డౌట్ లేదు… సింగర్ చిన్మయికి కాస్త తిక్కే… వైరముత్తుతో వైరం, మిటూ ఉద్యమం తర్వాత కోలీవుడ్ ఆమె మీద ఆంక్షలు పెట్టాక పెద్దగా పని లేకుండా పోయింది… దాంతో సోషల్ యాక్టివిస్టు పేరిట ఏవేవో అంశాల మీద ఏవో పోస్టులు పెట్టడం, సోషల్ మీడియాలో సంవాదాలతో పొద్దుపుచ్చుతున్నట్టుంది…
సుచిత్ర, కస్తూరి, చిన్మయి… తమిళంలో చాలామంది కనిపిస్తారు ఇలా… మన అనసూయే కాస్త నయమేమో… అవునూ, అనసూయ అంటే గుర్తొచ్చింది… రాయాలనుకున్నది అనసూయపై చిన్మయి తాజా ఆక్షేపణ… అనసూయ పేరు తీసుకోలేదు గానీ ఓ ట్వీట్ కొట్టింది చిన్మయి… కొత్తవేమీ దొరకలేదు… పాత తొమ్మిదేళ్ల క్రితం నాటి వీడియో కనిపించి ఆమె మనసు వికలమై పోయిందట…
Ads
‘‘ఓ ఫిమేల్ టీవీ షో హోస్ట్ ఓ పిల్లాడిని ముద్దుపెట్టుకొమ్మని అడుగుతోంది… పేరెంట్స్, అక్కడున్నవాళ్లు కేరింతలు కొడుతున్నారు… ఛిఛీ… ఈ రోజుల్లో ఏది బ్యాడ్ టచ్, ఏది సేఫ్ టచ్ పిల్లలకు చెప్పాల్సి ఉండగా ఇదేం ధోరణి..? పిల్లల చుట్టూ ఇలాంటి వాతావరణమా మనం కల్పించాల్సింది..? ఇది ఆమోదనీయమేనా..?’’ అని ఆమె ఉద్దేశం…
ఇప్పుడు ఆ పాత అనసూయ బాపతు వీడియో మళ్లీ కాస్త వైరలవుతోంది ఎందుకో… అది ఈ చిన్మయితో చూడబడిందేమో, అందుకే ఇలా స్పందించిందేమో అనుకుని తెలుగు సైట్లు కూడా అనసూయపై చిన్మయి విసుర్లు అని రాసిపారేస్తున్నాయి… చిన్మయి అనసూయను ఉద్దేశించే అన్నదా, మరో వీడియో ఏమైనా ఉన్నదానేది పక్కన పెడితే… అనసూయ చర్యలో తప్పేముంది అసలు..?
అప్పుడెప్పుడో జీతెలుగులో వచ్చిన షో అది… పిల్లల షో… అప్పటికి అనసూయ ఇంతగా సినిమాల్లోకి ప్రవేశించి రంగమ్మత్త, దాక్షాయణి పాత్రల తరహా ఇమేజీ రాలేదు… జస్ట్, టీవీ హోస్ట్ మాత్రమే… పైగా ఆ పిల్లాడిని ముద్దుపెట్టుకో అని అడగడంలో సరదా లాలింపు, ఆ పిల్లాడి మీద ప్రేమ తప్ప ఇంకేమున్నాయి..? ఏమాత్రం అశ్లీలం లేదు, ఉండదు… ఏం..? ఆ పిల్లాడిని బంధువులు, పేరెంట్స్ స్నేహితులు ముద్దులు అడగరా..? తప్పేముంది అందులో..?
చిన్మయికి లోకమంతా భీకరంగా, నీచంగానే కనిపిస్తున్నట్టుంది… ప్రతి దాంట్లోనూ రంధ్రాన్వేషణ, ఏదో తప్పు వెతికి, తప్పు లేకపోయినా తప్పుపట్టి, సోషల్ మీడియా అటెన్షన్ పొందాలనే పిచ్చి తాపత్రయం తప్ప ఈ ట్వీట్‌లో ఏముంది నిజానికి..? పేరెంట్స్ కూడా పక్కనే ఉన్నారు… అనసూయ వ్యవహార ధోరణిలో చిల్లరతనం ఉంటే వాళ్లెందుకు యాక్సెప్ట్ చేస్తారు..? హేమిటో… ఆ తమిళ సమాజం ఈ చిన్మయిని ఎలా భరిస్తుందో ఏమిటో ఫాఫం…!! అఫ్‌కోర్స్, మనం కూడా..!!
Share this Article