.
ఎక్కడ, ఎవరు మొదలుపెట్టారనేది ముఖ్యం కాదు గానీ… తెలంగాణ రాజకీయాల్లో కూడా పరుషపదాలు, బూతులు, బెదిరింపులు, వ్యక్తిత్వ హననాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి… ఏపీ బురద రాజకీయాల బాటలోకి తెలంగాణ రాజకీయాలు ప్రవేశించాయి…
వర్తమాన రాజకీయ పంకిలంలోకి కేంద్ర సర్వీసు అధికారులు కూడా లాగబడుతున్నారు… ఉద్దేశపూర్వకమో, ఫ్రస్ట్రేషన్ ప్రభావమో గానీ… ఈ పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి… సరే, రెడ్ బుక్స్, పింక్ బుక్స్, హిట్ లిస్టులు గట్రా భాషతో కేంద్ర సర్వీసు అధికారులను డిమోరల్ చేయడానికి రకరకాల బెదిరింపులకు దిగడం అంటే… ఎట్‌లీస్ట్ పొలిటికల్ కోణంలో అర్థం చేసుకోవచ్చు అనుకున్నా సరే… వాడుతున్న భాష అభ్యంతరకరంగా వినిపిస్తోంది…
Ads
నిన్న ఎక్కడో ఆర్మూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అదుపు తప్పి వ్యాఖ్యలు, బెదిరింపులు చేస్తున్న వీడియో కనిపించింది… ‘‘పోలీసులకు లాగులో తొండలు జొరగొడతాం, వచ్చేది మా ప్రభుత్వమే…, సీపీ సజ్జనార్, నీకు ప్రత్యేకంగా వార్నింగ్, ఖబడ్దార్…, 2023 లో కేసు పెడితేనే ఏం పీకలేదు, నా బాస్ బొచ్చు ఏం పీకుతారు… వెంట్రుక కూడా పీకలేవు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపినిస్తే తెలంగాణ అగ్నిగుండమే’’ ఇలా సాగింది భాష…
అంతకుముందు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మీద మతకోణంలో అభ్యంతరకర వ్యాఖ్యలకు, బెదిరింపులకు దిగాడు… ఆయన మాటతీరు ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటోంది… చివరకు ఉన్నతాధికారగణం సీరియస్‌గా రియాక్టయ్యేసరికి సారీ చెప్పాడు… ఓ వీడియో విడుదల చేశాడు…
అంతకుముందే బీఆర్ఎస్ పెద్దలు ‘అధికారుల పేర్లన్నీ రాసిపెడుతున్నాం’ అనడమే కాదు… మొన్న హరీష్ రావు ‘‘ఏ పొక్కలో దాక్కున్నా వదిలిపెట్టం, సప్తసముద్రాలు దాటినా పట్టుకొస్తాం, విచారిస్తాం, ఎవరినీ వదిలిపెట్టం… కావాలని రిటైర్‌మెంటుకు దగ్గరగా ఉన్నవాళ్లు మమ్మల్ని ఇబ్బంది పెడితే, అంతకంతా అనుభవిస్తారు, మీ సొంత ఖర్చులతో కొట్లాడాల్సి ఉంటుంది, ఆలోచించుకొండి’’ అని బెదిరింపులకు దిగాడు…
(నిజానికి అధికారులను ఎలా పడితే అలా వాడుకోవడం బీఆర్ఎస్ అలవాటు… ప్రభాకర్ రావు సంగతే తీసుకొండి… కేసీయార్ సర్వీస్ ఎక్స్‌టెన్షన్ ఇచ్చి మరీ వాడుకున్నాడు… ఫోన్ ట్యాపింగ్ అరాచకం అంతా తనదే… సప్తపముద్రాలు దాటి పారిపోయి, అమెరికాలో సెటిలై, ఆశ్రయం పొందే ప్రయత్నాలు చేసినా, చట్టం ఇక్కడికి లాక్కొచ్చింది… చట్టవిహితంగా ఉండకపోతే అదే జరిగేది…)
ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు సందర్భంలో కావచ్చు బహుశా… కేటీయార్ సీపీ సజ్జనార్ మీద టార్గెటెడ్ వ్యాఖ్యలు చేసినట్టు గుర్తు… వీళ్లందరి వ్యాఖ్యలు చూస్తుంటే కావాలనే సీపీ సజ్జనార్, డీజీపీ శివధర్‌రెడ్డిలను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది… ఆర్ఎస్‌పీ వ్యాఖ్యలను బట్టి, అసలు వీళ్లే ఫోన్ ట్యాపింగ్ బాధ్యులు అని బీఆర్ఎస్ ముద్ర వేసే ప్రయత్నం కూడా చేసినట్టుంది…

ఇది ఊహించినట్టున్నాడు డీజీపీ… అందుకే బాధ్యతలు తీసుకోగానే ‘‘మాకు రూల్ బుక్ తప్ప మరే బుక్కుతోనూ సంబంధం ఉండదు… చట్టప్రకారం మాత్రమే వ్యవహరిస్తాం…’’ అని మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు…
కొన్ని నిజాలు ఏమిటంటే..? సజ్జనార్, శివధర్‌రెడ్డి ఏదో పక్షపాతం ప్రదర్శించిన పాత ఉదంతాలు ఏమీ లేవు… ఇదే కేసీయార్ సజ్జనార్‌కు ఆర్టీసీ ఎండీగా చాన్స్ ఇచ్చాడు… శివధర్‌రెడ్డితో కీలకమైన ఇంటలిజెన్స్ వర్క్ చేయించుకున్నాడు… ప్రభుత్వ ప్రయారిటీలు, నిర్ణయాల ప్రకారం నడుచుకుంటారనే భావనతోనే కదా కీలక బాధ్యతలు అప్పగించింది…
ఇప్పుడూ అంతే… ప్రభుత్వం ఫోన్ ట్యాపింగుపై సిట్ విచారణ అనే నిర్ణయం తీసుకుంటే, దాని ప్రకారమే నడుచుకుంటున్నారు… చట్టానికి విరుద్ధంగా పోవడం లేదు కదా… హరీష్ రావు బెదిరింపుల మీద పోలీస్ అధికారుల సంఘం కూడా నెగెటివ్‌గా రియాక్టయినట్టు గుర్తుంది…

మంత్రి కోమటిరెడ్డిని నైనీ బొగ్గు గని టెండర్ల జోలికి రాకుండా ఉండటానికే కదా… మహిళా ఐఏఎస్‌లతో అక్రమ సంబంధాలు అంటగట్టి రోత రాతలకు, కూతలకు దిగింది… దాని వెనుకా రాజకీయమే కదా… చివరకు ఈ రోత రాజకీయం, పాత్రికేయం మీద కేంద్ర సర్వీసు అధికారుల సంఘాలు సీరియస్‌గా రియాక్టయ్యే సరికి… చివరకు ప్రభుత్వం విచారణకు దిగడం, ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి…
నిన్నమొన్నటిదాకా, ఇప్పటికీ ఏపీ పాలిటిక్సు తరహా వేరు… బూతు, రోత, వెగటు, కక్షసాధింపుల రాజకీయాల్లోకి కీలక ఉన్నతాధికారులు కూడా లాగబడ్డారు… ఆ నిజానిజాల సంగతి పక్కనబెడితే… ఏపీ పాలిటిక్స్ బాటలోకి తెలంగాణ రాజకీయాలు వేగంగానే ప్రవేశపెట్టబడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది… ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి ఆ ధోరణి బలపడుతోంది..!! మన తెలుగు రాజకీయాలేనా, దేశమంతా ఇలాగే ఉందా..?!
Share this Article