Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎడమ లెఫ్ట్..! కుడి కాంగ్రెస్..! కమలంపై కదనానికి కేసీయార్ తయ్యార్..?

December 7, 2020 by M S R

నిజమే… రాజకీయం అంటేనే అది కదా… ఏ స్థిర సిద్ధాంతమూ లేకుండా నిత్యచంచలంగా ఉండుటయే రాజకీయం అనబడును… ఎప్పుడూ తోకపార్టీలుగా ఉండటానికి అలవాటు పడి, బూర్జువా పార్టీల దాస్యంలో తరించే వామపక్షంతోసహా ఇది అన్ని పార్టీలకూ వర్తించే సర్వసాధారణ నీతిగా భావించవలెను…

మొన్నటి ఎన్నికల్లోనే కదూ… మోడీని విడిచి, రాహుల్‌ను భుజాన మోస్తూ, దేశంలోని బొచ్చె పార్టీలను ఏకం చేసి, బోలెడంత డబ్బు ఖర్చు చేసి మరీ… చావుదెబ్బ తిన్న చంద్రబాబును చూశాం…. ఆ ఎన్నికల్లోనే కదూ… పవన్ కల్యాణ్‌కు అటూఇటూ చేరి, చివరికి గెంటివేయబడి, ఇప్పుడు మళ్లీ ఎవరు దొరుకుతారా అని చూస్తున్న వామపక్షాల తీరు కూడా చూశాం…………. కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి రాజకీయం చేస్తే ఒరిగేదేమిటో చంద్రబాబును అడిగితే చాలా చెప్పగలడు… కానీ కేసీయార్ అలా అడగడు… అడగలేడు… అలాగే అడుగులు వేస్తాడు… అంతే…

నిన్నటిదాకా గొంగళి పురుగుల్లా కనిపించిన జీవులు ఈరోజు ముద్దాడాలి అనిపించేంత సుందరంగా కనిపించవచ్చు… అదే రాజకీయం… అసలు కేసీయార్ తమ ఆఫీసులకు వస్తానంటే వామపక్షాలకు ఎంత ఆనందం… ఎంత ఆఆఆనందం…! చటుక్కున అతుకుపోతయ్… ఎందుకంటే, అతుక్కుపోవడానికి ఇంకేదీ దొరకలేదు కాబట్టి… అతుక్కోకుండా ఉండలేరు కాబట్టి…

మరి కాంగ్రెస్..? దానికి ఎటూ దిక్కూదివాణం లేదు కదా… ఢిల్లీలో లేదు, హైదరాబాద్ గల్లీలో కూడా లేదు… మొన్న చంద్రబాబు దొరికాడు, తను ఖతం అయిపోయాడు… ఇప్పుడు కేసీయార్… ‘‘ఒకవేళ కేసీయార్‌తో కాంగ్రెస్ కలిస్తే నేను క్షణం కూడా పార్టీలో ఉండను’’ అంటున్నాడు కొండా విశ్వేశ్వరరెడ్డి… అంటే పార్టీల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ కలయిక మీద జోరుగా చర్చలు, మథనాలు సాగుతూనే ఉన్నాయన్నమాట… ఆల్‌రెడీ కొన్ని పెద్ద తలలు ఢిల్లీ ప్రతినిధులతో జంపింగు మంతనాల్లో మునిగిపోయారు కూడా…

ఒకప్పటి ప్రత్యర్థి… కొట్టీకొట్టీ, బలాన్ని చంపేసి, రసం పిండేసి, ఎముకలపోగుగా మార్చాడు కేసీయార్… ఇప్పుడు అదే కేసీయార్ కాంగ్రెస్ దోస్త్ అంటూ వెంట తిప్పుకుంటాడేమో…. రాజకీయాల్లో ఇలాగే జరగాలని ఏమీ రాసి ఉండదు కదా… ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అదే… అయితే ఈ తక్షణ రాజకీయ సమీకరణాలు, లబ్ధి కోసుకునే ప్రయత్నాలను జనం హర్షిస్తారా..?

