Nancharaiah Merugumala……….. నలభై ఆరేళ్ల క్రితం… అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చిన్న కొడుకు సంజయ్ గాంధీ చొరవతో, దిల్లీ పాతనగరం తుర్కమన్ గేట్ ప్రాంతంలో పాత ఇళ్లు, రేకులతో వేసిన ‘పూరిళ్లు’ తొలగించే ప్రయత్నం విజయవంతంగా పూర్తిచేశారు… ఎమర్జెన్సీ కాలంలో- 1976 వేసవిలో బుల్‌డోజర్లతో పేదల గృహాలు నేలమట్టం చేశారు. ఇప్పటి బుర్ర తక్కువ హిందుత్వ పాలకుల మాదిరిగా కాకుండా ‘యువరాజు’ నాయకత్వంలోని ప్రభుత్వాధికారులు- యువజన కాంగ్రస్ నేతల బృందాలు కేవలం కూలగొట్టుటకే పరిమితం కాలేదు.
దాదాపు నూరు శాతం ముస్లింలు నివసించే ఈ ప్రాంతాన్ని ‘సుందరీకరణ’కు ఎంపిక చేయడమే గాక ‘అధిక సంఖ్యలో’ పిల్లలు కనే అల్పసంఖ్యాకవర్గం భారం తగ్గించడానికి’ కూడా సంజయుడు మార్గం ఆలోచించారు. ఓపక్క గరీబు సాయిబుల ఇళ్లు కూల్చడానికి బుల్‌డోజర్లకు పనిచెబుతూనే, వారి సంతాన నియంత్రణకు డాక్టర్ల ‘వైద్య’ శిబిరాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఒక పక్క బుల్‌డోజర్ల దెబ్బకు గూడు చెదిరి ఏడుస్తున్న జనాన్ని ‘కుటుంబ నియంత్రణ’ కేంద్రాలకు బలవంతంగా తరలించి ‘కోత పని’ వైద్యులతో పూర్తి చేయించారు.
కొన్నిరోజులు జరిగిన ఈ కార్యక్రమంలో ఒక దినం ప్రతిఘటించిన జనసమూహంపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్ లో 20 మంది పైనే ప్రాణాలు కోల్పోయారు. ఏ వర్గం ప్రజల్ని ఆ వర్గం వారి సహకారంతో అణచివేసి, దారికి తెచ్చుకునే నైపుణ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ తుర్కమన్ గేట్ విధ్వంస-మారణకాండలో కూడా రుక్సానా సుల్తానా అనే సంపన్న ముస్లిం సోషలైట్ లేడీ సహకారం తీసుకున్నారు. ఎమర్జెన్సీ నాటి సంజయ్ గాంధీ పోకడలు అనుసరిస్తున్న కాషాయ శిబిరం ఇప్పుడు తెలివిగా బుల్‌డోజర్ల వినియోగానికి మాత్రమే పరిమితమైంది.
Ads
46 సంవత్సరాల తర్వాత కూడా బలవంతపు సంతాన నిరోధక ఆపరేషన్లు దేశ రాజధానిలో గుడారాలు వేసి చేయడం కుదరని పని అని మోదీ-షా ద్వయానికి తెలుసు. ఇస్లాం ప్రకారం పిల్లలు పుట్టకుండా ఆపడం తప్పుగాని, ప్రాణాలు తీయడం దోషం కాదనే అవగాహన హిందూత్వవాదులది. అదీగాక, దిల్లీ సర్కారు నడిపే ఆమ్ ఆద్మీ పార్టీ ‘స్వల్ప హిందుత్వ’ పోకడ తెలుసు కాబట్టి బీజీపీ దూకుడుకు అడ్డే లేకుండాపోయింది. మార్క్సిస్టు నేత బృందా కారాట్ ఢిల్లీలోని జహంగీర్ పురీ ప్రాంతంలో సర్కారీ బుల్డోజర్లకు అడ్డు నిలవడమేగాక, సుప్రీంకోర్టుకు పోవడంతో కూడా కాషాయ చక్రాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
యూపీ, మధ్యప్రదేశ్ సహా ఇంకా అనేక దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థుల ఆస్తులపై బుల్‌డోజర్ల వాడకం కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో (గుజరాత్, హిమాచల్) అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరులో పూర్తయ్యే వరకూ బుల్‌డోజర్ల మోత తప్పదనిపిస్తోంది.
ముస్లింల ఇళ్లు కూల్చివేత, బలవంతపు ‘ఆపరేషన్ల’ కార్యక్రమంలో సంజయ్ గాంధీతో చేతులు కలిపిన హిందూ-ముస్లిం దంపతుల సంతానం రుక్సానా సుల్తానా ఎవరో కాదు. 1980ల నాటి బాలీవుడ్ తార అమృతా సింగ్ తల్లి. ఇంకా హీరో వేషాలే వేస్తున్న సయీఫ్ అలీ ఖాన్ మాజీ అత్తగారు. ఇప్పటి బీజేపీ విధ్వంస కార్యక్రమాల్లో రుక్సానా సుల్తానా వంటి మహిళలకు ఇంకా భాగస్వామ్యం ఇవ్వడం మొదలుకాలేదు.
(సంజయ్ ఫోటో పక్కన ఉన్న చిత్రంలో తల్లి రుక్సానా (నల్ల కళ్ళద్దాలు) అలనాటి తార అమృతా సింగ్)
Share this Article