అయిపోయింది, మోడీ పని అయిపోయింది, దేశమంతా చీదరించుకుంటోంది… తనకు పాలించడం రాదనీ, జనానికి మేలు చేయలేడనీ, ప్రత్యేకించి కరోనా విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయాడనీ జనం తిట్టిపోస్తున్నారు… చివరకు ఆర్ఎస్ఎస్, బీకేఎస్ వంటి కాషాయ సంస్థలు కూడా మోడీపై విమర్శలు స్టార్ట్ చేశాయి… బెంగాల్లో, యూపీ స్థానిక ఎన్నికల్లో పరాజయం తనను మరీ దిగజార్చింది… మరిక మోడీ తదుపరి అడుగులు ఏమిటి..? పాతాళానికి వెళ్తున్న తన పాపులారిటీ గ్రాఫ్‌ను పెంచుకోవడానికి ఏం చేస్తాడు..? అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదు..?…… ఇలా నిన్న పలు సైట్లలో, టీవీల్లో, పత్రికల్లో విశ్లేషణలు, వార్తలు గట్రా కనిపించాయి… రెండు సర్వేలు కూడా దాన్నే తేల్చాయి అని కూడా ఉదహరించాయి… అందులో ఒకటి సీవోటర్ సర్వే… రెండు మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక అమెరికన్ సర్వే సంస్థ రేటింగ్… నిజానికి మోడీ పాపులారిటీ బాగా తగ్గిందనీ, కరోనా విషయంలో చాలా వైఫల్యం ఉందనీ, ప్రత్యేకించి వేక్సిన్, ఆక్సిజన్ తదితర అంశాల్లో మోడీ ధోరణి ప్రజలకు తీవ్ర నష్టదాయకంగా మారిందనే అభిప్రాయం చాలామందిలో ఉంది… పెరిగింది… అంతెందుకు, కాషాయ శ్రేణుల్లోనే అసంతృప్తి ఉంది… ఆయన వైఫల్యం సగటు మనిషికి కూడా అర్థం అవుతూనే ఉంది… అయితే..?
ఈ సర్వేలను ఉదహరించడం మీద కొంత మాట్లాడుకోవాలి… సీవోటర్ సర్వే ఎప్పుడు జరిగింది..? తెలియదు… 2020లో 65 శాతం మంది ప్రజలు ‘మోడీ పాలన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం’ అని చెప్పారట, ఇప్పుడేమో 37 శాతం మంది మాత్రమే చెబుతున్నారట, ఇంత దారుణమైన పతనం మోడీ మీద ప్రజల కోపానికి, అసహ్యానికి సూచిక అంటూ కొన్ని సైట్లు రాశాయి… దాన్ని మన తెలుగు పత్రికలు కూడా కొన్ని అనువాదం చేసుకుని, అచ్చేసుకున్నాయి… కానీ సదరు సీవోటర్ సర్వే ఫలితాల లింక్ దొరకడం లేదు.., ‘మోడీ పాపులారిటీ బాగా పడిపోయింది’ అని సీవోటర్ ఫౌండర్ యశ్వంత్ దేశ్‌ముఖ్ రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నాడని వార్త… కానీ దానికి డేటా ఏదో ఉండాలి కదా… సరే, దాన్నలా వదిలేద్దాం… ఓసారి ఆ అమెరికన్ సర్వే సంస్థ మార్నింగ్ కన్సల్ట్ గురించి చెప్పాలి… ఇది కూడా ప్రశాంత్ కిషోర్ టీం తరహా… పొలిటికల్ ఇంటలిజెన్స్ సంస్థగా చెప్పుకుంటుంది… ప్రతి వారం కొన్ని దేశాల అధినేతలకు రేటింగ్స్ కూడా ప్రసాదిస్తుంటుంది…
Ads
