Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

క్రాక్… ఊళ్ల పేర్లనూ భ్రష్టుపట్టించాలా..? వేటపాలెం దేనికి ప్రసిద్ధో తెలుసా..?

August 3, 2023 by M S R

బ్రో అనే సినిమాలో సంస్క‌ృత పాట గురించి… పార్కిన్సన్ వ్యాధిపై అదే సినిమాలో రాయబడి ఓ డైలాగ్‌పై రెండు కథనాలు చెప్పుకున్నాం కదా… తాజాగా మిత్రుడు Gautham Ravuri క్రాక్ అనే సినిమాలో ఓ ఊరిని ప్రొజెక్ట్ చేసిన తీరుపై, వాస్తవంగా ఆ ఊరు దేనికి ప్రసిద్ధో చెబుతూ రాసిన ఒక పోస్టు ఆసక్తికరంగా చదివించింది… ముందుగా ఆ పోస్టు యథాతథంగా చదవండి ఓసారి…



తన కూతురు ఎవరో అబ్బాయితో సినిమా హాల్లో కనిపించిందని జయమ్మ చెప్పగానే ఆవేశంతో ఊగిపోతాడు ఖూనీకోరు కఠారి కృష్ణ. ఆడపిల్ల విషయం కనుక గుట్టుచప్పుడు కాకుండా పని కానివ్వాలని సలహా ఇచ్చిన జయమ్మనే వేటపాలెంకు పోయి రమ్మంటాడు కృష్ణ. వేటపాలెంకు చేరుకున్న జయమ్మ ఊళ్ళో దిగి ఒక గోళిసోడా తాగి నిర్మానుష్యంగా ఉన్న ఓ సముద్రతీరానికి చేరుకుంటుంది. అక్కడ ఓ చనిపోయిన గాడిదను రెండు కర్రలకు కట్టేసి తలకిందులుగా వేలాడదీసుంటుంది, కింద ఉన్న మట్టి మూకుళ్ళలోకి దాని రక్తం కారుతుంటుంది.

జయమ్మ రెండు వేళ్ళు నోట్లో పెట్టుకుని ఒక్క ఈల వేయగానే ఇసుక లోపల నుంచి పది మంది వస్తాదులు బయటకు వచ్చి, మట్టి మూకుళ్ళలో ఉన్న గాడిద రక్తాన్ని తాగి, దాన్ని ఒంటబట్టించుకునేందుకు అలసట వచ్చేదాకా అటూ ఇటూ పరుగెత్తుతారు. అలా చేయకపోతే శరీరంలోకి వెళ్ళిన గాడిద రక్తం గడ్డ కట్టి మనిషి గుండె ఆగిపోతుందని వాళ్ళలో ఒకడు జయమ్మకు చెబుతాడు. ఎటువంటి సాక్ష్యం దొరక్కుండా మనుషుల్ని అత్యంత కిరాతకంగా హతమార్చే కఠారి కృష్ణ రహస్య అనుచరులు వాళ్ళు.

రవితేజ హీరోగా ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన ‘క్రాక్’ సినిమాలో వేటపాలెం అనే ఊరికి అదే జిల్లాకు (అప్పటికి) చెందిన ఆ చిత్ర దర్శకుడు ఇచ్చిన నేపథ్యం. ఇప్పుడు విషయానికి వస్తే – చీరాల నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు ఈ వేటపాలెం, ఓ యాభై వేల జనాభా ఉంటారు. ఈ ఊరి పేరు ‘క్రాక్’ సినిమాలోనే మొదటిసారిగా విన్నవారు ఆ ఊళ్ళో ఒకప్పుడు అలాంటి క్రూరమైన మనుషులు నిజంగా ఉండేవారేమో అనుకున్నా ఆశ్చర్యం లేదు.
సినిమాల్లో వాణిజ్యపరమైన అంశాల కోసం ఆ ఊరి పేరును అలా వాడుకోవడాన్ని తప్పు పట్టను కానీ – ఆ సినిమాలో చూపించిన వేటపాలెం ఊరు నిజంగా దేనికి ప్రసిద్ధో చెప్పడమే (తెలియని వారికి) నా ప్రధాన ఉద్దేశం. 1918లో వేటపాలెం గ్రామానికి చెందిన స్థానిక ప్రజానేత శ్రీ ఊటుకూరి వెంకట సుబ్బారావు శ్రేష్టి ఆలోచన, సహాయసహకారాలతో ప్రారంభించబడిన ఓ గ్రంథాలయం – ‘సారస్వత నికేతనం’.
వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయం ఇప్పుడు సాహిత్యానికి సంబంధించి దాదాపు లక్ష పుస్తకాల భాండాగారంగా అలరారుతోంది. ఎందరో విద్యార్థులకు, పరిశోధకులకు, ఔత్సాహిక రచయితలకు ఎప్పటెప్పటి సమాచారం కావాలన్నా వేటపాలెం గ్రంథాలయంలో తప్పక దొరుకుతుందని ప్రతీతి. ‘జాతిపిత’ మహాత్మా గాంధీజీ ఇక్కడకు విచ్చేసినప్పుడు గుర్తుగా ఉంచిన తన చేతి కర్ర ఇప్పటికీ భద్రపరిచి ఉంది.

