మన తెలుగునాట సంస్కృతి మన్నూమశానం వంటి వ్యర్థపదాల గురించి ఆలోచించే మంత్రులెవరూ లేరు కాబట్టి సరిపోయింది… లేకపోతే… కేరళ కొత్త సాంస్కృతిక మంత్రిలా ఆలోచించి, నిజంగానే అలా అడుగులు వేస్తే, మన సీరియళ్లన్నీ క్లోజ్ అయిపోయేవి… అంతేకాదు, జబర్దస్త్ వంటి షోలు కూడా ఫసాక్ అయిపోయేవి… వావ్, నిజమా..? ఆ దిక్కుమాలిన ప్రోగ్రాములు ఆగిపోతే జాతికి మంచిదే కదా, మనుషుల మానసిక వైకల్య వ్యాప్తి ఆగిపోతుంది కదా అంటారా..? అసలు ముందు ఆ కేరళ కొత్త మంత్రి ఏమంటున్నాడో చూద్దాం… మొన్న కొత్తగా ప్రమాణస్వీకారం చేశాడు సాజి చెరియన్ అనే మంత్రి… సరే, కొత్త మంత్రులను వరుసబెట్టి ఇంటర్వ్యూలు చేస్తుంటాయి కదా టీవీ చానెళ్లు… ఏదో ప్రోగ్రాములో ఓ ప్రశ్నకు జవాబు ఇస్తూ… ‘‘అశాస్త్రీయతను, ప్రగతినిరోధకతను, మానవాతీత శక్తులను ప్రమోట్ చేసే కంటెంట్ ఉన్న సీరియళ్లను సెన్సార్ చేస్తాం… ఓ సెన్సార్ బోర్డు ఏర్పాటు చేస్తాం..’’ అని గట్టిగానే చెప్పాడు… సెన్సార్ చేస్తే మంచిదేగా… దరిద్రపు కంటెంట్ వెళ్లిపోయి, కాస్త చూడబుల్ కంటెంట్ మిగులుతుంది, తప్పేముంది అంటారా… భలేవారే… అలాంటి కంటెంట్ తీసేశాక, ఇక చూడటానికి ఏముంటుంది మన సీరియళ్లలో…!
ఎహె, ఇలాంటి నిర్ణయాలు అయ్యేవీ కావు, పొయ్యేవీ కావు… అసలే సృజనాత్మక స్వేచ్చ మరీ ఎక్కువై, అజీర్తి చేస్తున్న కేరళలో అది సాధ్యమేనా..? అసలు పచ్చి పచ్చిగా శృంగార సన్నివేశాల్ని ప్రసారం చేస్తున్న ఓటీటీల కంటెంటుకే ఆంక్షలు అమలు చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం… అలాంటిది టీవీ సీరియళ్లను కట్టడి చేయగలదా ఓ రాష్ట్ర ప్రభుత్వం..? ఇదే కదా మీ డౌటనుమానం..? తలుచుకుంటే చేయగలదు… కానీ చేయదు… ఆ కారణాల్లోకి, ఆ లోతు చర్చలోకి వెళ్తే ఇక బయటికి రాలేం… గతంలో దూరదర్శన్ ఒక్కటే ఉండేది పాపం… ఎంత తోపు సీరియల్ అయినా సరే, జస్ట్, 13 భాగాలే… అదీ వారానికి ఒక ఎపిసోడ్… ఎంత హాయిగా ఉండేది… శాటిలైట్ చానెళ్లు వచ్చాక, వందల సీరియళ్లు దాడి చేస్తున్నయ్ మనుషుల మెదళ్ల మీద…
Ads
ఏ భాషా సీరియల్ చూసినా అవే కథలు… మగ పాత్రలన్నీ నపుంసకం… అత్తలు, ఆడపడుచులు విలన్లు… కోడళ్లు నిత్య గృహహింస బాధితులు… ఇక మన తెలుగు టీవీ సీరియళ్లయితే… రకరకాల హత్యాపథకాలు… పేరొందిన ఉగ్రవాద సంస్థలు కూడా ఇంత సీరియస్‌గా హత్యా పథకాల్ని రచించరేమో… ఇవి చాలవన్నట్టుగా జ్యోతిష్కులు, తంత్రస్వాములు, సోదెమ్మలు, మాట్లాడే జంతువులు, దేవుళ్ల మహిమలు, లీలలు, పునర్జన్మలు…. వామ్మో, పాత పౌరాణిక సినిమాలు, మరీ విఠలాచార్య సినిమాలు కాస్త బెటర్… ఇవి గాకుండా కామెడీ రియాలిటీ షోలు… అంటే మన జబర్దస్త్ తరహా షోలు అన్నమాట… వికృత హాస్యం… నేలబారు క్రియేటివిటీ… పైగా లింగవివక్ష, కులవివక్ష, పిచ్చి వ్యాఖ్యలు, అక్రమసంబంధాల కంపు వాసన… నిజంగానే సెన్సార్ అమలు చేస్తే ఇలాంటివీ ఆపేసుకోవాల్సిందే…
అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ మీడియా ఆర్టిస్ట్స్ ప్రధాన కార్యదర్శి దినేష్ పనికర్ ఏమంటాడంటే..? ‘‘ప్రాక్టికల్‌గా ఇంత కంటెంటు చూడటం, సెన్సార్ చేయడం అసాధ్యం… ఇన్ని చానెళ్లు, ఇంత లెంతీ కంటెంటు చూస్తూ, కట్స్ సజెస్ట్ చేయడం, అదంతా కట్ చేయడం, మళ్లీ షూట్ చేసుకోవడం పెద్ద ప్రయాస… దీనికన్నా ప్రభుత్వం ఏ పనిచేస్తే బెటర్… సీరియళ్లలో, ప్రోగ్రాముల్లో ఏమేం ఉండకూడదో ముందే మార్గదర్శకాలు ఇవ్వాలి… స్వీయసెన్సార్… లేదా అసలు ఆయా అంశాల జోలికేపోకుండా ఉంటారు సీరియల్ నిర్మాతలు, దర్శకులు… అసలు సెన్సార్ అవసరమా..? ఇది క్రియేటివ్ ఫ్రీడం రెక్కలు కత్తిరించడం కాదా అనేదీ ప్రశ్నే… మళ్లీ ఆ చర్చ వేరు… టీవీలపై పెత్తనం, నిర్ణయాధికారం ఎక్కువగా కేంద్రం చేతుల్లో ఉంది… అందుకని చేస్తే గీస్తే కేంద్రం చేయాల్సిందే ఎక్కువ… ఢిల్లీలో ఎవరికీ సోయి లేదు… పోనీలే, మంత్రి వ్యాఖ్యలు ఈ చెత్తా సీరియళ్ల మీద చర్చనైనా లేవనెత్తుతాయి కదా, ఆమేరకు మంచిదే… మరి మన తెలుగు సీరియళ్ల మాటేమిటి అంటారా..? ఇలాగే మాట్లాడితే, ఇంకాస్త వెగటు ఘాటు పెంచుతారు, తరువాత మీ ఇష్టం…!!
Share this Article