ఒక్క ఎన్‌కౌంటర్ చేసినందుకే పోలీసులు కోర్టులో సమర్థించుకోవడానికి నానా తిప్పలూ పడుతుంటారు కదా… మరి 10,000… అక్షరాలా పదివేల ఎన్‌కౌంటర్లు జరిగిన ఉత్తరప్రదేశంలో ఎంత గగ్గోలు రేగాలి..? లేదు, ఎన్‌కౌంటర్లు అక్కడి పాలనలో ఓ భాగమైపోయాయి… బుల్‌డోజర్ బాబా కన్నెర్ర చేస్తే చాలు, తుపాకులు పేలాలి, బుల్‌డోజర్లు కదలాలి, నేరస్థుల ఆస్తులు కూలాలి, జైళ్లలోకి తోసేయాలి, కూల్చలేని ఆస్తులుంటే స్వాధీనం జరిగిపోవాలి… లేదంటే నేరస్థులు ప్రయాణించే జీపులు బోల్తాకొట్టాలి… అస్సోం కూడా ఇదే బాటలోకి ప్రయాణిస్తోంది…
ఇదంతా నిజమే… అయిదేళ్లుగా చూస్తున్నదే కదా అంటారా..? అసలు ఈ పదివేల ఎన్‌కౌంటర్లు అనే అంకె నిజమేనా అనడుగుతారా..? యోగీ మొదటి అయిదేళ్ల కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్ల సంఖ్య 9,434… తను రెండోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 525… వెరసి 9,959… రోజుకు సగటున అయిదు దాటి ఎన్‌కౌంటర్లు ఉంటున్నయ్… ఈలెక్కన మరో వారం రోజుల్లో సహస్ర సంఘటనాదిన్ జరుపుతాడేమో యోగి… ఈ సంఖ్య ప్రభుత్వం చెబుతున్నదే…
అంతెందుకు..? ఈ వంద రోజుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ల సంఖ్యను కూడా ‘రిపోర్ట్ కార్డ్’ పేరిట బాహాటంగానే ప్రకటించింది యోగి సర్కారు…ఎందరిని అరెస్టు చేశారు, ఎందరు లొంగిపోయారు, ఎందరు మరణించారు, ఎందరు పోలీసులు గాయపడ్డారో కూడా అధికారికంగానే చెబుతోంది…
Ads
గతంలో ఓ మాఫియా నేరరాజ్యంగా మార్చేశారు ఉత్తరప్రదేశాన్ని… ఊరూరికో డాన్… అత్యాచారాలు, వేధింపులు, కిడ్నాపులు, హత్యలు, కబ్జాలు, తరిమివేతలు, ఆస్తుల కాజేతలు… డ్రగ్స్ సహా అన్నిరకాల నేరాలకూ అడ్డా… అందుకే ‘తొక్కుడు పాలసీ’ చేపట్టాడు యోగి… నేరస్థుడు జైలులో ఉండాలి, లేదంటే ఎన్‌కౌంటర్ స్థలంలో ఉండాలి… ఈ స్థాయిలో పోలీసుల్ని ఇలా ఉపయోగించిన పాలకుడు దేశంలో మునుపెవరూ లేరు… ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో కనిపిస్తాడు అలా…
గత ఎన్నికల్లో ఈ ఎన్‌కౌంటర్లు బీజేపికి వ్యతిరేకం అవుతాయని ఒక దశలో బీజేపీ కూడా సందేహించింది… యోగి ఇమేజీ పెరగకుండా, ఢిల్లీకి థ్రెట్ గాకుండా ఉండేందుకు తననే తొక్కుదామని మోడీషా క్యాంప్ ప్రయత్నించింది… కానీ కుదరలేదు… సంఘ్ అడ్డంగా తిరస్కరించింది… అసలే తిక్క బాబా, మళ్లీ తన సొంత పార్టీని యాక్టివేట్ చేసుకుంటే మొదటికే మోసం వస్తుందని గ్రహించి కిమ్మనలేదు ఇక… నిజానికి పలు మీడియా సంస్థలు సర్వేలకు వెళ్లినప్పుడు వాళ్లకు వినిపించిన పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌లో ఇదీ… ‘‘బాబా చేతుల్లో క్షేమంగా ఉన్నాం… మా అక్కాచెల్లెళ్లు, బిడ్డలు సేఫ్…’’ అదే యోగిని మళ్లీ గెలిపించింది…
తను కూడా ఎన్నికలప్పుడు బుల్‌డోజర్‌ను మరింత ప్రచారంలోకి తెచ్చాడు… ఎన్నికలు కాగానే బుల్‌డోజర్ స్పీడ్ పెరుగుతుందని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసేవాడు… యోగి ఓడిపోతున్నాడు, అఖిలేష్ గెలుస్తున్నాడని కొన్ని మీడియా సంస్థలు ఢిల్లీలో కూర్చుని సర్వేలు రాసిపడేశాక… అప్పటిదాకా కాస్త అణిగిమణిగి ఉన్నట్టు నటించిన అసాంఘిక శక్తులు మళ్లీ బజారులోకి వచ్చాయి… ఎస్పీ పార్టీకి మద్దతుగా తమ బలాల్ని, సాధన సంపత్తిని ఉపయోగించాయి… యోగి ఓడిపోతే చాలు అనే ధ్యేయంతో వర్క్ చేశాయి… ఎవరెవరు ఓవరాక్షన్ చేస్తున్నారో మొత్తం రికార్డయింది…
యోగి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే ఈ ‘తొక్కుడు కార్యక్రమం’ మరింత ధాటిగా ప్రారంభమైంది… శాంతిభద్రతలు బాగుంటేనే మిగతావన్నీ బాగుంటాయనేది ఈ తొక్కుడు పాలసీ ఉద్దేశం… ఇంకో అయిదేళ్లపాటు యోగీతో వేగెదెలా బాబోయ్ అనే భయాందోళనలు ఇప్పుడు సమాజవాదీ దళాల్లో స్టార్టయింది… ఇవన్నీ సరే… ఈ బుల్‌డోజర్ వ్యవస్థను అక్కడి కోర్టులు ఎలా చూస్తున్నాయి..? ఏరకంగా విశ్లేషించుకుంటున్నాయి..? ఈ ప్రశ్నకు సరైన జవాబులు కనిపించడం లేదు… వినిపించడం లేదు…!! మరో అంశం… ఇన్ని వేల మందిని జైళ్లలో నూకారు, ఇన్ని వేల ఎన్‌కౌంటర్లు జరిగాయి కదా… ఇంకా ఇంకా ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు వీళ్లంతా..?! పీకేసినాకొద్దీ ఈ గుర్రపుడెక్క ఇంకా ఎలా పెరుగుతోంది..?!
Share this Article