.
రాద్దామా, వద్దా అనే డైలమా… ఎందుకంటే… కాల్చివేతలకు, కాపాడటానికీ, చివరకు లొంగుబాట్లకూ లెక్కలుంటాయ్ గనుక…
సాయుధ పోరాట విరమణను మావోయిస్టు పార్టీలో చర్చకు పెట్టి, రచ్చ రచ్చ చేసి, నేనయితే లొంగిపోతున్నాను, జనజీవనస్రవంతిలోకి వెళ్లిపోతున్నాను అని తన లేఖల ద్వారా పరోక్షంగా వెల్లడించి మరీ లొంగిపోయిన మల్లోజుల అలియాస్ సోను లొంగుబాటు వెనుక కూడా చాలా లెక్కలున్నాయా..?
Ads
మరీ ప్రత్యేకించి చత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులను పక్కనబెట్టి మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోవడానికీ మనువాద లెక్కలు ఉపకరించాయా..? నేషనల్ హోమ్ అఫయిర్స్ కూడా తన వంతు పాత్ర పోషించిందా..?
పొలిటికల్, జర్నలిస్ట్, పోలీస్ సర్కిళ్లలోనే కాదు, దేశ వామపక్ష తీవ్రవాద సానుభూతివర్గాల్లోనూ ఓ చర్చ సాగుతోంది… వాటి సారాంశం ఆసక్తికరంగానే ఉంది… చెప్పుకుందాం… తప్పేముంది, ఈ దేశ రాజకీయాలు, విప్లవాలు, ఉద్యమాలు కులాన్ని దాటి ఎదిగితే కదా..!!
వోకే… జనంలో ఉండక మావోయిస్టులు చాన్నాళ్లయింది… కొత్త రిక్రూట్మెంట్లు లేవు, యువతకు ఆసక్తి లేదు, సాయుధపోరాటం ద్వారానే రాజ్యాధికారం అనే ఓ విదేశీ భావజాల భావనకే కాలం చెల్లిపోయింది… కీలక నేతల అనారోగ్యం, కాలంతోపాటు మారలేని దురవస్థ… పడికట్టు పదాల్లోని భావదారిద్య్రం…
మరోవైపు రాజ్యం తరుముతోంది… ఆపరేషన్ కగార్ తాడోపేడో తేల్చుకునే దిశలో కదులుతోంది… చర్చలు, కాల్పుల విరమణ వంటి కాలం చెల్లిన ఎత్తుగడలను కేంద్రం నిష్కర్షగా తోసిపుచ్చింది… సీసీ మెంబర్ల దాకా భద్రత లేని దుస్థితి… మరోవైపు అగ్రవర్ణ నాయకత్వాలే తప్ప, బహుజన, గిరిజన నాయకత్వాలకు స్థానం లేదనే విమర్శలు…
అందుకే మావోయిస్టుల్లో ఇంటి పోరు, బయటి పోరు… జనంలో లేక ఎన్నాళ్లయింది..? కేవలం ఆత్మరక్షణకే అగచాట్లు… అన్నట్టు, బహుజన నాయకత్వమా అదేమిటి..? అవును, అదీ మావోయిస్టు వివిధ కమిటీల స్థాయిల్లో చర్చనీయాంశమే… ఎస్, లొంగుబాట్ల దగ్గరకు వద్దాం…
(అసలు ఈ లొంగుబాటు పెద్ద విప్లవ ద్రోహం అనే వాదనల్ని కాసేపు వదిలేస్తే….)
నో డౌట్, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ సోను దాదా అలియాస్ భూపతి అలియాస్ వివేక్ తన అనుచరగణం 60 మందితో లొంగిపోయాడు… ఏయ్, ఆయుధాలు పీఎల్జీఏకు అప్పగించి లొంగిపో అని వేరే జోనల్, రాష్ట్ర కమిటీలు హెచ్చరించినా సరే… ఎహె, పోరా అంటూ ఏడు ఏకే-47లు సహా 54 ఆయుధాలను రాజ్యానికి సరెండర్ చేసి, తను తలవంచాడు…
ఎక్కడ..? మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర… నిజానికి ఆ ఫడ్నవీస్ మీదకు గురిపెట్టాల్సిన ఏకే అది… అదే లొంగిపోయి… షేక్ హ్యాండ్ ఇచ్చింది… ఈ రేంజ్ లొంగుబాట్లు బహుశా మావోయిస్ట్ చరిత్రలో ఇక కనిపించవేమో…
కగార్ మరింత తీవ్రంగా ఉరమడం ఖాయం… ఐతే అటు చత్తీస్‌గఢ్ కాదు, ఇటు తెలంగాణ కాదు, హఠాత్తుగా మహారాష్ట్రలో లొంగుబాటు ఏమిటి..? ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ హిస్టారిక్ లొంగుబాటు క్రెడిట్ ఏమిటి..?
