సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కడుపులో ఉన్నది కక్కేస్తాడు… పలుసార్లు హిపోక్రటిక్, డిప్లొమాటిక్ వికారాలేమీ ప్రదర్శించడు… కనీసం ఆ పార్టీకి అలవాటైన పడికట్టు పదాల్ని కూడా వాడడు… ఎవడో ఏదో అనుకుంటాడనే భావన కూడా రానివ్వడు… ఇప్పుడేం చెప్పాడంటే..? పరోక్షంగా… చంద్రబాబు తన విద్యార్థి జీవితం నుంచీ కులం పర్టిక్యులర్ రాజకీయాలే ప్రదర్శించాడనీ… ఈ కమ్మ-రెడ్డి వైరం దశాబ్దాల క్రితమే తిరుపతిలో చూసిందేననీ చెబుతున్నాడు… ఓహ్, అంటే ఇదేమీ కొత్త కాదన్నమాట… ఓహ్, ఈ రెడ్డి రాజకీయాల్ని జగన్ మాత్రమే ప్రారంభించి, ప్రదర్శించడం లేదన్నమాట… విషయం ఏమిటంటే..? జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు దివాకర్‌రెడ్డి మరణించాడు ఈమధ్య… ఆ దివాకర్‌రెడ్డిని స్మరించుకుంటూ నారాయణ విశాలాంధ్రలో ఓ వ్యాసం రాశాడు… ఆ పత్రిక ఎవరికీ దొరకదు గనుక రేపో మాపో సాక్షిలో గానీ, ఇంకేదైనా బూర్జువా పత్రికలో గానీ కనిపించవచ్చు…
Ads
ఇవి ఆయన వ్యాసంలోని కొన్ని భాగాలు… చంద్రబాబు రాజకీయ జీవితం తిరుపతిలో విద్యార్థి రాజకీయాల నుంచే స్టార్టయిన సంగతి తెలుసు కదా… నారాయణ కూడా అక్కడే… సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘం ఎఐఎస్ఎఫ్ కూడా అప్పట్లో అక్కడ చురుకుగానే ఉందన్నమాట… ఎమర్జెన్సీ కాలం తరువాత ఏదో కాలేజీ ఎన్నికల్లో దివాకర్‌రెడ్డిని నిలబెట్టారు… దివాకర్ రెడ్డిని గనుక మారిస్తే, ఇంకెవరిని పెట్టినా తాము మద్దతు ఇస్తామని చంద్రబాబు సంప్రదింపులు స్టార్ట్ చేశాడు… కానీ దివాకర్ కులంతో తమకు పనిలేదనీ, మార్చబోమనీ నారాయణ చంద్రబాబుకు చెప్పాడు… చంద్రబాబు వర్గానికీ, దివాకర్‌రెడ్డి వర్గానికీ నడుమ ఘర్షణలు, కత్తిపోట్ల దాకా వెళ్లేది వాతావరణం… అది గుర్తుచేసుకున్నాడు నారాయణ… తన మాటల్లో అర్థమయ్యేది ఏమిటంటే..? చంద్రబాబు అప్పట్నుంచే కులం పర్టిక్యులర్… ఆ రోజుల నుంచే చంద్రబాబును వ్యతిరేకించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా దివాకర్రెడ్దికే సపోర్ట్ చేసేవాడు… దివాకర్ పార్టీ ఏమిటనేది పట్టించుకోలేదు…!!
ఆంధ్రా రాజకీయాల్లో సీపీఎం కొంతమేరకు కమ్మ, సీపీఐ కాస్త రెడ్డి ఓరియంటేషన్తో… వాటి అనుబంధ విభాగాలు కూడా అలాగే వ్యవహరిస్తాయనే అపప్రథ చాన్నాళ్లుగా వినిపించేదే… (ఆ చర్చ ఇక్కడ అనవసరం, అప్రస్తుతం)… అయితే తెలుగు రాజకీయాల్లో కులం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో బలమైన ప్రభావం చూపించే ఫ్యాక్టరే… అదీ నారాయణ పాత జ్ఞాపకాల్ని బట్టి అర్థమయ్యేది… అప్పట్లో కనీసం ఏ సిద్ధాంతాల మాటునో దాగి ఉండేది కులం… కానీ ఇప్పుడు..? బహిరంగంగానే… కులం ప్రాతిపదికన రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు, పోరాటాలు, వర్గీకరణలు… ఐనా ఇది ఓ పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు… కామ్రేడ్ నారాయణది సుదీర్ఘ రాజకీయ జీవితం కాబట్టి… సీపీఐ కోణంలో రాసినా సరే, తన జ్ఞాపకాల్ని అక్షరబద్ధం చేస్తే… తెలుగు కుల రాజకీయాలు ఇంకా ప్రస్ఫుటంగా అర్థమయ్యే అవకాశముంది..!!
Share this Article