.
ఈరోజు పత్రికల్లో ఒక వార్త… సారాంశం ఏమిటంటే..? చత్తీస్‌గఢ్ ఆర్థికమంత్రి ఓపీ చౌదరి స్వయంగా తనే 100 పేజీల బడ్జెట్ రాసి అసెంబ్లీకి సమర్పించాడు… చాలా పత్రికల్లో అదొక గొప్ప కార్యం, విశేషం అన్నట్టు రాసుకొచ్చారు… దేశంలోనే మొదటిసారి అని పొగడ్తలు…
నిజానికి సదరు ఆర్థిక మంత్రి నేపథ్యం తెలుసుకుంటే… తను చేసిన పని పట్ల మనకు నవ్వు రావాలి… ఆ తరువాత తన మీద జాలి కలగాలి… తనను ఆర్థికమంత్రిని చేసిన బీజేపీని చూసి విస్తుపోవాలి…
Ads
ఎందుకంటే..? ఆయన ఓ ఐఏఎస్ అధికారి… ప్రజలకు సేవ చేయాలని అనుకుని… సారీ, దిక్కుమాలిన పడికట్టు భాష వచ్చేస్తోంది… ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం అనే వాక్యమే ఓ డొల్ల, శుష్క భ్రమపదార్థ నినాదం…
ఆఫ్టరాల్ బ్యూరోక్రటిక్ అధికారంకన్నా రాజకీయాధికారమే ఈ దేశంలో అల్టిమేట్ అనే సత్యం తెలిసినవాడు కాబట్టి… 2018లో తన సర్వీస్‌కు ఓ రాజీనామా పత్రం పారేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సారు… 2023లో బీజేపీ తరఫున రాయ్‌గఢ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆర్థికమంత్రి అయ్యాడు…
స్వయంగా చేతిరాతతో బడ్జెట్ ప్రతి రూపొందించడానికి పదిరోజులపాటు జస్ట్, రెండు గంటలే నిద్రపోయాడట… గొప్పగా చెప్పుకున్నాడు… ఇదీ మన ఐఏఎస్‌ల జ్ఞానం…
అసలు బడ్జెట్ అంటే ఏమాత్రం ప్రాధాన్యం లేదు ఈరోజుల్లో… జస్ట్, వచ్చే సంవత్సరం ఎంత ఆదాయం వస్తుందీ, ఏయే పద్దులకు ఎంత ఖర్చులు పెట్టాలనే ఓ రఫ్ ప్రతిపాదన అది… బడ్జెట్‌కు కట్టుబడాలనే రూల్ ఏమీ ఉండదు… అవి కేవలం అంచనాలు…
తీరా సంవత్సరాంతమున చూస్తే కొన్ని పద్దులకు అసలు నిధులే విడుదల కావు… మొత్తం బడ్జెట్‌లో బోలెడంత కోత పడుతుంది… మన తెలుగు రాష్ట్రాల్లోనైతే బడ్జెట్‌ను ఓ ప్రచారప్రయాసగా మార్చారు… మేం ఈ శాఖలకు ఇంత కేటాయించామని ఘనంగా చెప్పడానికి అడ్డగోలు అంకెలు పేరుస్తారు… అదొక స్ట్రాటజీ…
సరే, సదరు ఐఏఎస్ ఆర్థికమంత్రి స్వదస్తూరీతో బడ్జెట్ ప్రతి రాయడం వల్ల ఉపయోగం ఏమిటి..? సున్నా… పైగా తన శ్రమ మైనస్… అందరు ఎమ్మెల్యేలకు ప్రతులు ఇవ్వాలి కదా… అవి ప్రింట్ చేయాల్సిందే కదా… మరి ఒక్క ప్రతికి స్వదస్తూరీ అనే అంశానికి ఏం ప్రాధాన్యం ఉంది..? ఏం విలువ ఉంది…
ఇదే శ్రమను, ఇదే ప్రయాసను, ఇదే ప్రచార జ్ఞానాన్ని కాస్త నాణ్యమైన బడ్జెట్ రూపకల్పనకు ఉపయోగిస్తే ఎంత బాగుణ్ను…!!
Share this Article