మిత్రుడు Nirmal Akkaraju తన ముత్తాత గారు 1924 లో రాసిన ‘ఒంగోలు రాజ్య చరిత్ర రామచంద్ర విజయం నాటకం’ అనే పుస్తకం కాపీ దొరికిన సంగతి చెప్పినప్పుడు వేటపాలెం గ్రంథాలయం గురించి నాకు తెలిసింది. అంతటి చరిత్ర కలిగిన చోట నేను రాసిన ‘పునాదిరాళ్ళు’ పుస్తకం కూడా ఉంటే… నేను గర్వంగా చెప్పుకోవచ్చనే ఉద్దేశంతో గత నెలలో వెళ్ళి అక్కడ రెండు కాపీలు ఇచ్చాను. సమాచారలోపం కారణంగా పనివేళలు కాసేపట్లో ముగుస్తాయనగా అక్కడికి చేరుకున్నాను. కానీ అక్కడి ఉద్యోగులు/నిర్వాహకులు నేను అడిగిన విషయాలన్నిటికీ చాలా ఓపిగ్గా వివరాలు చెప్పిన తీరు చాలా నచ్చింది. ఏదైనా పరిశోధన చేస్తున్నవారు రోజుల తరబడి ఊళ్ళో బస చేసేందుకు అదే ఊళ్ళో హోటళ్ళు లేవు కానీ దగ్గరి టౌన్ చీరాలలో ఏర్పాట్లు చేసుకోవచ్చు…

Ads



కరెక్టే కదా మరి… సినిమా అనేది అత్యంత బలమైన మాధ్యమం… ప్రజల మెదళ్లపై బలమైన ముద్రలు వేయగలదు సినిమా… ప్రేక్షకుల ఆలోచన రీతుల్ని ప్రభావితం చేయగలదు సినిమా… అలాంటప్పుడు ఒక ఊరి పేరును యథాతథంగా వాడుతున్నప్పుడు ఊరి విశిష్టత, ప్రాశస్త్యం చెడకుండా దర్శకులు జాగ్రత్త తీసుకోవాలి… స్టువర్ట్‌పురం అనగానే మనకు ఓ భావన కలుగుతుంది… ఇప్పుడక్కడ ఎంత మంచిగా బతుకుతున్నా తమ ఊరి పేరు బయట చెప్పలేని దురవస్థ… చిలకలూరిపేట అంటే అదోరకమైన భావనలకు ఆస్కారమిచ్చింది సినిమాలే…

ఊరి పేర్లు ఎన్నంటే ఎన్ని సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు… తద్వారా ఇప్పుడున్న ఊర్ల పేర్లను భ్రష్టుపట్టించకుండా కాపాడవచ్చు… నిజానికి అది దర్శకనిర్మాతల బాధ్యత కూడా… మరీ చంద్రబాబు భాషలో… (ఉదాహరణకు పులివెందుల అనగానే రౌడీలు అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన…) ఊళ్ల పేర్లను, ఆయా ఊళ్ల ప్రజల్ని కించపరచడం భావ్యం కాదు… ఈ కథనంలో చెప్పాలనుకుంటున్న భావమూ అదే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions