మరాఠీ సినిమాలు, టీవీల్లో బాగా కనిపించే ఓ నటుడు ఆయన… పేరు చిన్మయ్ మండ్లేకర్… శివాజీ పాత్ర పోషణకు పెట్టింది పేరు… ఎనిమిది భాగాలుగా తీస్తున్న ఓ సినిమా సీరీస్… పేరు శివరాజ్ అష్టక్… ఆల్రెడీ ఆరు అయిపోయాయి… మరో రెండు చేయాల్సి ఉంది… అన్నింట్లోనూ అదే పాత్ర… బాగా చేస్తున్నాడు… కానీ..?
హఠాత్తుగా ఓ నిర్ణయం ప్రకటించాడు తను… ఏమనీ అంటే… ఆ రెండింట్లోనూ నేను శివాజీ పాత్ర పోషించను అని..! ఎందుకు..? ఓ చిత్రమైన వైరాగ్యం, బాధ… తన కొడుక్కి జెహంగీర్ అని పేరు పెట్టుకున్నందుకు సోషల్ మీడియాలో తన మీద విపరీతమైన ట్రోలింగ్ సాగుతోంది… దాంతో విసిగిపోయి ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు తను…
జెహంగీర్ పేరు మీద ట్రోలింగుకూ శివాజీ పాత్ర మానేయడానికి లింకు ఏమిటంటారా..? తెలియదు, తనే చెప్పలేకపోతున్నాడు… తనను ట్రోలింగుకు గురిచేస్తున్నవాళ్లంతా శివాజీ భక్తులని తన భావన… అసలు తన కొడుక్కి ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడో కూడా తనే సరిగ్గా చెప్పలేకపోతున్నాడు… ప్రపంచాన్ని జయించినవాడు అనే అర్థమొస్తుంది కాబట్టి తన భార్య నేహ ఆ పేరు పెట్టింది అని చూచాయగా ఏదో చెబుతున్నాడు…
Ads
నిజానికి సినిమాలు, టీవీలే కాదు, సెలబ్రిటీలందరికీ సోషల్ ట్రోలింగ్ బాధ తెలుసు… చాలామంది పట్టించుకోరు, ఎవడేం కూస్తే మనకేం అనుకుని దులిపేసుకుని, తమ పని తాము చేసుకుపోతారు… అదే అవసరం కూడా… కానీ చిన్మయ్‌కు ఇంకా ఆ తత్వం వంటపట్టనుంది…
మరి జెహంగీర్ పేరు మీద ఈ వ్యతిరేకత ఎందుకు అంటారా..? జెహంగీర్ అంటే మొఘల్ పాలకుడి పేరు… హిందూ వ్యతిరేకిగా పేరు… మీకు గుర్తుంది కదా.,. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ జంట తమ కొడుకులకు పెట్టుకున్న పేర్లు ఒకటి తైమూర్, మరొకటి జెహంగీర్… ఇందులో తైమూర్ మరీ హిందువుల ఊచకోతలకు ప్రసిద్ధుడు… ఈ పేర్లపైనా ఆ జంట మీద బాగా ట్రోలింగ్ సాగింది… వాళ్లు లైట్ తీసుకున్నారు, మా పిల్లలు, వాళ్ల పేర్లు మా ఇష్టం అని దులిపేసుకున్నారు…
కానీ అది మరాఠీ, మహారాష్ట్ర కదా… శివాజీ ఆరాధన ఎక్కువ… అందుకే ఈ జెహంగీర్ పేరు మీద వ్యతిరేకత, అందుకే ఈ శివాజీ పాత్రధారి మీద వ్యతిరేకత… మొఘల్ పాలకుల మీద పోరాడిన ఆ శివాజీ పాత్ర వేషాలు వేస్తూ ఆ మొఘల్ పాలకుడి పేరు కొడుక్కి ఎందుకు పెట్టుకున్నావని ఈ ట్రోలింగ్… ఆయన భార్య మీదా ట్రోలింగ్ నీచంగా… జెహంగీర్ నాలుగో మొఘల్ పాలకుడు, 1605 నుంచి 1627 వరకు పాలించాడు…
చిన్మయ్ కూడా అదే అంటున్నాడు… ‘నా నటన బాగా లేదా, విమర్శించండి, తప్పొప్పులు రాయండి, సరిదిద్దుకుంటాను, కానీ నా పర్సనల్ లైఫ్ మీద ఈ దాడి ఏమిటి..? మా అబ్బాయికి 11 సంవత్సరాలు, ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడే హఠాత్తుగా తన పేరు మీద ఏమిటి ఈ వ్యతిరేకత..? పోనీ, నా కొడుక్కి ఆ పేరు పెట్టుకున్నాను, అది తప్పు అయితే ముంబైలోని జెహంగీకర్ ఆర్ట్ గ్యాలరీ పేరు మారుస్తారా..?
అంతెందుకు… జేఆర్డీ టాటాకు భారత ప్రభుత్వం భారత రత్న ఇచ్చింది కదా, ఆ పేరులో జె అంటే జెహంగీర్… మరి దేశమంతా టాటా ఉత్పత్తులు ఫేమసే కదా… ఆదరిస్తున్నాం కదా… ఆయన స్పూర్తితోనే మా అబ్బాయికి పెట్టుకున్న పేరు మీదే ఏమిటీ ట్రోలింగ్…’’ ఇదీ చిన్మయ్ బాధ… ఇండస్ట్రీ నుంచి కొంత సపోర్ట్ తనకు వస్తున్నా సరే, ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు… ఇదీ కథ…
Share this Article