రైతులను బెదిరించి వసూళ్లు… 13 మంది విలేకరులపై కేసు… అసలు నిజాలేమిటో తెలియవు గానీ అనపర్తి పోలీసులు భిక్కవోలు పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలోనే చెప్పిన వివరాల ప్రకారం… ‘‘పొలాలు బాగుచేసుకుంటున్న రైతుల్ని బెదిరించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 13 మంది పాత్రికేయులపై కేసు నమోదు చేశాం… పగలు ఎండ తీవ్రత, వేడి గాలుల కారణంగా రాత్రి సమయంలో పొలాల్లోని ఎత్తుపల్లాలు సరిచేసుకుంటున్న రైతులను డబ్బు ఇవ్వాలని ఈ 13 మంది డిమాండ్ చేశారు, దౌర్జన్యం చేశారు… దాంతో రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు…
సుమారు 15 మంది వచ్చారు… డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తమ ట్రాక్టర్లు, జెసిబిల తాళాలు దౌర్జన్యంగా లాక్కోవడంతో ఘర్షణ జరిగింది… వారి వెంట తెచ్చుకున్న బటన్ స్టిక్కుల్తో దాడికి ప్రయత్నించారు… గ్రామస్థుల సహకారంతో ఈ ముఠాను ఎదుర్కున్నారు రైతులు… గత ఏడాదిగా విలేకరుల ముసుగులో కొంతమంది వ్యక్తులు మండలంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, డబ్బులు ఇవ్వని వారిపై ఇనుప రాడ్లు చూపించి, భౌతికదాడులకు పాల్పడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు…
కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన కర్రి రామకృష్ణారెడ్డి, మేడపాటి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, అమలాపురం జిల్లా రాయవరంకు చెందిన పాస్టర్ పలివెల ప్రసాద్, పందలపాకకు చెందిన రేపు సురేష్, బొమ్మ కంటి సుబ్బారావు, సొర్ల శ్రీనివాస్, పూలపల్లికి చెందిన మద్దూరు వీరబాబు, కొమరిపాలెంకు చెందిన మల్లిడి వెంకట కృష్ణారెడ్డి, మెట్రో రాజశేఖర్, బలభద్రపురం గ్రామానికి చెందిన కొండేటి శ్రీమన్నారాయణ కలిసి గత కొన్నేళ్లుగా మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో మండల వ్యాప్తంగా దందాలకు పాల్పడుతున్నారు…
Ads
ఈ ముఠా బిక్కవోలులోనే కాకుండా పెదపూడి, రంగంపేట, రాయవరం మండలాల్లోనూ తమ దందాలను విస్తృతపరిచి అక్రమార్కుల వద్ద నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు… అమాయక రైతుల్ని, వ్యాపారస్తుల్ని లక్ష్యంగా చేసుకుని, బెదిరింపులకు పాల్పడి, డబ్బులు ఇవ్వని వారిపై పరుష పదాలతో దూషించడమే కాకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని దర్యాప్తులో తేలింది. వీరి బాధితులెవరైనా ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు… వారికి తగిన భద్రత కల్పించి, చర్యలు తీసుకుంటాం’’…
ఎస్, ఇన్నాళ్లూ ఊళ్లపై దాడి చేసి భీతావహ పరిస్థితులు క్రియేట్ చేసి, వసూళ్లు చేసుకునే రెవిన్యూ, కరెంటు, పోలీస్ దళాలు తెలుసు… ఈమధ్య రకరకాల సంఘాలు పెట్టి ఊళ్లపై పడి బతుకుతున్న టీమ్స్ గురించీ విన్నాం… అంతెందుకు..? ఎక్కడికక్కడ హిజ్డాలు ముఠాలుగా మారి అడ్డగోలు వసూళ్లకు దిగుతున్నారు… సేమ్, పాత్రికేయులు… గ్రామీణ విలేకరులే కాదు, పట్టణాలు- నగరాల్లోని విలేకరుల మీద కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు… కింది నుంచి పైదాకా మామూళ్లు, వసూళ్లు… ఎవరి మీద ఎవరు చర్య తీసుకోగలరు..? అసలు రకరకాల యూట్యూబ్ చానెళ్ల గొట్టాలు పట్టుకుని మరీ తిరుగుతున్నారు… మెయిన్ స్ట్రీమ్ విలేకరుల హవా గురించి చెప్పనక్కర్లేదు…
(అనేకచోట్ల పోలీసులు కూడా పాత్రికేయులకు నెలసరి మామూళ్లు ఇస్తుంటారంటారు కదా… మరిక్కడ ఆ ‘మర్యాదల రేంజ్’ దాటిపోయిందా యవ్వారం..? హిజ్డాల విషయానికి వస్తే, శుభకార్యాలు చేసుకునేవాళ్లు గజ్జున వణికిపోతుంటారు వీరి వసూళ్ల బాగోతాలకు… మీరేమీ చేయలేరా, మీకేమీ చేతకాదా అనడిగితే ‘‘సర్లెండి, మొన్న మా ఎస్సయి ఇంట్లో పెద్దమనిషి ఫంక్షన్ చేస్తేనే పది వేలు వసూలు చేశారు హిజ్డాలు, మేమెవరికి చెప్పుకోవాలి’’ అని ఏడుపుమొహం పెట్టాడు ఓ పోలీసాయన… అయితే విలేకరులపై కేసు విషయంలో పోలీసులు చెప్పినవాటిల్లో నమ్మబుల్‌గా లేనివి, నవ్వొచ్చే మాటలు కూడా ఉన్నయ్…
రాత్రిళ్లు పొలాల్లో జేసీబీలు, ట్రాక్టర్లు వినియోగిస్తూ మరీ ఎత్తుపల్లాలు సరిచేస్తున్నారా..? నమ్మబుల్‌గా ఉందా..? పాత్రికేయుల ముఠాలు సరే, కానీ రౌడీ స్టిక్కులు, ఇనుపరాడ్లు పట్టుకుని మరీ రైతులపై దాడి చేసేంత సీన్ ఉందా..? పైగా గ్రామస్థుల సహకారంతో ఎదురుతిరిగామని చెబుతున్నారు కదా, ఒక్క పాత్రికేయుడికీ గాయాలు కాలేదా..? సదరు పాత్రికేయులు పనిచేసే చానెళ్లు, పేపర్ల పేర్లు చెప్పడం లేదెందుకు..? అక్రమ వసూళ్లు అనే పదం దేనికి..? సక్రమ వసూళ్లు కూడా ఉంటాయా..? అమాయక రైతుల దగ్గర ఏముందని వారి వద్ద వసూళ్లకు దిగారు..? అంటే రాత్రిళ్లు జేసీబీలు, ట్రాక్టర్లతో మరేదో దందా సాగుతోంది అక్కడ… అదెందుకు పోలీసులు చెప్పడం లేదు..? పాత్రికేయుల డిమాండ్లు, వసూళ్లు నిజమే కావచ్చుగాక… కాకపోతే మరీ ఇనుపరాడ్లతో దాడులు చేస్తారా..? ఇక్కడ పోలీసులు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు..? నిజంగా అక్కడ సాగుతున్న దందా ఏమిటి..? ఇంతకీ ఏమేం సెక్షన్లు పెట్టారు సార్..?!
Share this Article