దగ్గుబాటి కుటుంబంలోని నలుగురి మీద కేసు నమోదు చేయాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశించింది… ఇది డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసు… మీకు ‘ఎమ్మెల్యేలకు ఎర కేసు’లో ఆమధ్య బాగా పేరు వినవచ్చిన ఓ వ్యక్తి గుర్తున్నాడా..? పేరు నందకుమార్… అదుగో ఆయన ఫిర్యాదు మేరకు కోర్టు దగ్గుబాటి సురేష్, వెంకటేష్, రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని చెప్పింది…
అబ్బే, సినిమాలకు సంబంధించిన కేసు కాదండీ బాబూ… ఇది ఆస్తులు, లీజులు, మోసాలకు సంబంధించిన కేసు… నిజానికి ఇన్నాళ్లూ ఈ కేసులో దగ్గుబాటి కుటుంబమే బాధితులుగా కనిపించింది… కానీ ఇప్పుడు కేసు టర్న్ తీసుకున్నట్టుంది… మరీ సాంకేతిక అంశాల్లోకి పోలేం కానీ… జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో… జుబ్లీహిల్స్ డివిజన్, ఫిలింనగర్ రోడ్ నంబర్ 1 లో దగ్గుబాటి కుటుంబానికి ఖాళీ స్థలాలున్నయ్… ఎవరి ప్లాటు వారి పేరిటే ఉంది…
అందులో వెంకటేష్‌ది 1000 గజాలు… ఐదేళ్ల క్రితం నందకుమార్ డబ్ల్యు 3 హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ స్థలాన్ని లీజుకు తీసుకుని డెక్కన్ కిచెన్ పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేశాడు… దాని పక్కనే ఫ్లాట్ నంబర్ 2లో దగ్గుబాటి రానాకు చెందిన వెయ్యి గజాల స్థలాన్ని కూడా నందకుమార్, భాగస్వాములు లీజుకు తీసుకుని నిర్మాణాలు చేపట్టాడు… లీజు గడువు పూర్తయ్యాక కూడా తన స్థలంలో నిర్మాణాలను చేపట్టారనేది రానా ఫిర్యాదు…
Ads
టౌన్ ప్లానింగ్ విభాగం ఈ ఫిర్యాదు పరిశీలించి, నోటీసులు జారీ చేసి, ఇక కూల్చివేతలకు పూనుకుంది… పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు… అదనంగా దగ్గుబాటి కుటుంబం వందల మంది బౌన్సర్లను ముందుపెట్టిందని నందకుమార్ కుటుంబం ఆరోపణ… లీజు అగ్రిమెంట్ పంపించారే తప్ప అసలు ఆ నిర్మాణాలకు అనుమతి ఎక్కడుందని, నోటీసులు ఇచ్చినా సరైన సమాధానాలు లేవని టౌన్ ప్లానింగ్ అధికారుల వాదన…
నిజానికి తాము లీజుకు తీసుకున్న స్థలాన్ని నందకుమార్ తన స్థలమే అని చెప్పి మరో ఇద్దరికి లీజుగా ఇచ్చి డబ్బు వసూలు చేశాడని మరో రెండు కేసులు కూడా పడ్డాయి… ఆ నిర్మాణాలకు సంబంధించి మేం కోర్టు స్టే తీసుకొచ్చినా సరే జీహెచ్ఎంసీ అధికారులు వినిపించుకోకుండా కూల్చేశారనేది నందకుమార్ కుటుంబం వాదన… ఇదీ కేసు…
ఆమధ్య హైకోర్టు కూడా ఈ కూల్చివేతలకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులపై సీరియస్ అయినట్టు వార్తలొచ్చాయి… ఇప్పుడు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఈ కూల్చివేతలపై దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదుకు ఆదేశించిందని తాజా వార్త… ఈ కేసు మెరిట్స్, డీమెరిట్స్ జోలికి ఇక్కడ వివరంగా పోలేం కానీ దగ్గుబాటి కుటుంబం మీద కేసు, పైగా ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడి వ్యవహారం కావడంతో కేసుకు ఇంపార్టెన్స్ వచ్చింది… అదీ సంగతి…
బీజేపీ మనిషిగా చెప్పుకుంటూ బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడనేది కదా నందకుమార్ మీద ఆరోపణ… అంతేకాదు, ఊరకరారు మహాత్ములు అన్నట్టుగా ఊరక కలవరు సీఎంను సినిమా సెలబ్రిటీలు అన్నట్టు… మొన్న దగ్గుబాటి సురేష్, వెంకటేష్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు… ఫోటోలు కూడా వచ్చాయి… ఆ కేసులోనే సాయం కోరుతూ కలిసినట్టు వార్తలు కూడా చదివినట్టు గుర్తు… దగ్గుబాటి కుటుంబం ఎవరినీ మర్యాదపూర్వకంగా కలవదు, వాళ్ల ప్రాక్టికల్ లెక్కలు వేరు… ఆ కేసు గురించే కలిసి ఉంటారు… ఇప్పుడు వాళ్లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది… పొలిటికల్, సినిమా సర్కిళ్లలో…!
Share this Article