ఎస్, ఇదే ఇప్పుడు చర్చల్లో నిలుస్తోంది… ఇక్కడా మనువాద సమీకరణమేనా అని..! నాయకత్వ స్థానాల గురించి కాదు, మనువాద లొంగుబాట్లు అట…

సీసీ మెంబర్ లొంగుబాటు అంటే… జస్ట్, ఓ ఉదయమే వచ్చేసి, ఏదో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయే సినిమాటిక్ సీన్ కాదు… కొన్ని లెక్కలుంటాయి, ప్రాణాలకు భరోసా ఉండాలి… రివార్డుల లెక్కలుంటాయి… అన్నీ తేలాకే సరెండర్లు… అలాంటిది ఒకేసారి 60 మంది కీలక మావోయిస్టుల లొంగుబాటు అంటే..? ఆ క్రెడిట్ ఎవరికి దక్కాలనే రాజకీయాలు…
నేషనల్ హోమ్ అఫయిర్స్… దీనిదే కీలకపాత్ర… మహారాష్ట్ర సీ-60, తెలంగాణ గ్రేహౌండ్స్, చత్తీస్‌గఢ్ డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ వంటి ఎన్ని ప్రాంతీయ బలగాలున్నా… ఎంత ఎఫర్ట్ పెడుతున్నా సరే…
బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర బలగాలదే ప్రధాన పాత్ర… ఇటు చూస్తే చత్తీస్‌గఢ్… గిరిజన ముఖ్యమంత్రి, బీజేపీయే… అటు చూస్తే మహారాష్ట్ర ఫడ్నవీస్, పక్కా మరాఠీ బ్రాహ్మణుడు…
మరి మల్లోజుల ఎవరు..? అంటే, లొంగుబాట్లలోనూ మనువాదమేనా..? చివరకు బహుజన లొంగుబాట్లు ఉండవా..? నిజంగా ఓ ఆసక్తికరమైన చర్చ… పార్టీ, కులం కూడా పనిచేస్తాయా..? అవును, ఈ దేశంలో అవి పనిచేయనిదెక్కడ..?
నిజానికి లొంగిపోవాలనుకునే కీలక మావోయిస్టు నేతలకు తెలంగాణ బెటర్ స్టేట్… (స్టేట్ అంటే రెండర్థాలు… రాజ్యం, రాష్ట్రం)… రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాదాపు 400కు పైగా మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకంతో లొంగిపోయారు… మొన్నటిదాకా ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శివధర్ రెడ్డి కావచ్చు, ఎస్ఐబీ బాధ్యతలు చూస్తున్న సుమతి కావచ్చు, రేవంత్ రెడ్డి పాలసీ కావచ్చు…
సీసీ మెంబర్, నలుగురు స్టేట్ కమిటీ మెంబర్స్, ఇద్దరు డివిజనల్ కమిటీ సెక్రెటరీలు, 8 మంది డివిజనల్ కమిటీ మెంబర్స్, 35 మంది ఏరియా కమిటీ మెంబర్స్ కూడా 2025లో లొంగిపోయారు తెలంగాణలో… లొంగిపోతాం అనుకునేవాళ్లకు సేఫ్, సెక్యూరిటీ ప్యాసేజ్ నిజానికి తెలంగాణలోనే… నక్సలైట్లు అసలు బీజేపీ సర్కారును నమ్మరు… మరి..?
నిజానికి 12 మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్‌లో 8 మంది తెలంగాణ వాళ్లే… అలాంటిది తెలంగాణైట్ మల్లోజుల తెలంగాణ పోలీసుల ఎదుట గాకుండా… మహారాష్ట్రలో లొంగిపోవడం అనేదే తాజా చర్చనీయాంశం… విప్లవాల్లో ప్రతి తూటాకు లెక్క ఉంటుంది, ప్రతి అడుగుకూ లెక్క ఉంటుంది… అవును, లొంగుబాట్లకూ లెక్కలుంటాయి… రివార్డులు అంటారా..? మహారాష్ట్రదేముంది..? తెలంగాణ రెట్టింపు ఇవ్వగలదు…

ప్రస్తుత డీజీపీ, మొన్నటిదాకా ఇంటలిజెన్స్ చూసిన శివధర్‌రెడ్డి ప్రతి లొంగుబాట్ల సందర్భాల్లోనూ పదే పదే చెప్పిన తీరు గుర్తుంది… ‘మీరు లొంగిపొండి, మీ ప్రాణాలకు మాదీ భరోసా’ అని… డియర్ అమిత్ షాజీ… ఇక్కడా అవే లెక్కలా..? పోనీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మీకు ఈ లొంగుబాట్ల క్రెడిట్ తను తీసుకోవడం ఇష్టం లేదు సరే, పోనీ చత్తీస్‌గఢ్ సీఎం మీవాడే కదా… Why not he..?!
పైగా ఆ విష్ణుదేవ్ సాయి కూడా నక్సలైట్ల మీద పోరాడుతున్న నాయకుడే కదా… కన్వర్ అనే లోకల్ గిరిజన తెగకు చెందిన నాయకుడు… రేవంత్ రెడ్డికీ ఈ క్రెడిట్ దక్కనివ్వక, అటు మీ గిరిజన ముఖ్యమంత్రికీ దక్కనివ్వక… ఈ ఫడ్నవీస్ పక్షపాతం దేనికి నాయకా..?!………….. ఇవండీ రకరకాల అభిప్రాయాల క్రోడీకరణ సారాంశాలు… నిజానిజాలు తలవంచిన ఆ ఏకే-47కే ఎరుక..!!
Share this Article