Sai Vamshi….. … హారతి ఎలా ఇవ్వాలో తెలుసా?
… అఖండ దీపారాధనకు ఎన్ని వత్తులు వాడాలి?
… తీర్థం తలకు రాసుకుంటే దోషమా?
Ads
… దేవుడికి వేసే దండలో ఎన్ని పువ్వులు ఉండాలి?
… ఏ నూనెతో దీపం వెలిగించాలి?
… దేవుడి నిర్మాల్యం ఎక్కడ వేయాలి?
... కొబ్బరికాయ మూడు ముక్కలైతే దోషమా?
… కుంకుమ ఏ వేలితో పెట్టుకోవాలి?
… గంధం ఎన్ని వేళ్లతో రాయాలి?
… ఓర్నీ! తెల్లారి లేస్తే యూట్యూబ్ నిండా ఈ వీడియోలే! మా నాయనమ్మ 70 ఏళ్లు బతికింది. అన్ని పూజలూ, నోములూ ఆమెకు కుదిరినట్టే చేసింది. మా అమ్మకైతే ఆ పట్టింపులేమీ లేవు. 20 ఏళ్ల క్రితం వరకూ ఈ పూజల మీద అంత పట్టింపు ఎవరికీ లేదు. ఎవరికి ఎలా తోస్తే అలా చేయడమే! మరీ డౌట్ వస్తే ఇంట్లో పెద్దవాళ్లని అడిగేవారు.
… ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ డౌట్ వచ్చినా వెంటనే యూట్యూబ్ తెరిచి అనంతలక్ష్మి గారి వీడియోలో, చాగంటి కోటేశ్వరరావు వీడియోలో చూసేయడం, ఇంకా అనుమానం ఉంటే ఏకంగా వాళ్ల ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి విసిగించడం, నానా రకాల హింసలూ పెట్టి, తమను తాము పెట్టుకుని మహా గొప్ప పూజలేవో చేసేయడం! ఈ మధ్య క్రిస్టియానిటీ, ఇస్లాంలో కూడా ఇలాంటివి వచ్చి ‘ప్రార్థన ఎంతసేపు చేయాలి’, ‘ఏ దిక్కున కూర్చోవాలి’ అనే వీడియోలు మొదలయ్యాయి. మరి ఇన్నాళ్లూ ప్రార్థన చేసినవాళ్లకు తెలియదా ఎలా చేయాలో? వాళ్లంతా నరకానికేనా?
… ‘దాసి’ సినిమాలో దొరసాని (రూపాదేవి) దేవుడి గదిలో పూజ చేస్తూ ఉంటే, దూరంగా కూర్చున్న దాసి కమ్లి(అర్చన) ఆ పూజతో తనకేమీ సంబంధం లేదన్నట్టు నిర్వికారంగా చూస్తూ ఉంటుంది. Hats off to the Director Narsinga Rao. ఈ పూజలన్నీ ధనిక వర్గాల హెచ్చులు. శ్రమ జీవుల వర్గానికి భక్తి మాత్రమే ప్రధానం. పూజలు కావు. మన తాతమ్మలు, అమ్మమ్మలు ఎంత సింపుల్‌గా పూజలు చేశారో తెలుసా? ఒక పువ్వు, కాసింత చక్కెర, ఒక అగర్‌బత్తీ(చాలా సార్లు అదీ ఉండదు), ఒక దండం.. బస్! అసలు చాలామంది బహుజనుల ఇళ్ళల్లో దేవుడి గదులే ఉండేవి కావు. ఇప్పుడు డబ్బు పెరిగింది. పూజ గదులు ఫ్యాషన్ సింబల్ అయిపోయాయి.
… “ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్ప దీ భరతమేదిని ముప్పదిమూడు కోట్ల దేవత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తు లారునే” అని రాసిన జాషువా గారి ‘గబ్బిలం’ గుర్తొస్తుంది.
… అయినా మనకు ఎందుకండీ ఆ తీరికమాలిన పూజలు? ఏ పుణ్యాల కోసం? ఎవరు నిర్ణయించిన స్వర్గం కోసం? ఎంచక్కా Work is Worship.. Happy Life is Heaven అనుకోలేమా?
(ఇలాంటి మూఢనమ్మకాల వీడియోలకు ఉద్యోగులకు బెంజ్ కార్లు ఇచ్చే ప్రముఖ చానెల్ పెట్టింది పేరు… అఫ్‌కోర్స్ అన్ని చానెళ్లూ ఇదే దందా… మెయిన్ స్ట్రీమ్ వినోద చానెల్స్ అని చెప్పుకునేవి కూడా పొద్దున్నే ఇలాంటి మూఢత్వ పద్ధతులే నేర్పిస్తుంటాయి… రంగురంగుల పూసల దండలు వేసుకుని కొక్కిరి భాషలో మాట్లాడే ఒకాయన సూచనలు మరీ ఘోరం… గరికపాటి ప్రవచనాలు నయం… ఆయన వాస్తు సహా చాలా మూఢ నమ్మకాల్ని ఖండఖండాలుగా నరుకుతుంటాడు… — ముచ్చట)
Share this Article