Cadaver… కడవర్ అంటే మెడికల్ స్టూడెంట్స్ అనాటమీ నేర్చుకొనేందుకు ఉపయోగించే మృతదేహం….. అమలాపాల్ స్వయంగా ప్రొడ్యూస్ చేసి తీసిన ఈ కడవర్ సినిమా పేరు సజస్ట్ చేస్తున్నట్లుగానే ఒక మెడికో లీగల్ కేస్‌కి సంబంధించిన మిస్టరీ మూవీ… ముందుగా సినిమా టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుందాం…. నాన్-లీనియర్ మెథడ్‌లో చెప్పిన ఈ కథని సాధ్యమైనంతవరకు ఇల్లాజికల్ అంశాలు లేకుండా తీయడానికి శ్రమించారు.
అరవింద్ సింగ్ చేసిన సినిమాటోగ్రఫీకీ సంబంధించినంతవరకు తను ఎంచుకున్న కలర్ స్కీం, సీన్‌కి అవసరమైన, అనుగుణమైన లైటింగ్ చేసి మూడ్ క్రియేట్ చేసారు. కొన్ని కొన్ని కెమెరా బ్లాక్స్ ఏ ఇతర కమర్షియల్ సినిమాకి తగ్గకుండా ఉన్నాయి. కథాకథనానికి అనుగుణంగానే రంజిన్‌రాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. హైందవ సంప్రదాయానికి సంబంధించిన మంత్రాలు, స్తోత్రాలను బ్యాక్ గ్రౌండ్ స్కోరుగా పెట్టుకోడం ఇప్పుడు ఆనవాయితీ అయింది, ఇందులోనూ అదే తరహాలో వాడుకున్నారు…
అక్కడక్కడ ప్రేమగీతాలు (డ్యూయెట్లు) లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. కాస్ట్యూమ్స్ కూడా వున్నంతలో బాగానే చేసారు… జైలు సెట్, మార్గ్ సెట్ రియలిస్టిక్‌గా బాగున్నాయి. ఇక కథలోకి వస్తే… పొలీస్ సర్జన్ ఐన భద్ర (అమలాపాల్) తను డీల్ చేసే పలు మర్డర్ మిస్టరీల, అటాప్సీల చుట్టూ తిరిగే కథ… ఈ హత్యలన్నీ ఒకదానికొకటి లింకై ఉన్న విషయాన్నికనుగొన్న సర్జన్ మరియు ఇన్స్పెక్టర్లు అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయో కనుగొనే ప్రయత్నమే ఈ కథ…
Ads
యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీయే ఈ హత్యలన్నింటికీ కారణమని తెలుసుకున్న అమల, హరీష్ ఈ మిస్టరీని ఛేదించడానికి రంగంలోకి దిగుతారు. అసలు ఆ ఖైదీ కథేంటో తెలుసుకోడానికి బయలుదేరుతారు. అనాథను ప్రేమించి, పెళ్ళి చేసుకుని, ఆనందంగా జీవనాన్ని సాగిస్తున్న త్రిగుణ్ ఒక యాక్సిడెంట్‌లో గర్భిణి ఐన తన భార్య ఏంజిల్‌ని కోల్పోతాడు. మొదట్లో దీన్ని యాక్సిడెంట్ డెత్‌గా కేస్ క్లోస్ చేస్తారు. కానీ కొన్ని క్లూస్ ద్వారా అది హత్య అని ప్రూవ్ చేస్తుంది భద్ర. ఆ హత్యకి గల అసలు కారణం, దానివల్ల ఎన్ని జీవితాలు ఛిన్నాభిన్నమైపోయాయో రివీల్ అవ్వడమే మిగతా కథ.
ఆ కేస్‌ను తిరగతవ్వి అసలేం జరిగింది అనే కోణంలో నడిచే కథలో అనేక పిట్టకథలు వచ్చి చేరుతాయి. ఏంజిల్‌ని ఎవరు ఎందుకు చంపారు… ఆ చంపినవారికి ఎలాంటి శిక్షపడింది అనే కథనం సైంటిఫిక్, మెడికో ఇన్వెస్టిగేటివ్ గా సాగింది. సినిమా మెదలైనప్పట్నుండి ఆసక్తికరంగా సాగినా సరే, ఎక్కడా ఉత్కంఠ మాత్రం కలగలేదు. ప్రతి సస్పెన్స్ ఎలిమెంట్‌ని మెల్లగా రివీల్ చేయాలనే క్రమంలో అదే ప్రెడిక్టబుల్‌గా మార్చేసాడు డైరెక్టర్ అనూప్ పానికర్.
పోలీస్ సర్జన్ (అమలా పాల్) సెంట్రిక్‌గా కథ నడపాలనే ఉత్సాహంలో మిగతా ఎలిమెంట్స్ ఐన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లీగల్ డిపార్ట్మెంట్ అసలు అవసరమే లేనట్లు చేసాడు రైటర్ అభిలాష్ పిల్లై… నటనపరంగా అమలా పాల్ పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి పాత్రలో ఒదిగిపోయింది. మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారనే చెప్పొచ్చు. డిస్నీ ఓటీటీలో ఉంది కాబట్టి వీకెండ్‌లో చూసేయవచ్చు… అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గర్ సజెస్టివ్ డాన్సులు లేవు కాబట్టి టీనేజ్ పిల్లలతో కూడా నిస్సంకోచంగా కల్సి చూడొచ్చు… మీరు చూసాక, ఆ త్రిగుణ్ కి అసలు యావజ్జీవ శిక్షఎందుకు పడింది, అతను జైల్లో ఎందుకు వున్నాడో మాత్రం నాకు చెప్పండి ! ప్లీజ్ !! —- (రివ్యూయర్ :: ప్రియదర్శిని కృష్ణ)
Share this Article