.
తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నాయకుల విమర్శల సారాంశం ఏమిటంటే..?
తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పేరుతో తెలంగాణ చరిత్రపై, అస్థిత్వంపై దాడి చేస్తున్న రేవంత్ రెడ్డి… తెలంగాణ తల్లి అంటే ఒక దేవతా మూర్తి… కిరీటం లేకుండా దేవత ఉంటుందా ?
Ads
కాంగ్రెస్ ప్రతిష్ఠించబోయే విగ్రహంలో బతుకమ్మ లేదు, తెలంగాణ అస్తిత్వం లేదు, అసలు తెలంగాణ ఆత్మనే లేదు, పిచ్చోడి చేతిలో రాయిలా విలవిలాడుతోంది నా తెలంగాణ తల్లి.
చెయ్యి గుర్తుతో ఉన్న కొత్త విగ్రహం, కాంగ్రెస్ తల్లి అవుతుంది. కానీ తెలంగాణ తల్లి ఎప్పటికీ కాదు, కాలేదు.
రేవంత్ రెడ్డి.. ఒకటి గుర్తు పెట్టుకో, కేసీఆర్ గారి మీద ద్వేషంతో, అసూయతో తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే నిన్ను చరిత్ర క్షమించదు…
సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి గానీ, రాజీవ్ విగ్రహాన్ని పెట్టడం ఏమిటి నాన్సెన్స్ అని కొన్నాళ్లు గాయిగత్తర… మరి పదేళ్లలో ఎందుకు పెట్టలేదయ్యా అంటే జవాబు ఉండదు… ఆ విగ్రహ స్థలానికి ఆ పవిత్రత ఏమిటి అసలు..?
సచివాలయం ఎదుట కాదు, ఏకంగా సచివాలయంలోనే పెడతాం అని రేవంత్ రెడ్డి అన్నాడు, పెడుతున్నాడు… అనధికారికంగా ఆ విగ్రహం ఫోటోలు లీకయ్యాయి… (ఈ విగ్రహం నిజమో కాదో గానీ… నిజమే అనుకుందాం కాసేపు)
నిజమే… కొత్త విగ్రహానికి కిరీటం లేదు… సో వాట్..? కిరీటం ఉంటేనే దేవతా మూర్తి అవుతుందా..? ఒక సగటు తెలంగాణ మహిళగా, అదీ సజ్జలు, మక్కలు పండించే ఓ గ్రామీణ రైతు మూర్తిగా ఉంటే తప్పేముంది..? మక్క, సజ్జ, జొన్న, వరి కంకులు, ఆకుపచ్చ చీరతో హరిత తెలంగాణ మూర్తిలా బాగానే ఉందిగా…
తెలంగాణ తల్లి అంటే ఇలా ఉండాలి అనే స్టాండర్డైజేషన్ ఉంటుందా..? నదులు, ప్రాంతాల్ని తల్లులుగా భావించి భక్తభావన కనబరుస్తాం, అది గౌరవప్రకటన, అభిమాన భావనే తప్ప తెలంగాణ తల్లి అంటే ఇలాగే ఉండాలని ఎవరు ప్రామాణీకరించారు…?
విగ్రహం రూపురేఖలు మారితే అది కేసీయార్ మీద ద్వేషం ఏముంది..? ఓ సగటు తెలంగాణవాది మదిలో మెదిలే ప్రశ్న ఇదే… ఇందులో తెలంగాణ చరిత్ర మీద దాడి ఏముంది..? తెలంగాణ అస్థిత్వం మీద దాడి ఏముంది..?
