వయస్సు 77 ఏళ్లు… ఎప్పుడూ తనతో సిక్కులు సంప్రదాయ సిద్ధంగా ధరించే కిర్పాణ్ (కృపాణ్- ఖడ్గం) ఉంటుంది… అది సిక్కుల త్యాగాలకు, సాహసానికి, పోరాటతత్వానికి చిహ్నం… దాన్ని ధరించి పార్లమెంటులో అడుగుపెడతాడా..? స్పీకర్ అనుమతిస్తాడా..? ఈ ప్రశ్న రెండురోజులుగా పంజాబ్ కేంద్రంగా వెలువడే పత్రికలు, టీవీలు, సైట్లు, చానెళ్లు, సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది… ఒకసారి ఈ కత్తి కథ తెలుసుకుంటే, ఇంకా చాలా విశేషాలు తెలుస్తాయి…
సిమ్రన్‌జిత్‌సింగ్ మాన్… మొన్న పంజాబ్‌లోని సంగ్రూర్ లోకసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో గెలిచాడు… ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ ఖాళీ చేసిన సీటు ఇది… తనకు బలమైన అడ్డా ఈ సీటు… అక్కడ ఈ సిమ్రన్‌జిత్ గెలిచాడు… మరి ఈ కత్తి కథేమిటి..? కాస్త లోతుల్లోకి వెళ్దాం… వీళ్ల కుటుంబం కూడా విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి తరలివచ్చిందే… తండ్రి పేరు లెఫ్టినెంట్ కల్నల్ జోగీందర్ సింగ్… తరువాత పంజాబ్ అసెంబ్లీ స్పీకరయ్యాడు… ఆ మిలిటరీ, పొలిటికల్ ఫ్యామిలీకి చెందినవాడు ఈ సిమ్రన్‌జిత్…
1967లోనే ఐపీఎస్… సిక్కులకు ప్రత్యేక దేశం ఉండాలనే భావజాలం బలంగా కలిగినవాడు… బాంబే సీఐఎస్ఎఫ్ గ్రూప్ కమాండెంట్‌గా ఉన్న 1984లో స్వర్ణదేవాలయం మీద సైనికదాడిని నిరసిస్తూ తన సర్వీస్‌కు రాజీనామా చేశాడు… అరెస్టయ్యాడు… ఐనా లోకసభకు పోటీచేసి గెలిచాడు… తరువాత విడుదలయ్యాడు… 1990లో తను గర్వంగా భావించే కిర్పాణ్ ధరించి పార్లమెంటుకు వెళ్లాడు… అనుమతి లభించలేదు… నిరసనగా రాజీనామా చేశాడు…
Ads
తను గీతిందర్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నాడు… ఆమె ఎవరో తెలుసా..? మొన్నమొన్నటివరకూ పంజాబ్ సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్యకు చెల్లెలు… అంటే అమరీందర్, సిమ్రన్‌జిత్ షడ్డకులు… ఐనా ఎక్కడా తన ఖలిస్థానీవాదంతో రాజీపడలేదు… 1999లో సంగ్రూర్ నుంచి గెలిచాడు… పార్లమెంటు తనను కృపాణంతో లోపలకు రావడానికి అనుమతించిందా లేదా అనేది వేరే సంగతి… తోటి సభ్యుల మనోభావాల కోసం కృపాణం కంపల్సరీ అనే తన పట్టుదలకు కాస్త సడలింపునిచ్చాడు…
ఆ తరువాత క్రమేపీ శిరోమణీ అకాలీదళ్ బలపడసాగింది… ఖలిస్థానీవాదం తగ్గుముఖం పట్టింది… సిమ్రన్‌జిత్ మాత్రం తన ప్రత్యేక దేశవాదంతో రాజీపడలేదు… పోటీచేస్తూనే ఉన్నాడు… అసెంబ్లీ ఎన్నికలు, లోకసభ ఎన్నికలు… జనం పట్టించుకోవడం మానేశారు… పలు ఎన్నికల్లో పోటీచేస్తూనే ఉన్నాడు… ఓడిపోతూనే ఉన్నాడు… దాదాపు 30 సార్లు జైలుకు వెళ్లి వచ్చి ఉంటాడు తను… మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి ఖలిస్థానీవాదుల మద్దతు దొరికింది… గెలిచాడు… లోకసభ సభ్యుడయ్యాడు… అలుపెరగని ఖలిస్థానీవాదం… అదే కిర్పాణ్, అదే సిద్ధాంతం, అదే దూకుడు, అదే ఆవేశం…
ఈమధ్య ఖలిస్థానీవాదం పంజాబ్‌లో మళ్లీ ప్రబలుతోంది… అది గమనించే బాదల్ అకాలీదళ్ బీజేపీ కూటమి నుంచి బయటపడింది… రైతు బిల్లుల ఆందోళనను ముందుపెట్టి ఖలిస్థానీవాదులు భారత ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు… ఎర్రకోటపై జెండా ఎగరేశారు… ఢిల్లీలో విధ్వంసాన్ని సృష్టించారు… నెలల తరబడీ ఢిల్లీ ముట్టడి కొనసాగింది… వాళ్లకు సహకరించిన ఆప్ పార్టీకి మద్దతు ఇవ్వబడింది… ఫలితంగా ఆప్ అనూహ్యంగా పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించింది…
అదెక్కడివరకూ వచ్చిందంటే… అంతటి మోడీ సైతం రైతు బిల్లుల మీద క్షమాపణ చెప్పాడు… పంజాబ్ పర్యటనకు వెళ్లినప్పుడు రైతులు ఓ బ్రిడ్జిని నిర్బంధిస్తే ప్రధాని మోడీ అసహాయంగా కొంతసేపు అలా చిక్కుపడిపోవాల్సి వచ్చింది… వెరసి, బ్రిటన్, కెనడాల్లోని ఖలిస్థానీ మద్దతుదారుల ప్రభావం దేశం మొత్తానికి అర్థమైంది… ఇది ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేని స్థితి…
ఇప్పుడు తను మళ్లీ ఎంపీ అయ్యాడు… తన సంప్రదాయ చిహ్నమైన క్రిపాణ్‌ను ధరించి పార్లమెంటుకు వెళ్తాడా..? రైతు బిల్లుల క్షమాపణ మేరునగధీరుడు మోడీ కృపాణ ప్రవేశానికి అనుమతిస్తాడా..? సిమ్రన్‌జిత్ తన కృపాణ పట్టుదలను మళ్లీ ప్రదర్శిస్తాడా..? ఖలిస్థానీవాదం మళ్లీ తన పట్టు నిరూపించుకుంటుందా..? ఇవీ ప్రశ్నలు… కాలం సమాధానం చెప్పాల్సి ఉంది…!! ఆ సమైక్య లగడపాటి తన వెంట తీసుకెళ్లిన పెప్పర్ స్ప్రే కన్నా ఇది ప్రమాదకరం కాదు కదా అంటారా… ఏమో… చూద్దాం…!!
Share this Article