.
సూరజ్ వి. భరద్వాజ్…. సెలెబ్రిటీల సారి’గమ స్వరాలు! ఐఆంసారీసోస్సారీ ….
ఈ, సారీ [#Sorry] గమ స్వరాల పరంపర చూస్తుంటే ఇది స్వస్తిశ్రీ శమించు [క్షమించు] నామ సంవత్సరమైతే కాదుగదా అన్న అనుమానం కలుగుతోంది! నూతన ఆంగ్ల సంవత్సరాదిలో అడుగు పెడుతున్న వేళ తెలుగు సంవత్సరాది శోభకృతనామ సంవత్సరం మేళవింపుతో వీవీఐపీల క్షమార్పణల పర్వాలను మనం ఇక్కడ ఒకసారి మననం చేసుకోవడం సముచితము [#Appropriate], లోకోత్తరకార్యము [#ExcellentWork] అని కూడా తలచి ఈ రైటప్ కోసం పెన్ను బిగించాను!
Ads
సహనం [#Tolerance] సౌభ్రాతృత్వం [#Fraternity] భారతీయులకు సహజసిద్ధంగా అబ్బిన లక్షణాలు! ప్రతి వ్యక్తి, ఇతర వ్యక్తి గౌరవానికి భంగం కలిగించకుండా జీవించాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి కూడా! ఆ మాటకొస్తే ఎవరూ ఎవరినీ కావాలని నిందించరు, కించపరచాలని కూడా అనుకోరన్నది పాక్షికంగానైనా నిజం!
క్షణికావేశంలో విచక్షణ కోల్పోవడం వల్లనే చాలా మంది చాలా సందర్భాల్లో మాటలు తూలుతుంటారు! కానీ, ఇందుకు మినహాయింపా అన్నట్లు కొందరు విచిత్రమైన [#Peculiar] మనస్తత్వం కలవాళ్లూ ఉండకపోరు! తమకు ఎదురు లేదన్న తల బిరుసుతో అలాంటి వాళ్లు మూర్ఖంగా వ్యవహరించడం కద్దు!
ఈర్ష్యా, అసూయలు, కక్షలు, కార్పణ్యాలతో రగులుతూ మనసా, వాచా, కర్మణా ఎదుటివాళ్ల పట్ల కర్కశంగా, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంటారు! ఆ కచ్చలో ముందు అనాల్సిందేదో అనిపడేస్తారు! తరవాత తీరిగ్గా ఆ ఇంగ్లీష్ వాడు నేర్పి పోయిన సారీ అన్న రెండు పొడి అక్షరాలు ముఖం మీద విదిలించి తమ తప్పులు దులిపి వేసుకుంటారు!
కళ్లు నెత్తికెక్కితే, ఎంతటి వాళ్లకైనా వాళ్ల చర్యలు, వాళ్ల మాటలు వాళ్లకు సైతం అర్థం కావు! తీరా మైకం దిగిపోయి, కళ్లకు కమ్మిన పొరలు తొలగిపోయాక తమ చేష్టలకు తామే సిగ్గు పడుతుంటారు! అలా, ముఝుకొ యారో మాఫ్ కర్నా, మై నషేమే హూ.. ఊ.. ఊ.. ఊ! అని సాంగు సింగుతూ అడుక్కునే సెలెబ్రిటీలు కొందరు, ముందు నోరుజారి, తరవాత నాలుక్కరుచుకుని సారీ చెప్పే ప్రముఖులు మరికొందరు, ఏకంగా చెయ్యే జారి, క్షమాపణలు వేడుకునే వీఐపీలు ఇంకొందరు! ఏదీ ఏమైనా చేసేదంతా చేసేసి, హలో, ప్లీజ్ ఎస్సూజ్ మీ, అని అనేవాళ్లే కోకొల్లలు!
మరి, ఇలా సారీ చెప్తే వాళ్లు చేసిన తప్పులన్నీ మాఫ్ ఐనట్లేనా? బాధిత జనం వాళ్లను ఒగ్గేసినట్లేనా? అంటే సందర్భం వచ్చేదాకా లోకం పోకడ మర్మం చిక్కడం కష్టం అన్నదే ఆన్సర్! ఆ చర్చ పక్కన బెడితే, అడుసు తొక్కనేల, కాళ్లు కడుగనేల అన్నట్లు, ఆమధ్య ఫిమేల్ స్టార్ సమంతపై నోరుజారి మంత్రి కొండాసురేఖ..,
హవా నడుస్తుందన్న భ్రమ ఆవరించి ఒళ్లూపై తెలియని మైకం కమ్మి, సంధ్యా థియేటర్ ఉదంతంలో ఫిల్మ్ స్టార్ అల్లుఅర్జున్…,
బురదలో కాలు పెట్టి, అది కాలుకంటిందని బాధపడి కడుక్కున్నట్లు., కల్లు కుండ, మటన్ ముక్క ఫిలాసఫీ చెప్పి తెలంగాణా సంస్కృతిని లోగ్రేడులో చూపించిన టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్రాజు…,
ఆర్టీసీ బస్సుల్లో మహిళల క్యాబరే డాన్స్ అని మాట తూలిన మాజీ మంత్రి కేటీఆర్…,
గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి…,
నచ్చావులే సినిమా హీరోయిన్ మాధవీలత పట్ల అసభ్యకరంగా మాట్లాడి నాలుక కరుచుకున్న జేసీప్రభాకర్ రెడ్డి…,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద అనుచిత ట్వీట్లు చేసిన రినౌన్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ…,
ఎన్నికల వేళ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, అతని పుత్రరత్నం లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధి శ్యామల…
ఇలా ప్రతిఒక్కళ్లూ ఎంచుకున్న దారే ఈ సోస్సారీ… ఆ నడుమ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని దుర్భాషలాడి, తరవాత మన్నింపులు చదివించారు!
