ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే… ఎవరు కుర్చీల మీద కూర్చుని సమాజాన్ని ఉద్దరిస్తున్నా సరే….. తిరుమల శ్రీవారికి చేసేదేమీ ఉండదు, పైగా దేవుడి ఆదాయాన్ని రకరకాలుగా దోచుకుని తినడం తప్ప..! వాటికన్ సిటీ… అక్కడి దాకా ఎందుకు..? స్వర్ణదేవాలయం వెళ్లి, ఈ సోకాల్డ్ తిరుమల ఉద్ధారకులు రెండు రోజులు పరిశీలించి వస్తే చాలు… తిరుమల ఏడు కొండలనూ, తిరుమల దేవాలయాన్ని ఎంత అద్భుతమైన హిందూ క్షేత్రంగా చేయవచ్చో అర్థమవుతుంది… కానీ ఎవరూ చేయరు… చేస్తే పొలిటిషియన్స్ ఎలా అవుతారు..? టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ… ఎవరు పెత్తనానికి వచ్చినా సరే, శ్రీవారికి నామాలు పెట్టడం ఆగదు… ఇది రియాలిటీ… కానీ ఒకడినొకడు తిట్టేసుకుంటారు… ఎవరికివాళ్లు పెద్ద శుద్ధపూసలైనట్టు..! ఇప్పుడిక తిరుపతి ఉపఎన్నిక వచ్చింది కదా… సోషల్ మీడియాలో దూషణల పర్వం నడుస్తుంది… ఆల్రెడీ స్టార్టయింది… మధ్యలోకి దేవుడినీ లాగుతారు… ప్రజలు అసహ్యించుకున్నా సరే, రాజకీయ నాయకుల తోళ్లు మందం కదా, ఆపరు…
ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైపోయారు కదా… ఇక పార్టీల వాగాడంబరాన్ని, వాగుడు అంబరాన్ని తప్పనిసరై భరించాలి జనం… ముందుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురించి చెప్పాలి ఇక్కడ… ఎవరో పార్లమెంటులో అడిగారు, అమ్మా, మరీ దేవుడి మీద కూడా జీఎస్టీ ఏమిటమ్మా..? ఆ వెంకటేశ్వర స్వామిని మినహాయింపులు ఇవ్వొచ్చు కదా అని…. ఆమె బేసిక్‌గా రాజకీయవేత్త కాదు… బ్యూరోక్రాట్ తరహా… ‘నో, నో, ఎప్పటి నుంచో జీఎస్టీ వేస్తున్నారు, మినహాయింపులు కుదరవు, అన్ని గుళ్లకూ వేస్తున్నారు’ అని ఓ ఉన్నతాధికారి తరహాలో సమాధానం చెప్పింది… ఎప్పటి నుంచో వేస్తున్నారు కాబట్టే కదా మినహాయింపు అడుగుతున్నది… సమాధానం చెప్పేటప్పుడు కనీసం ఆ విషయమూ ఆమె సోయిలో లేదు… ఖర్మ… ఐనా ఆత్మనిర్భర ప్రకటనల నుంచీ ఆమెను చూస్తున్నదే కదా, ఏదో ఆశించడం మన తప్పు… సరైన జవాబు ఆశించడం కూడా…
Ads
ఎవరో సోషల్ మీడియాలో స్టార్ట్ చేశారు… శ్రీవారి నుంచి 120 కోట్లు జీఎస్టీ పిండుతున్నారు… మాట్లాడితే హిందువులు, దేవుళ్లు అని చెప్పే బీజేపీకి సిగ్గులేదా అని…! నిజంగా బీజేపీకి అదే గనుక ఉంటే, హిందూ ఆలయాలను ప్రభుత్వ పెత్తనాల నుంచి బయటపడేసేది కదా… సరే, ఆ చర్చలోకి వద్దు గానీ… వెంటనే బీజేపీ వాళ్లు కౌంటర్ అటాక్స్ స్టార్ట్ చేశారు… ఈ వైసీపీ సర్కారు వచ్చాక ఉద్దరించింది ఏముంది..? టోల్ పెంచారు, వసతి అద్దెలు పెంచారు, ప్రసాదం రేట్లు పెంచారు అంటూ…! నిజమే… కానీ వైసీపీ అని కాదు, ఏ సర్కారు వచ్చినా అంతే… భక్తుల జేబులు ఖాళీ చేయడం అనే ఏకైక సూత్రం మీద పనిచేస్తుంటుంది టీటీడీ… భక్తుడు నిలువు దోపిడీ ఇవ్వాలి, ఇంకా ఏమైనా మిగిలితే మేం లాక్కోవాలి అన్నట్టుగా ఉంటుంది టీటీడీ వ్యవహార ధోరణి… ఐనా… ఓ చిన్న ప్రశ్న, పర్ సపోజ్… నిర్మలమ్మకు దేవుడు కలలో కనిపించి ఆదేశిస్తే జీఎస్టీ రద్దు చేసిందీ అనుకుందాం… (ఫాఫం, ఆమె చేతుల్లో ఆ అధికారం ఉంటే, గింటే…)… అలా ఆదా అయ్యే సొమ్ము మేరకయినా టీటీడీ భక్తులకు వసతి చార్జీలు, ప్రసాదం ధరలు, టోల్ వాయింపులు, దర్శనం టారిఫ్ వంటి అంశాల్లో ఏమైనా ఫాయిదా చూపించగలదా..? నెవ్వర్… నెవ్వర్…! అవునూ, తిరుమల నుంచి 120 కోట్లు జీఎస్టీ పిండుతున్నారే అనుకుందాం… అందులో రాష్ట్రానికి వచ్చే వాటా ఎంత..? అందులో రూపాయైనా తిరుమలకు ఖర్చు చేస్తున్నారా..?!
Share this Article