ఓయిజా బోర్డు… OUIJA Board… ఆత్మలను పిలిచి మాట్లాడే ఓ మార్గం… నమ్మేవాళ్లు నమ్ముతారు… లేదంటే లేదు… దీని మీద చాలా కథలు, సినిమాలు వచ్చాయి… ఆ బోర్డు మీదకు వచ్చే ఆత్మలు డిస్టర్బ్ అవుతే వెళ్లిపోతాయి తప్ప వికటించి, ఆడేవాళ్లను ఆవహించవు… ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే… నయనతార ప్రధాన పాత్రలో కనెక్ట్ అనే సినిమా వచ్చింది…
అందులో మరణించిన తన తండ్రి ఆత్మతో మాట్లాడాలని ఓయిజా బోర్డు ద్వారా ప్రయత్నిస్తుంది ఓ బిడ్డ… కానీ తండ్రి ఆ బోర్డు మీదకు రాడు సరికదా ఇంకేదో దుష్టశక్తి వచ్చి ఆ బిడ్డను పట్టుకుంటుంది… అదీ కథ… హారర్ కథల్లో ఇంతకుమించి ఏముంటయ్…? ఈ సినిమాకు నిర్మాత నయనతార భర్త విఘ్నేశ్ శివన్… హారర్ చిత్రాల అనుభవమున్న అశ్విన్ శరవణన్ దర్శకుడు… ఎన్నడూ లేనిది నయనతార ప్రమోషన్లకు వచ్చింది… సో, ఈమాత్రం ఆసక్తి క్రియేటైంది ఈ డబ్బింగ్ సినిమా మీద…
ఆ ఆసక్తికి తగినట్టు ఆకట్టుకునే సీన్ లేదు… ఇవే కధలు, ఇవే కథనాలు… ఎన్నెన్ని చూశాం… ఇందులో కొత్తగా ఏం చూపించాలని అనుకున్నారు వీళ్లు… కాకపోతే హీరోయిన్ భర్త కరోనాతో చనిపోతాడు… అప్పటి లాక్‌డౌన్ పరిస్థితుల్ని కాస్త పద్ధతిగా చూపించాడు దర్శకుడు… కానీ అది హారర్ అనుభవం ఎలా అవుతుంది..?
Ads
సరే, ఓయిజా బోర్డు ద్వారా తండ్రి ఆత్మతో కనెక్ట్ కావాలని బిడ్డ ప్రయత్నిస్తుంది… ఏదో దుష్టశక్తి ప్రవేశిస్తుంది… ఆ బిడ్డను ఆవహిస్తుంది… కానీ ఆ దుష్టశక్తి ఎవరో, ఆ ఆత్మ మొర ఏమిటో, ఏం కోరుకుంటుందో, ఆ బిడ్డను ఎందుకు ఆవహించిందో చెప్పాలి కదా… హేమిటో… అంతా గందరగోళం… నయనతార పాత్రకు, నటనకు అస్సలు ప్రాధాన్యం లేదు… ఆమె కోసమే థియేటర్‌కు వెళ్లేవాళ్లకు తీవ్ర నిరాశ…
అనుపమ్ ఖేర్ ఆత్మల్ని వదలగొట్టే మంత్రగాడు… సత్యరాజ్ నయనతార తండ్రి… వాళ్లకూ పెద్ద స్కోప్ లేదు… అసలు సినిమా మొదట్లోనే దాని మీద ఇంట్రస్టు పోతుంది… అంతగా ప్రేక్షకుల్ని కథలో లీనం చేయలేకపోయాడు, ఎంగేజ్ చేయలేకపోయాడు… నయనతార బిడ్డ పాత్రలో నటించిన హనియా నఫీజ్ కాస్త బెటర్… అన్నింటికీ మించి 99 నిమిషాల్లో సినిమా ముగిసిపోవడం అతి పెద్ద రిలీఫ్… థాంక్యూ నయనతార…!! ఎటొచ్చీ… తులసిదళం దగ్గర నుంచి బోలెడు క్షుద్రకళల నవలలు, కథలు చదివాం మేం… ఈమాత్రం కనెక్ట్ కథ మాకు ఆనుతుందా..?!
Share this Article