రెండేళ్లుగా మన మీడియా కరోనా మీద రకరకాల కథనాలతో భయపెడుతూనే ఉంది… భరోసా నింపే వార్తలు అక్కర్లేదు… ఫార్మాసురుల అబద్ధపు ప్రచారాలు, భీతిగొలిపే కుట్రవార్తల మీదే మన మీడియాకు ప్రేమ… అదుగో నాలుగో వేవ్, వచ్చె, వచ్చె, మళ్లీ ఎంత మంది చచ్చిపోతారో అన్నట్టుగా రకరకాల వార్తల్ని అయిదారు నెలలుగా రాస్తూనే ఉన్నాయి… చివరకు ఏ సంబంధమూ లేని ఎస్బీఐ, ఐఐటీల పిచ్చి లెక్కలను కూడా కాలాల కొద్దీ పేర్చి జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి… తాజా ఉదాహరణ ఏమిటంటే..?
కొన్ని దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ఎక్స్ఈ వేరియంట్ (కరోనా వైరస్‌లోనే మరో రకం) మన దేశంలో కూడా ప్రవేశించింది, ఇక ఏం కాబోతోందో అన్నట్టుగా మీడియా రాసిపారేసింది… ప్రతి మీడియా కరోనా విషయంలో ఓరకమైన శాడిస్టిక్ ధోరణితో వ్యవహరిస్తోంది… వేక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ మీద, ప్రజల్లో పెరుగుతున్న భయాందోళనలు, సందేహాల మీద ఒక్కటంటే ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా హౌజు ఈరోజుకూ స్పందించలేదు… ఎక్స్ఈ వేరియంట్ విషయానికొస్తే…
ఇది ముంబైలో ప్రవేశించినట్టుగా చెప్పింది ఎవరు..? ముంబై మున్సిపల్ అధికారులు… దీన్నే ప్రతి మీడియా పరిగణనలోకి తీసుకుంది… కానీ అదేసమయంలో వేరియంట్లను శాస్త్రీయంగా నిర్ధారించే ఇన్సాకాగ్ (ఇండియన్ సార్స్ కోవిడ్ జీనోమిక్స్ కన్సార్షియం) మాత్రం ఎక్స్ఈ వేరియంట్ ఉనికిని తోసిపుచ్చింది… జీనోమ్ టెస్టులో అది ఎక్స్‌ఈ వేరియంట్‌గా తేలలేదని పేర్కొంది… ఈ వేరియంట్ సోకిన వ్యక్తి సౌతాఫ్రికా నుంచి గత ఫిబ్రవరిలోనే వచ్చాడు… మరి ఒమిక్రాన్‌కన్నా వేగంగా సోకుతుందని చెబుతున్న ఎక్స్ఈ వేరియంట్ అప్పట్నుంచి బాగా వ్యాప్తి చెంది ఉండాలి కదా…
Ads
కరోనా కేసులు పెరుగుదల మీద పెద్ద పెద్ద వార్తల్ని ప్రచురించే మీడియా… ప్రస్తుతం దాదాపుగా కరోనా ఖతమైపోయినట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నా ఆ గణాంకాల మీద పెద్ద పట్టింపు చూపడం లేదు… నిజంగా అనేక ప్రాంతాల్లో పాత రోజులు కనిపిస్తున్నయ్… అన్నిరకాల కరోనా ఆంక్షల్ని సడలించారు… ఇంత త్వరగా మళ్లీ మునుపటి రోజులు కనిపించడం ఎంత రిలీఫ్… జరిగిన నష్టం జరిగింది… చాలారంగాలు దెబ్బతిన్నయ్… కానీ మెల్లిమెల్లిగా యథాపూర్వ స్థితి వైపు సొసైటీ అడుగులు వేస్తోంది…
నిన్నటి గణాంకాలు పరిశీలిస్తే… ఏపీలో కేవలం 3 కొత్త కేసులు… ఐసీయూల్లో, ఆక్సిజన్ మీద ఎవరూ లేరు… కేవలం 70 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి… తెలంగాణలో కొత్త కేసులు 22… యాక్టివ్ కేసుల సంఖ్య 252… బీహార్‌లో 2, జార్ఖండ్‌లో 4 కొత్త కేసులు… కొన్ని ప్రాంతాల్లో అసలు కొత్త కేసులే లేవు… మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది… ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెంది… దగ్గు, జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో ప్రమాదరహిత స్థాయికి చేరింది… ఓ నేచురల్ వేక్సిన్‌లాగా ప్రజల్లో టీసెల్స్‌కు, తద్వారా కోవిడ్ ఇమ్యూనిటీకి కారణమైంది…
ఢిల్లీలో వైద్యనిపుణులు ఏమంటున్నారంటే… ఈ కొత్త ఎక్స్‌ఈ వేరియంట్ కూడా ఇండియాలో ఎప్పట్నుంచో ఉంది అని… ఐనా సరే, పెద్దగా వ్యాప్తి లేనట్టే కదా… ఒకవేళ కొన్ని కేసులు టెస్టుల్లో బయటపడకపోయినా సరే, స్వల్ప అనారోగ్య లక్షణాలతో ప్రమాదరహితంగా ఉన్నట్టే కదా… ఎంతసేపూ నాలుగో వేవ్ మీదే వార్తలు రాసే మీడియాకు ఇవి మాత్రం పట్టవు… మరోవైపు ప్రభుత్వం మాత్రం బూస్టర్ డోసులు అంటూ, 12-18 ఏళ్ల వారికీ వేక్సిన్లు అంటూ ఇంకా హడావుడి చేస్తూనే ఉంది..!!
Share this Article