ఒక సెలవు రోజు విజయవాడ వీధుల్లో బలాదూర్ గా తిరగడానికి బయలుదేరితే కుంభవృష్టి మొదలయ్యింది. చలికాలంలో కూడా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేసే బ్లేజ్ వాడ లో వర్షంలో తిరగడం మంచిదే అనుకుని…అదే విజయవాడకు మహోన్నత జ్ఞానపీఠం తెచ్చిపెట్టిన తెలుగు సాహితీ వేయి శాఖల కల్పవృక్షం విశ్వనాథ చెప్పిన-
“నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛ దుద్యోతిత…”
నేలకు దిగి స్థిరంగా కురుస్తున్న నల్ల మబ్బులు తెచ్చిన చిరు చీకటిలో…మబ్బుల అంచుల్లో వెలిగే మెరుపుల అందాన్ని ఆస్వాదిస్తూ తిరుగుతుంటే…అక్కడక్కడా “విడిది ఇల్లు; విడిదిల్లు” బోర్డులు కనిపించాయి. గెస్ట్ హౌస్, సర్వీస్ అపార్ట్ మెంట్ల బోర్డులవి. విడిది ఇల్లు- విడిదిల్లు పదహారణాల తెలుగు మాట. గెస్ట్ హౌస్ కు ఆ మాట నిత్యవ్యవహారంలో వాడుతున్నట్లు నాకు అంతవరకు తెలియదు. బీసెంట్ రోడ్డు పక్కన రేకుల షెడ్డు టిఫిన్ సెంటర్ కు వెళితే…కౌంటర్లో టేబుల్ కు “మీకు మీరే వడ్డించుకొనవలెను” అన్న పలక తగిలించి ఉంది. సెల్ఫ్ సర్వీస్ అన్న మాటకు ఇలాంటి అద్భుతమయిన అనువాదం ఇదివరకు నేనెక్కడా చూడలేదు.
ఆమధ్య హిందూపురంలో తిరుగుతుంటే బస్టాండ్ పక్కన ఎం జి ఎం హై స్కూల్ రోడ్డు మీద సర్కస్ డేరా ఉంది. “అన్యదేశపు పెంపుడు జంతువుల ప్రదర్శన” అని తాటికాయంత అక్షరాలు కనపడిన ప్రతిసారీ మనసు పొంగిపోయింది. (ఉప్పల్‌లో ఓచోట ఫిష్ స్టాల్‌కు పచ్చాపలు అనే (పచ్చి + చేపలు) బోర్డు కనిపించింది…)
Ads
హైదరాబాద్- విజయవాడ రోడ్డు మీద చిట్యాల బ్రిడ్జ్ కు ముందు ఒక చోట “బాషా కట్టల పని” అని ఒక బోర్డు. లారీల్లాంటి పెద్ద వాహనాలకు సపెన్షన్ ప్లేట్లు తప్పనిసరి. పైన బరువును, కింద గుంతల్లాంటివి వచ్చినప్పుడు కుదుపులను తట్టుకోవడానికి ఈ ప్లేట్లు కీలకం. కొన్ని ప్లేట్లను ఒక క్లామ్ప్ కు బిగించి టైర్ కు బాడీకి మధ్య స్ప్రింగ్ యాక్షన్ వచ్చేలా అమరిక ఉంటుంది. వీటిని డ్రయివర్లు, మెకానిక్కులు తెలుగులో దశాబ్దాలుగా “కట్టలు” అంటున్నారు. కట్టకట్టిన ప్లేట్లు కాబట్టి కట్టలు. మొదట ఈమాటను ఎవరు కనుగొన్నారో కానీ…వారికి చేతులెత్తి నమస్కరించాలి. బహుశా ఇక్కడ ఆ పని చేసే మెకానిక్ పేరు బాషా. సస్పెన్షన్ ప్లేట్ వర్క్స్ అనే మాట అచ్చ తెలుగులో అందమయిన మాటగా “కట్టల పని” అయ్యింది.
తెలంగాణ- కర్ణాటక సరిహద్దు నారాయణ్ పేట్ ప్రాంతం నుండి వచ్చిన మా వాచ్ మ్యాన్ ను పక్కన ఇంకొకరితో కలిసి సగం- సగం వేసుకుని ఒక వస్తువును కొనుక్కోమంటే వద్దన్నాడు. ఎందుకు అంటే- “పొత్తుల సంసారం ఏనాటికయినా నెత్తి నొప్పే సార్” అన్నాడు. అన్నమయ్య అచ్చ తెలుగు పద కవితలో పల్లవి స్థాయిలో ఉంది అతడి మాట.
విజయవాడలో మా డ్రైవర్ బాషా సార్ “పవర్ గడ్డ” మరచిపోయారు అన్నాడు. సెల్ ఫోన్ పవర్ బ్యాంక్ కు అతడి పారిభాషిక పదమది. వెయ్యి మంది తెలుగు భాషాశాస్త్రవేత్తలు కలిసి కూర్చున్నా ఇంత మంచి అనువాద పరిభాషను పుట్టించలేరు.
జనం తమ భాషను తామే సునాయాసంగా, అత్యంత వేగంగా, సరళంగా సృష్టించుకుంటారు. ఎలాంటి తడబాటు, మొహమాటం లేకుండా హాయిగా ఆ భాషను వాడుతూ…తరువాతి తరాలకు అందిస్తారు.
నాజూకు ఎక్కువై కాకినడకా పోయి…హంస నడకా రాక…మనమే తెలుగు విడిదిళ్లు వదిలి కోరి కోరి ఇంగ్లీషు సర్వీస్ అపార్ట్ మెంట్లలో గెస్టులుగా వెళతాం. మనకు మనమే మన మాతృ భాషలో వడ్డించుకోలేక సెల్ఫ్ సర్వీసుల్లోకి దిగుతూ ఉంటాం. అన్యదేశపు పెంపుడు జంతువు ఏమిటండీ మరీ మొరటుగా!
ఫారిన్ బ్రీడ్ డాగ్ అంటే కుక్కే సింహమయినంత గొప్పగా లేదూ? కొందరికి- ఇంగ్లీషులో బూతయినా పొగడ్తలా ఉండి… తెలుగులో పొగడ్త అయినా బూతులా వినిపిస్తుందేమో! -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article