అవును, లోగోలు మారతాయి… తప్పేముంది…? వాటికి స్థిరరూపాలేమీ ఉండవు… బతుకమ్మ ఉంటేనే తెలంగాణ తల్లి అవుతుందా..? అదీ మరో చేతిలో పెడితే అప్పుడు పాలపిట్ట ఏది, తంగేడు పూలు ఏవి..? వంటి ప్రశ్నలూ వస్తాయి… చేయి చూపిస్తే అది కాంగ్రెస్ తల్లి అట… ఇదెక్కడి విడ్డూరం…
దేవతలందరూ ఆశీర్వదిస్తున్నట్టే అభయహస్తం చూపిస్తుంటారు… తిరుమల వెంకన్నో, భద్రాచలం రామన్నో ఓ చేయి ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటారు, తను కాంగ్రెస్ వెంకన్న అయిపోతాడా..? కాంగ్రెస్ రామన్న అయిపోతాడా..? దేవుడు గానీ, దేవత గానీ, తల్లి గానీ అభయహస్తమే చూపించేది… నిజానికి తెలంగాణ పోరాటమహిళ పేరిట చేతిలో ఓ దుడ్డుకర్ర ఉన్న విగ్రహం బొమ్మలూ ఆమధ్య కనిపించాయి…
ఉండొచ్చు… తెలంగాణ మీద కేసీయార్ ముద్రలన్నీ చెరిపివేయాలనే భావన రేవంత్ రెడ్డిలో ఉండొచ్చు… రాజకీయమే కావచ్చు… కానీ అది తెలంగాణ అస్థిత్వం మీద దాడి ఎందుకు అవుతుంది…? తెలంగాణ చరిత్ర మీద దాడి ఎలా అవుతుంది…? ఈ దేవతామూర్తి బొమ్మతో లిఖించిన చరిత్రకారుడు ఎవరు..?
ఆమధ్య మరీ చార్మినార్, కాకతీయ తోరణం మతసహనానికి, గంగాజమున తెహజీబ్ సూచిక అనీ గోల… అవి మతచిహ్నాలా…? చార్మినార్ అప్పట్లో ఓ పెద్ద విపత్తు నుంచి హైదరాబాద్ సమాజం తేరుకున్న జ్ఞాపకం, స్మారకం… కాకతీయ తోరణం ఆనాటి రాజరిక ముద్ర… చంద్రబాబు హయాంలో ప్రతి దానికీ హైటెక్ సిటీ బొమ్మను యాడ్ చేసేవాళ్లు…
కొందరు brs యాక్టివిస్ట్స్ మరీ ఈ కొత్త బొమ్మ రేవంత్ భార్య పోలికతో ఉందని పోస్టులు పెడుతున్నారు… ఏపీ పాలిటిక్స్ స్థాయికి తీసుకుపోతున్న ఫ్రస్ట్రేషన్…
విమర్శిస్తే… ఆ విమర్శలో హేతువు ఉండాలి, జనాన్ని కన్విన్స్ చేసేలా ఉండాలి… ఫక్తు రాజకీయ విమర్శలో కూడా పదే పదే అస్థిత్వం, చరిత్ర వంటి పదాల్ని వాడి, మేం అన్నదే ముద్ర, మేమేది చెబితే అదే తెలంగాణ తల్లి, మేం చూపిందే చరిత్ర అంటే ఎలా…? అవునూ, చత్తీస్‌గఢ్ తల్లి బొమ్మ ఎప్పుడైనా చూశారా..?
అప్పుడెప్పుడో… కేసీయార్ ఆ తెలంగాణ ద్రోహి చంద్రబాబు దగ్గర మంత్రిగా పనిచేస్తున్న కాలానికి ముందే అనుకుంటా… ఏదో పత్రికలో గీయబడిన తెలంగాణ తల్లి బొమ్మ ఏదో తెలుసా..? ఇదుగో…
కాళ్లకు కడియాలు, పట్ట గొలుసులు,… మెడలో చిన్న గొలుసు, పుస్తెలు… కాలి వేళ్లకు మట్టెలు… ఒక చేత్తో బతుకమ్మ, మరో చేతిలో కంకులు… అదీ అసలైన తెలంగాణ తల్లి బొమ్మ… రేవంత్, కేసీయార్ దొందూ దొందే… ఎవరికీ తెలంగాణ నిజ సోయి లేదు… టేస్ట్ లేదు… ఆఫ్టరాల్… పొలిటిషియన్స్ ఓన్లీ..!!
Share this Article