అవి Australia, Brazil, Canada, France, Germany, India, Italy, Japan, Mexico, South Korea, Spain, United Kingdom, United States… కేవలం వీళ్లే ఎందుకు అనడక్కండి… ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే జిన్‌పింగ్, పుతిన్ తదితరులపై ప్రతివారం రేటింగ్ ఎందుకు ఉండదు అని కూడా అడక్కండి… ఎవరి ట్రేడ్ సీక్రెట్స్ వాళ్లకుంటయ్… ఎటొచ్చీ వాటి ప్రామాణికత, సర్వే శాస్త్రీయత చూడాలి… ఆ సంస్థ సైటులోనే చూస్తే, దాని శాంపిల్ సైజు 2126 అని కనిపిస్తుంది… అంటే 140 కోట్ల ప్రజల అభిప్రాయాన్ని ఈ సూక్ష్మ స్థాయి శాంపిల్ సైజు పట్టిస్తుందా..? దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చా..? వేలకువేల శాంపిల్స్‌తో చేసే ప్రిపోల్, ఎగ్జిట్ పోల్సే బోల్తా కొడుతున్నయ్… మరి ఈ రెండు వేల శాంపిల్స్..? సరే, ఆ సర్వే కూడా అక్కర్లేదు, నిజంగా మీడియా కావాలంటే ఫీల్డ్ విజిట్స్, గ్రౌండ్ రిపోర్ట్స్ చేయొచ్చు… లేదా ఒక ఒపీనియన్ పోల్ నిర్వహించొచ్చు… వాటి జోలికి వెళ్లకుండా మార్నింగ్ కన్సల్ట్ వంటి సర్వేలు, రేటింగ్స్ దేనికి..? ఇక్కడ ఓ దరిద్రం ఉందండోయ్… అప్పట్లో ఇదే మార్నింగ్ కన్సల్ట్ రేటింగులో మోడీకి మంచి రేటింగ్స్ వచ్చినప్పుడు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, రాజనాథ్సింగ్ తదితర నేతలు ఆహా ఓహో, మా బాసుకేం తక్కువ అన్నట్టుగా ట్వీట్లు కొట్టారు, ప్రెస్నోట్లు కొట్టారు, చప్పట్లు కొట్టారు… ఇప్పుడు సైలెంట్..? మరి అప్పట్లో ఇలాంటి సంస్థలకు లేని విశ్వసనీయతను కట్టబెట్టడం దేనికి..? ఇప్పుడు మింగలేక కక్కలేక నీళ్లు మింగడం దేనికి..?!
ఇది ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ వార్త… జాగ్రత్తగా ఆ బ్లర్బ్స్ చదవండి… అమెరికా ఇంటలిజెన్స్ సంస్థ వెల్లడించిందట… అదేదో అమెరికా ఇంటలిజెన్స్ విభాగం చెప్పినట్టుగా ఉంది… నిజానికి చెప్పింది ఎవరు..? మార్నింగ్ కన్సల్ట్ అనబడే ఓ పొలిటికల్ ఇంటలిజెంట్ సర్వే సంస్థ… చదివేవాడికి ఏమనిపిస్తుంది… అమెరికా వాడు తేల్చేశాడు, మోడీ పని అయిపోయిందట అనిపించేలా…! బ్రిటన్ పోలింగ్ ఏజెన్సీ సర్వేలోనూ ఇదే తేలింది అని మరో బ్లర్బ్ కనిపిస్తుంది చూడండి… అది యూగవ్ అనే సంస్థ… కానీ అది సొంతంగా, సపరేటుగా సర్వే చేసిందా..? ఈ మార్నింగ్ కన్సల్ట్ వాడి రేటింగునే స్వీకరిస్తోందా..? వార్త రాసేముందు కన్ఫరమ్ చేసుకోవాలి కదా… రాయిటర్స్, సీవోటర్ అందరూ ఆ రేటింగునే ప్రామాణికంగా తీసుకున్నప్పుడు, మనం కూడా వాటిని గుడ్డిగా తెలుగులోకి దింపేసుకోవాలా..?!
Share this Article