అబ్బే, అవన్నీ ఎవరాలోచిస్తారు ఇప్పుడు..? ఈ బీజేపీ ఏమైనా శుద్ధపూసా..? దేశవ్యాప్తంగా తను చేస్తున్న పనేమిటి..? ఇదేకదా జంపులు, డేటింగులు, బ్రేకప్పులు… అదీ రకరకాల రొమాన్స్ కథల్ని నడిపిస్తున్నది కదా… ప్రస్తుతం నీతులు చెప్పే నైతికత ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు… అంతెందుకు..? ఇప్పుడు గెలిచిన తమ గ్రేటర్ కార్పొరేటర్లను కాపాడుకోవడమే బీజేపీకి పెద్ద సమస్యగా మారనుంది… మరి కేసీయార్‌కు సరుకు అవసరముంది… ధర కాదు సమస్య ఇక్కడ…

అది సరే, మరి ఇప్పుడు యాంటీ-బీజేపీ జాతీయ పోరాటానికి కాంగ్రెస్, ఎర్రజెండాలు కలిసి రాకపోతే ఎట్లా..? ఒక్క మజ్లిస్ ఒవైసీని పట్టుకుని యుద్ధం ఎలా చేయడం..? పైగా ఒవైసీ పక్కన నిలబడితేనే మైనస్ అయిపోతున్న రోజులు ఇవి… ఇంకా రాసుకుని పూసుకుని తిరిగితే ఉన్న గోచీబట్ట కూడా పోయే ప్రమాదం కనిపిస్తోంది… సో, కాస్త పెద్ద పెద్ద ఎర్రజెండాలయితే అన్నీ కప్పేసుకోవచ్చు… కాంగ్రెస్ గుర్రమెక్కి స్వారీ చేయవచ్చు… ఆలోచన బాగానే ఉంది…

ఎలాగూ కాంగ్రెస్‌కు ఇప్పుడు తాడూబొంగరం లేకుండా పోయింది కాబట్టి… కారెక్కి కమలంపై కదనానికి రెడీ…. ఎటొచ్చీ అందరూ మరిచిపోతున్నది ఏమిటయ్యా అంటే… ఈ ప్రయత్నాలు, ఈ ప్రచారాలు అన్నీ కలిపి తెలంగాణలో బీజేపీకి ‘‘అనుకోని బలాన్ని’’ అప్పనంగా సంపాదించి పెడుతున్నయ్…!!

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • కాక పెరుగుతోంది..! కానీ ఎవరు గెలిస్తే ఎవరికేం ఫాయిదా..?!
  • మట్టి మోసం చేయదు… ఉప్పెనలో తేలిపోయిన ఊక, ఉప్పు… అసలు కథ ఇదీ…
  • పాకిస్థాన్‌కు మోడీ రహస్య సందేశం… ఒకేమాట… అంతే, అభినందన్ వచ్చేశాడు…
  • నో డౌట్… పాట బంపర్ హిట్…! కానీ సుద్దాల ఎక్కడ ఎత్తుకొచ్చాడు దీన్ని..?!
  • కంగనా రనౌత్, ఆలియా భట్, దీపిక పడుకోన్… ఈ పాత్రకెవరు సూటబుల్..?
  • పోనీ… ప్రతి చందాకూ ఐటీ వారి ధ్రువపత్రం జతచేయాలా కామ్రేడ్..?!
  • మరీ ఎక్కువ చదివావోయ్… నువ్వు ఈ కొలువుకు పనికిరావు… గెటౌట్…
  • ప్రేమ ఖతం..! ప్రియుడి హత్యకు ప్రియురాలి సుపారీ… ప్లస్ ఒక పూట..?
  • ఇప్పుడిలా సాగిలబడ్డాయి గానీ… ఒకప్పుడు పొలిటికల్ కార్టూన్ అంటే…?!
  • సెక్యులర్ వాద్రా..! అయోధ్య చందాలపై వింత వ్యాఖ్యలు, విడ్డూరపు బాష్యాలు…

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now