Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పద్దెనిమిది చలిచీమలు కలిసి… తలా పది వేలు వేసుకున్న శ్రామిక చిత్రం…

October 7, 2024 by M S R

బక్కోళ్ళ సినిమా . అంటే కేవలం బక్క జీవుల మీద సినిమా అనే కాదు . నిర్మాతలు , నటులు అందరూ ఈ సినిమా తీసేనాటికి బక్కోళ్ళే . 18 మంది నిర్మాతలు తలా పది వేలు వేసుకుని ఈ సినిమాను నిర్మించారట . సినిమా ప్రొడక్షన్ పేరు కూడా శ్రామిక చిత్ర . కమర్షియల్ గా కూడా నిరుత్సాహపరచలేదట . ఈ 18 మంది నిర్మాతల్లో వేజెళ్ళ సత్యనారాయణ కూడా ఉన్నారు . తర్వాత కాలంలో చాలా సందేశాత్మక సినిమాలనే తీసారు .

మంధా వెంకట రమణారావు వ్రాసిన కొలువు అనే నవల ఆధారంగా ఈ చలిచీమలు సినిమా తీయబడింది . 1978 లో వచ్చిన ఈ సినిమాకు దేవదాస్ కనకాల దర్శకుడు . స్క్రీన్ ప్లేను వేజెళ్ళ సత్యనారాయణే తయారు చేసారు . దేవదాస్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇదే . ఈ సినిమాకు రెండు నంది అవార్డులు కూడా వచ్చాయి . రెండవ ఉత్తమ చిత్రంగా , ఉత్తమ కధగా అవార్డులు వచ్చాయి . పరుచూరి వెంకటేశ్వరరావు ఈ సినిమా ద్వారానే డైలాగుల రచయితగా అరంగేట్రం చేసారు .

నూటొక్క జిల్లాల అందగాడిని అనే నూతన్ ప్రసాద్ డైలాగ్ ఈ సినిమా లోనిదే . అలాంటిదే మరో మాట పొజిషన్ . ఈ రెండు డైలాగులు నూతన్ ప్రసాద్ పాత్ర బాగా ఉపయోగిస్తుంది . అతని పట్నంలో ఉంపుడుగత్తెగా తాతినేని రాజేశ్వరి బాగా నటించింది . ఈమెకు కూడా ఇదే మొదటి సినిమా అనుకుంటా . తర్వాత చాలా సినిమాల్లో నటించింది . కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర లాగా మలచాలని దేవదాస్ కనకాల ప్రయత్నించినట్లుగా అనిపిస్తుంది . ఎక్కడ కుదురుతుంది !? సావిత్రి లాగా మరెవరు నవ్వగలరు ?

Ads

ఊరుమ్మడి బతుకులు సినిమా హీరో సత్యేంద్రకుమార్ ఈ సినిమాలో కూడా ప్రధాన పాత్రధారుడు . బాగా నటించాడు . అతని భార్యగా శైలజ , వారి కొడుకు సాంబయ్యగా నటించిన బాలనటుడు చాలా బాగా నటించారు . ఆ పిల్లవాడి చదువుకోవాలి అనుకునే తపనను దర్శకుడు బాగా చూపారు .
శివకృష్ణకు కూడా మొదటి సినిమాయే . చాలామందికి ఈ విషయం తెలియదు . ఈ సినిమాలో ముందు రెవెన్యూ ఇనస్పెక్టరుగా , తర్వాత తాసిల్దారుగా నటించారు .

ఈ సినిమాలో మనకు తెలిసిన మరో నటుడు రాళ్ళపల్లి . అతనిది కూడా ప్రాముఖ్యత కలిగిన పాత్రే . ఈ సినిమాలో ఆయన ఒక పాటను వ్రాసి , ఆయనే పాడారు కూడా . ఇంక ఇతర నటీనటులు మనకు తెలిసినవారు కాదు . బహుశా ఔత్సాహిక నటులు , బాగా జూనియర్ ఆర్టిస్టులు అయిఉండాలి .

యాభై ఏళ్ళ కింద గ్రామాల్లో ఉండే సామాజిక , ఆర్ధిక దోపిడీలకు వ్యతిరేకంగా వచ్చిన సినిమా . ఇలాంటి సినిమాల ఒరవడి 1980s చివరిదాకా కొనసాగింది . తర్వాత తర్వాత మధ్య తరగతి జనాభా పెరిగాక భ్రమల్లో తేలాడే మనస్తత్వం పెరిగిపోవటం , ఈ బక్క సినిమాలకు , ఎర్ర సినిమాలకూ ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోయింది .

బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా ; బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ . వేయి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానతో సరి . ప్రపంచంలో రాజకీయ , సామాజిక , ఆర్ధిక చరిత్ర అంతా ఈ సందేశలతోనే నిండిపోయింది . ప్రతి బలిసినవాడు ఈ నగ్నసత్యానికి మినహాయింపు అనుకుంటాడు .

ఈ చలిచీమలు సినిమా యూట్యూబులో ఉంది . సామాజిక స్పృహ లేనివాళ్ళకు నచ్చదు , అర్థం కూడా కాదేమో ! ఈ సినిమాలో తోలుబొమ్మలాట కాసేపు ఉంటుంది . ఇప్పటి తరం వారు చూసి ఉండరు . చూడాలనే ఆసక్తి ఉంటే చూడండి .

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు     (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 1.74 లక్షల స్కామ్ సహారాకు… అప్పట్లో కేసీయార్ చేసిన సాయం, సలాం..!!
  • ఒరేయ్ గుండూ… బట్టతలపై బొచ్చు పెంచే మందొచ్చిందటరా…
  • అగ్నిపరీక్ష ఓ చెత్త తంతు… 3 గంటల లాంచింగే జీరో జోష్ నాగార్జునా…
  • అదిప్పుడు క్రిమినల్ గ్యాంగుల స్వీడన్… కిశోర బాలికలే గ్యాంగ్‌స్టర్లు…!
  • అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!
  • ఏదో ఓ పురాణకథని సినిమాకరిస్తే సరి… అప్పట్లో అదే పరుచూరి ట్రెండు..!!
  • ఫాఫం కేటీయార్… తన విలువను తనే దెబ్బతీసుకుంటున్నాడు..!!
  • ‘ఈ చీపురుపల్లి నుంచి ఆ డల్లాస్‌పల్లి దాకా’ బహుళ గాత్రవైవిధ్యం..!!
  • మిస్టర్ విజయ్, సినీ ఫ్యాన్స్ వేరు, ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలు వేరు…
  • పూకి… కాకపోతే బూకి… ఏదో ఓ పిచ్చిపదం… తెలుగోడంటే అలుసే కదా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions