క్లియర్… ఇండి అసోసియేషన్‌లోని ఏ పార్టీ కూడా ఇక అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చు… హాజరు కాకూడదని కాంగ్రెస్ అధికారికంగా నిర్ణయం తీసుకుని ప్రకటించింది… కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఓ ప్రకటనలో తాము అయోధ్యకు వెళ్లడం లేదని స్పష్టం చేశాడు… బీజేపీ ఊపిరి పీల్చుకుంది…
సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరిలకు అయోధ్య ట్రస్టు ఆహ్వానాలు పంపించింది… కొన్నాళ్లుగా ఏదీ తేల్చకుండా నాన్చింది కాంగ్రెస్… ఈలోపు మమత బెనర్జీ మేం అయోధ్యకు వెళ్లం అని చెప్పడమే కాదు, బీజేపీకి ముడిపెట్టి ఏవో విమర్శలు కూడా చేసింది… నిన్న కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా ‘ఒకరు పిలిస్తేనే మేం గుడికి వెళ్తున్నామా..? వాళ్లు చెప్పిన తేదీలోనే ఎందుకు..?’ అని కామెంట్ చేశాడు, దాంతోనే అర్థమైంది కాంగ్రెస్ ఆ ఆహ్వానాల్ని తిరస్కరించబోతోందని…
అసలే ఎన్నికల కాలం… అందుకే బీజేపీకి ఉపయోగపడేందుకే హడావుడిగా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారనీ, ఇంకా ఆలయం పూర్తి కాలేదని కాంగ్రెస్ చెబుతున్న సాకు… ఒకవేళ కాంగ్రెస్, ఇతర సెక్యులర్ పార్టీలు హాజరైతే తమకు దక్కాల్సిన క్రెడిట్ దక్కకుండా పోతుందేమో అని భావించిన బీజేపీ వర్గాలకు దీంతో ఊపిరి పీల్చుకుంది… కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తెలిసీ తెలిసీ బీజేపీకి ఆ ఫాయిదా దక్కేట్టు చేస్తున్నాయి…
Ads
కానీ వచ్చేవి ఎన్నికలు కదా… మేమూ హిందువులమే అని చెప్పడానికి రాహుల్ గతంలో జంధ్యాలు ప్రదర్శిస్తూ, గోత్రాలు చెబుతూ, గుళ్లు సందర్శిస్తూ నానా ప్రయాసపడ్డాడు తెలుసు కదా… ప్రియాంక గంగాస్నానాలు కూడా చేసింది… సో, అయోధ్యకు వెళ్తేనేమో తమ సెక్యులర్ పాతివ్రత్యానికి మచ్చ… మరోవైపు హిందువులు బీజేపీ వైపు జరుగుతారేమో అని బెంగ… అందుకని సుప్రీం కోర్టు తీర్పును, రామభక్తులను గౌరవిస్తున్నామనీ అదే ప్రకటనలో ఓ డిస్‌క్లెయిమర్ పొందుపరిచారు…
ఇక కాంగ్రెసే ఇలా ప్రకటించాక… వీరనాస్తిక పార్టీ డీఎంకే సేమ్ అలాగే స్పందిస్తుంది కదా… సీపీఐ, సీపీఎం వంటి ‘లెఫ్ట్’ పార్టీలు కూడా అంతే కదా… ఆల్‌రెడీ సీపీఎం నేత ఏచూరి చెప్పినట్టున్నాడు… ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఏం ప్రకటిస్తుందో చూసి స్పందిద్దాం అనుకున్న దాని ఇతర భాగస్వామ్య పక్షాలు ఇక ఒకరి తరువాత ఒకరు ‘నో అయోధ్య- నో రామ్ లల్లా’ అని ప్రకటిస్తారు… పరోక్షంగా బీజేపీ ఏ ఫాయిదాను కోరుకుంటున్నదో దాన్ని దానికే దక్కేలా చేస్తాయి… బీజేపీ కోరుకున్నదీ ఇదే…
ఇవన్నీ సరే, మన తెలుగు రాజకీయాల్లో రేవంత్ అండ్ పార్టీకి క్లారిటీ వచ్చేసింది… గతంలో ఇదే అయోధ్యను తెగనాడి, మొన్నటి ఎన్నికల తరువాత అయోధ్యకు అనుకూలంగా ఒకటీరెండు వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వైఖరి ఏమిటో తెలియదు… జగన్‌మోహన్‌రెడ్డి ధోరణి అసలే అర్థం కాదు… అన్నట్టు, తెలుగుదేశాధీశుడు కూడా ఇప్పటివరకు అయోధ్య రాముడి మీద ఒక్క మాటా మాట్లాడలేదు… ఇంతకీ వీరిలో ఎవరెవరికి ఆహ్వానాలు వచ్చాయో…!!
Share this Article