ఇక, నా రూటే వేరంటూ, విపరీతమైన ఆవేశంలో పుసుక్కున చెయ్యి జారీ టీవీ 9 రిపోర్టర్ ను కొట్టి, కేసులకు బెడిసి లటుక్కున యూటర్న్ తీసుకున్న వెటరన్ స్టార్ మోహన్ బాబు & సన్స్ సైతం మూకుమ్మడిగా ఫ్యామిలీ ప్యాకేజీ సారీ చెప్పడం వైపే మొగ్గారు!
ఇదిలా ఉంటే, మాజీ సీఎం జగన్ పక్షపాతిగా ముద్రపడ్డ సినీ రచయిత పోసాని కృష్ణమురళి కూడా ప్రస్తుత పాలకులపై ఒకప్పుడు నాటు, ఘాటు వ్యాఖ్యలు చేసినవాడే! ఆ తరవాత, కేసులకు జడిసి వాటిని నిర్ద్వంద్వంగా ఉపసంహరించుకున్నవాడే! తదుపరి, క్షమాపణల పాఠం అప్పజెప్పి, ఏకంగా రాజకీయాల నుంచే నిష్క్రమించాడు!
బోల్డ్ స్టార్ శ్రీరెడ్డిదీ ఇంచుమించు అదే కథ! పవన్, లోకేష్, బాబులపై సోషల్ మీడియాలో అడ్డగోలుగా పెట్రేగి, అర్థాంతరంగా కొంగు ముడిచింది! సింపుల్ గా సారీ చెప్పేసి వంటావార్పు ప్రోగ్రాంలకు షిఫ్టైపోయింది!
హైదరాబాద్‌ల అడుగు పెట్టనీయం బిడ్డా అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ సాక్షిగా ఆవేశంగా నోరు పారేసుకున్న మరో ఎమ్మెల్యే దానం నాగేందర్, కోపం చల్లారాక, నన్ను చమించండి ప్లీజ్ అనేశాడు!
ఇక, సమాజంలో పేరుకుపోయిన నిర్లిప్తత, నిర్లక్ష్యాల వల్ల అనూహ్యంగా కొన్ని ప్రాణాంతక విపత్తులు సైతం సంభవిస్తుంటాయి! ఆ పరిస్థితులను ఆసరా చేసుకొని కొందరు తాము సున్నిత మనస్కులం అని ప్రకటించుకునే నాటకానికి తెరలేపే అవకాశాలూ లేకపోలేదు!
ఆ సంఘటనల పట్ల కపట సానుభూతిని ఒలకబోస్తూ, తాము నొచ్చుకున్నట్లు అభినయిస్తూ బాధితులకు ఒకింత ఉపశమనం లభించేలా క్షమార్పణలు చేస్తుంటారు అలాంటివాళ్లు! మొన్నటి తిరుపతి ఘటనలో రాజకీయ నాయకుల ఊరడింపు కూడా ఇలాంటిదే అన్నది పెద్ద విమర్శ!
ప్రమాదవశాత్తు అక్కడ జరిగిన ఆ తొక్కిసలాటపై స్పందించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తప్పైందంటూ బాధితుల ముందు లెంపలేసుకున్నారు! ఐతే, జరిగిన ఘోరానికి స్వయానా ఆయన అనుచరగణ జన సైనికులే కారణమన్న వాదనలున్నాయి! తన వాళ్ల తప్పును కప్పెట్టి, జనాల దగ్గర సింపతీ సంపాదించడం కోసం పవనుడు అలా వాళ్ల ముందు సాగిలాపడి సారీ డ్రామా నడిపించాడు అన్నది పబ్లిక్ టాక్!
ఇక, ఐతిహాసిక పురుషులు రామలక్ష్మణులు కేవలం ఫిక్షనల్ క్యారెక్టర్స్ మాత్రమే అని వ్యాఖ్యానించిన యాంకర్ శ్రీముఖి, ముజ్సే గల్తీ హోగయీ, ఫిర్ నహీ హోగా, ముఝే మాఫ్కీజియే అని వేడుకున్న విషయం తెలిసిందే! సో, మై డియర్ ఆల్…
ఇదీ, ఐ ఆం సారీ, సోస్సారీ.. కథా కమామీషు! ఈ సెలెబ్రిటీల సారీగమ స్వరాల వీడియోలు, ప్రకటనల కహానీ సంగతి సరే! మీ నియర్ అండ్ డియర్, క్లోజ్ ఫ్రెండ్స్ ల మధ్య ఇలా బేషరతు క్షమాపణలు చెప్పుకోవడం వల్ల కుదిరిన సంఝౌతాలు, సయోధ్యలు ఏమైనా ఉన్నయా? ఉంటే జెప్పన షేర్జెయ్యిండ్రి మరి!
Share this Article