నిజంగా మంచి ప్రయత్నం… నిర్మాతగా పలు వెబ్ సీరీస్ నిర్మించిన అనుభవం ఉన్నా ఓ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిమ్ నిర్మాతగా నీహారికకు ఇదే తొలి అనుభవం… టేస్టు బాగానే ఉంది… కానీ..?
ఏ వంటయినా సరే, రకరకాల దినుసులన్నీ గుమ్మరించేయకూడదు… కలగాపులగం అయిపోతుంది… పులగం, కిచిడీ అయిపోతుంది… మొదట మంచి ధమ్ బిర్యానీ కోసం వంట మొదలుపెట్టి చివరకు ఏం వంటకం తింటున్నామో తెలియని జానర్ తయారవుతుంది…
కమిటీ కుర్రోళ్లు సినిమా కూడా అంతే… దర్శకుడు యదువంశీ పర్లేదు, ఒక్కోె సీన్ విడిగా చూస్తే తన ప్రతిభ కనిపిస్తూనే ఉంది, ఎటొచ్చీ… ప్రేమలు, ఊరి రాజకీయాలు, స్నేహాలు, రిజర్వేషన్లు, జాతర అన్నీ కలిపి కొట్టేసరికి ఇదేదో కొత్త జాతర, అనగా కొత్త జానర్ అయి కూర్చుంది… పైగా ఫస్టాఫులో స్నేహాలు… అదీ నైన్టీస్‌లో పల్లెటూర్ల వాతావరణానికి తీసుకెళ్లిన నాస్తాల్జిక్ సీన్లు బాగున్నా… సెకండాఫ్ తరువాత పూర్తిగా కథ తన అదుపు తప్పింది… ఎలా ముగించాలో తెలియక అడ్డదిడ్డంగా చుట్టేయడం కనిపించింది…
Ads
అప్పట్లో… ఊరు అంటే ఇప్పటి ఊరు కాదు… కులమతాలకు అతీతమైన మైత్రి, అప్పటి ఆటలు, పరిపక్వత లేని ప్రేమకథలు… కల్మషాలు తక్కువ, నవీనకాలం పెడపోకడలూ తక్కువే… అందుకే ఈ సినిమా ఫస్టాఫ్ చూస్తున్నప్పుడు దర్శకుడు మనల్ని పాత కాలంలోకి విజయవంతంగా తీసుకెళ్లాడు… కాస్త వయస్సున్న ప్రేక్షకుడు కనెక్టవుతాడు, తన పాత రోజుల్ని, ఊరి బతుకుల్ని గుర్తు చేసుకుంటాడు…
సైకిళ్ల మీద స్కూల్‌కి వెళ్లడం, ఏడు పెంకుల ఆట, కాల్వల్లో స్నానాలు, ఆదివారం ఉదయం ప్రసారమయ్యే పంచతంత్రం, క్రికెట్ మ్యాచ్, అప్పట్లో అమ్మాయి పుష్పవతి అయితే ఎలా ఉండేది, ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది అనేంత అమాయకత్వం, సీడీ షాపులు, అందులో దొరికే సీడీలు, జాతర, అందులో రికార్డింగ్ డాన్స్‌లు, అవన్నీ కూడా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళతాయి…
ఐతే… పదకొండు మంది హీరోలు… అనగా కమిటీ… ఐదారుగురు హీరోయిన్లు… వాళ్ల పరిచయాలకే చాలా టైమ్ తినేసింది… పైగా రిజర్వేషన్ల వంటి సున్నితాంశం తీసుకుని నడుమ వదిలేశారు… ప్రేమకథల్నీ అర్థంతరంగా ఎటో వదిలేశారు… అందులోనూ సెక్యులర్ జంటలు… పైగా పన్నెండేళ్లకోసారి జాతర… ఓ కుర్రాడి మరణం తాలూకూ విషాదం, అందరూ తలోదారిన వెళ్లిపోవడం, తిరిగి అందరూ కలవడం… ఆ కలిసే ఎమోషన్ బలంగా ఎస్టాబ్లిష్ కాలేదు… ఇవన్నీ సెకండాఫ్‌ను అనాసక్తికరం చేసేశాయి…
నిజానికి ఈ సినిమాకు హీరో సంగీత దర్శకుడు అనుదీప్… తనే పలు సీన్లను తన బీజీఎంతో ఎలివేట్ చేశాడు… సర్పంచి ఎన్నికలు, ఆ సందర్భంగా ఓ పాత్రధారి కొట్టే డైలాగులు జనసేన ప్రస్థానాన్ని గుర్తుచేస్తాయి… మరి నిర్మాత పవన్ కల్యాణ్ అన్న బిడ్డ… దర్శకుడు పవన్ కల్యాణ్ అభిమాని…!!
Share this Article