ట్రోలర్స్‌కు అత్యంత ఇష్టుడు… మంచు విష్ణు… సన్నాఫ్ మోహన్‌బాబు… వీళ్ల మాటలు, వీళ్ల చేష్టలు కొన్నిసార్లు నవ్వు కాదు, జాలి పుట్టిస్తుంటయ్… కనీసం జనం ఏమనుకుంటారనే స్పృహ కూడా ఉండదు… మా ఎన్నికల సమయంలో ఎన్నెన్ని ఆణిముత్యాలు వాళ్ల ప్రసంగాలు..? టంగుటూరి వీరేసం పెకాహం పంతులు అని నోరు తిరగని ఉచ్ఛారణతో విపరీతంగా ట్రోలైన విష్ణు… ఆమధ్య ఏదో ‘ఎప్పటికయ్యదమప్పటికి’ అని విచిత్రమైన తెలుగు పద్యం తను చదివిన తీరు మాత్రం నభూతో… నభవిష్యత్ అని చెప్పలేం…
ఆమధ్య సన్నాఫ్ ఇండియా మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంటే చివరకు లీగల్ నోటీసులు పంపించి మరీ అడ్డుకోవాల్సి వచ్చింది… కానీ తమ మాటల తీరుతో, తమ నడవడికతో తామే అవకాశం ఇస్తున్నామనే ఆత్మసోయి లేకుండా పోయింది… ఈమధ్య అందరూ పాన్ ఇండియా సినిమాలు తీసిపడేస్తున్నారు… మరి మా అధ్యక్షుడి ఇమేజీకి తనూ ఒకటి తీసి అలా పడేస్తే సరి, తనకేం తక్కువ అనుకున్నాడేమో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఓ సినిమా ప్రకటించాడు…
ఫాఫం, కన్నడాన్ని విడిచిపెట్టాడు… ఇంగ్లిషులో కూడా డబ్ చేసి పాన్ వరల్డ్ రేంజ్ అని అవతార్-2 కు పోటీగా వదిలితే సరిపోయేది… బహుశా తరువాత ఆలోచిస్తారేమో… అందులో ఈ పాన్ ఇండియా స్టారే గాకుండా జాతీయ నటి పాయల్ రాజ్‌పుత్, అంతర్జాతీయ నటి సన్నీ లియోనిని కూడా తీసుకున్నారు… అదేదో సైలెంట్ వార్ అనుకున్నారట తన టైటిల్ మొదట్లో… దాని మీద ట్రోలింగ్ సాగినట్టుంది… ఇక జిన్నా అని పెట్టాడు ఈ సినిమాకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న కోన వెంకట్ అనే పెద్ద మనిషి…
Ads
అసలు ఆ పేరు పెట్టుకోవడం తప్పు కాదు… దాందేముంది..? కరీనాకపూర్ తన కొడుకులకు తైమూర్, జహంగీర్ అని పేర్లు పెట్టుకుంది… ఓ సినిమాకు జిన్నా అని పెట్టుకుంటే తప్పేముంది..? అంతటి అద్వానీయే జిన్నాను ప్రశంసించాడు… పాకిస్థాన్ జిన్నాను తమ జాతిపితగా స్మరించుకుంటుంది… జిన్నా పేరు మాత్రమే కాదు… దావూద్ ఇబ్రహీం, జకీర్ నాయక్ అని పెట్టుకున్నా తప్పుపట్టాల్సింది ఏమీలేదు… కానీ దానికి సమర్థన మాత్రం దారుణంగా ఉంది…
ఇదే కోన వెంకట్‌తో ఏదో వీడియోలో సమర్థన చెప్పించారు… ‘‘అచ్చమైన తిరుపతి సినిమా… హీరో అసలు పేరు గాలి నాగేశ్వరరావు… తన పేరు తనకు నచ్చదు… అందుకని షార్ట్ ఫామ్‌లో జిన్నా అని పెట్టుకుంటాడు, అదే మన సినిమా టైటిల్’’ అని ఆ వీడియోలో కోన చెబుతుంటాడు… వీళ్లందరికీ తెలుగు ప్రేక్షకుల మీద అంతటి నమ్మకం… మనం ఏం చేసినా పిచ్చిజనం చూస్తారులే అని ఓ భ్రమ… గాలి నాగేశ్వరరావుకు షార్ట్ ఫామ్ గా.నా అవుతుంది, ఇంగ్లిషులో రాస్తే జీఎన్ అవుతుంది, కానీ ఇలా జిన్నా ఎలా అవుతాడు..? తెలుగు ప్రేక్షకులు హౌలాగాళ్లు కాదు వెంకట్… మొన్న సన్నాఫ్ ఇండియాకు రుచిచూపించారుగా… గుర్తులేదా..?
పైగా ఈ సినిమా టైటిల్ ప్రచారానికి తిరుమల కొండలను వాడుకుంటూ ఓ వీడియో విడుదల చేశారు… ఆ కొండల నుంచి సూర్యుడు ఉదయించినట్టుగా జిన్నా అనే టైటిల్ పైకి వస్తుంటుంది… ఏం క్రియేటివిటీ..? ఎంతటి అపూర్వ సృష్టి..? యావత్ తెలుగు ప్రజానీకం హృదయాలు పులకించిపోయాయి కోన వెంకటయ్యా… సార్, సార్, ఇక్కడే ఆపేస్తారా..? లేక రాబోయే వీడియోల్లో తిరుమల దృశ్యాలు, కాలిబాట, మహాద్వార దర్శనాలు కూడా ఉంటాయా..? ఎందుకంటే… తెలుగుజనం మానసికంగా ప్రిపేర్ కావాలి కదా…!! శ్రీవారు మిమ్మల్ని ఆశీర్వదించుగాక…!!
Share this Article