తెలంగాణ ఇవ్వవద్దు అని కేంద్రానికి వార్నింగ్ ఇచ్చింది, అందుకే ఇవ్వడం లేదు అని చెప్పండి బాగుంటుంది అని చెప్పాను , అయన వెంటనే… ఔను నిజం .. కావాలంటే మొన్న వార్త కూడా వచ్చింది అన్నారు . విదేశాల్లో పర్యటించే అమెరికా పౌరులకు అమెరికా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది . తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం గురించి పర్యాటకులకు వార్నింగ్ ఇస్తే ఆ వార్తను ప్రస్తావిస్తూ అమెరికా వద్దంటోంది అని చెప్పుకొచ్చారు .
****
శ్రీకృష్ణ కమిటీపై ఎడిటర్ సీరియస్ గా రాసిన ఆణిముత్యం లాంటి వ్యాసం ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంది . .. శ్రీ కృష్ణ కమిటీ ఆంధ్ర , తెలంగాణల్లో అనేక జిల్లాల్లో పర్యటించింది . కొన్ని వేల మంది కమిటీకి స్వయంగా లేఖలు ఇచ్చారు . వేల మంది విభజన పై తమ అభిప్రాయాలు కమిటీకి మెయిల్ చేశారు . ఓ సారి తమకు ఎన్ని వినతి పత్రాలు వచ్చాయో కమిటీ ప్రకటించింది . ఎడిటర్ ఓ రోజు ఎన్ని వేల వినతి పత్రాలు , ఒక్కో వినతి పత్రంలో ఎన్ని పేజీలు అని లెక్క తేలిస్తే లక్షల్లో వచ్చింది … ఒక పేజీ చదవడానికి ఎంత సమయం పడుతుంది . లక్షల పేజీలు చదివేందుకు ఎన్ని కోట్ల నిముషాలు , ఎన్ని సంవత్సరాల సమయం పడుతుందో లెక్క వేసి …. ఇన్ని వినతి పత్రాలు చదివేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పి … చదివేందుకు ఇన్ని సంవత్సరాలు పడితే ఇక నివేదిక ఎప్పుడిస్తారు , తెలంగాణ రాదు అని తేల్చేశారు .
ఆ లెక్క ప్రకారం మొత్తం పేజీలు చదివేందుకు వందేళ్లు పడుతుంది . జెమినీ టివిలో కావచ్చు చర్చ … ఎడిటర్ శాస్త్రితో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ ఉన్నారు . ఆఫీస్ లో స్టాఫ్ తో మాట్లాడినట్టు టివి చర్చలో తెలంగాణ ప్రజలెవరూ తెలంగాణ కోరుకోవడం లేదు . అది నాయకుల కోరిక మాత్రమే అంటూ చెప్పుకుపోయారు .
అలా చెబితే ఆఫీస్ లో ఐతే ఔను అన్నట్టు తలాడించే వాళ్ళం . అది టివి అక్కడున్నది హరగోపాల్ …. మీరు అలా మాట్లాడడం తప్పు , తెలంగాణ ఇవ్వ వద్దు సమైక్యాంధ్ర గానే ఉంచాలి అని మీ వాదన వినిపించవచ్చు తప్పు లేదు కానీ , తెలంగాణ ప్రజలంతా తెలంగాణ కోరుకోవడం లేదు అని వారి తరపున మీరెలా చెబుతారు . వారి కోరిక చెప్పుకొనే హక్కు కూడా వారికి ఇవ్వరా అని జూనియర్ రిపోర్టర్ కు చెప్పినట్టు చెప్పారు హరగోపాల్ . మూడు రాష్ట్రాలు , ముగ్గురు గవర్నర్లు , రాజ్యాంగ సంక్షోభం, లక్షల పేజీల నివేదికలు, అమెరికా ఆగ్రహం , నక్సలైట్లు , చీకటి .. ఊహించినట్టు ఏమీ లేవు . చక్కగా రెండు రాష్ట్రాలు , ఇద్దరు గవర్నర్లు మాత్రమే ఉన్నారు . ఇద్దరు ముఖ్యమంత్రులు తమ పని తాము చేసుకుంటున్నారు……..
Share this Article