.
ఒకటి కాదు, రెండు కాదు… చాలా అరెస్టులు… బీఆర్ఎస్ యాక్టివ్ నేతల్ని వెనక్కి నెట్టడానికి, దూకుడుగా ముందుకు రాకుండా ఉండటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక అరెస్టులు చేసింది…
ఇలా అరెస్టు, అలా బెయిల్… అంటే అంత వీక్ కేసులు… ఏవేవో సెక్షన్లు… పసలేని కేసులు… ఏవో సెక్షన్లు పెట్టేసి కేవలం వేధించడం కోసం పెట్టే కేసులు చివరకు ఏమవుతాయి..? జనంలోకి కూడా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ నెగెటివ్‌గా వెళ్తాయి…
Ads
వాటితో ఎవరికీ ఏమీ కాదు..? పైగా బీఆర్ఎస్ నాయకుల్లో ఇమ్యూనిటీ పెంచుతాయి… మరింత బలపడేట్టు చేస్తాయి… వీళ్లు పెట్టే కేసులతో ఏమీ కాదులే అనే ఓ తేలికభావం ఏర్పడుతుంది… అదే జరుగుతోంది… దాదాపు అన్ని అరెస్టులూ ఈ కేసుల బాధితుల్ని మరింత రాటుదేలడానికే ఉపకరిస్తున్నాయి…
నిజంగా రేవంత్ రెడ్డి ఉద్దేశం వీక్ కేసులు పెట్టి ఏదో తిప్పడం, వేధించడం మాత్రమేనా..? నిజంగా ఫిక్స్ చేయడమా..? నిజంగానే నాలుగు రోజులు జైలులో కూర్చోబెట్టాలనేదే ధ్యేయమైతే మాత్రం పోలీసులు సర్కారు ఉద్దేశాలకు ఏమాత్రం సహకరించడం లేదని లెక్క…
ఇవే కాదు… బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్, కవిత, కేటీయార్, కేసీయార్ ఎవరి మీద ఏ అభియోగాన్ని బలంగా ఈరోజుకూ ఫిక్స్ చేయలేకపోయింది రేవంత్ సర్కారు… అనేక ఆరోపణలు చేయడమే తప్ప బలంగా, సాక్ష్యాధారాలతో ఎందులోనూ బుక్ చేసిందేమీ లేదు…
ఫార్ములా కేసు గవర్నర్ పర్మిషన్ తీసుకుని మరీ ఏసీబీకి అప్పగించారు… అది కొన్నిరోజులు జైలులో ఉంచగలదేమో గానీ… పెద్ద పస ఉన్న కేసు కాదని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి… ఏదో గ్రీన్‌కో విరాళాలతో లింక్ పెడుతున్నారు గానీ, ఆ ఎన్నికల బాండ్లు చట్టబద్ధమే కదా… అందరికీ ఇచ్చింది ఆ కంపెనీ విరాళాల్ని…
కేబినెట్, సర్కారు అనుమతి లేకుండా నిధులిచ్చారనేది కేసు… ఈడీ కూడా ఎంటరైంది… కానీ ప్రొసీజరల్ ల్యాప్స్ వేరు, అవినీతి వేరు… ఈ కేసులో అవినీతిని నిరూపించడం కష్టమేనంటున్నారు… కవిత మీద మద్యం ముడుపుల కేసు కూడా కేంద్ర ప్రభుత్వం ఆప్ నేతలతోపాటు ఫిక్స్ చేసిందే తప్ప రేవంత్ సర్కారుకు సంబంధం ఏమీ లేదు ఆ కేసుతో… ఆ కేసు తరువాత ఆమె కూడా దృఢంగా మారిపోయి, మరింత యాక్టివ్‌గా ఫీల్డులో తిరుగుతోంది ఇప్పుడు…
ఐతే పోలీసులు కేసులు పెట్టడం వల్ల బీఆర్ఎస్ వాళ్ల మీద ఫీల్డులో సానుభూతి పెరుగుతుందా అంటే అదీ సందేహమే… ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద తాజా కేసు తీసుకొండి… ఏదో అరెస్టు, ముఖ్యనేతల హౌజ్ అరెస్టులు వంటి ఏదో హడావుడి క్రియేట్ చేశారు పోలీసులు, తీరా రిమాండ్ రిపోర్టు వీక్… ఈమాత్రం దానికి, పోలీసు స్టేషన్‌లోనే బెయిల్ ఇచ్చే సెక్షన్లు పెట్టాక ఈ హంగామా దేనికి..?
అదుగో పీడీ కేసు అంటారు… ఇదుగో ఇంకో కేసు అంటారు… నిజానికి కౌశిక్ రెడ్డిది దురుసు ప్రవర్తనే, పలు కేసులు కూడా పడ్డాయి… కానీ రేవంత్ రెడ్డి ఇలాంటోళ్ల జోలికి వెళ్లకూడదు… తన వ్యాఖ్యలు, తన చేష్టలతో బీఆర్ఎస్‌కే నెగెటివ్ అవుతున్నాడు కదా.., మరి రేవంత్ రెడ్డి సర్కారుకు ఏం నష్టం… కాగల కార్యం కౌశిక్ రెడ్డి తీరుస్తుంటే..!
ఇంకా నిజం చెప్పాలంటే… రేవంత్ రెడ్డి సర్కారుకు ఈరోజుకూ ఉన్నతాధికారగణం మీద గ్రిప్ రాలేదు… అనుభవరాహిత్యం కనిపిస్తోంది… ప్రత్యేకించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు కేసుల వివరాలు, ఫైళ్ల కదలికల మీద బీఆర్ఎస్ ముఖ్యులకు సమాచారం అందిస్తున్నారనీ, బీఆర్ఎస్‌కు పలు విధాలుగా సహకరిస్తున్నారనే అభిప్రాయం కూడా నెలకొని ఉంది…! లోగుట్టు పెరుమాళ్లకెరుక..!!
Share this Article