కామ్రేడ్స్.. కమాన్..
వీటికి బదులివ్వండి.. !
సుదీర్ఘ ఉద్యమ చరిత్ర, ఒకానొక దశలో ఈ దేశ రాజకీయాలనే శాసించిన శక్తివంతమైన ‘ఎర్ర’ జెండా ఇప్పుడు ఎక్కడ ఉన్నది.? ఏ స్థితిలో ఉన్నది..? ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ఎదిగిందో.. ఎలా పడిపోయిందో తల్చుకుంటే బాధేస్తున్నది, జాలేస్తున్నది.
ఎందుకంటే..
Ads
నా కాలేజీ రోజుల్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా పనిచేసినోడిని కాబట్టి..!
నేనూ ఒకప్పడు ఆ ఎర్ర జెండాను మోసినోడిని కాబట్టి..!!
నా ఇంటిపై ఆ జెండాను సగర్వంగా ఎగరేసినోడిని కాబట్టి..!!!
————-
‘అవన్నీ సరే.. ఇప్పుడు సడన్ గా ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు.. ఎందుకు ఏకరువు పెడుతున్నట్లు…?’ అని, ‘కామ్రేడ్ల’కు చికాకు రావచ్చు.. కస్సుబుస్సులాడొచ్చు. అది సహజమే..! అర్థం చేసుకోగలను. ఇక్కడ నా ఈ ‘ప్రస్తావన’, ‘ఏకరువు’కు చాలా చిన్నదైన ఓ సందర్భం ఉంది.
అదేమిటంటే..
మొన్న రాత్రి వాట్సాప్ పోస్ట్ ఒకటి కనిపించింది. అందులోని సారాంశాన్ని మూడు ముక్కల్లో చెబుతాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్లను బ్లాక్ లో అమ్మితే థియేటర్లను ముట్టడిస్తామని ఓ యువజన సంఘం నాయకుడు.. విలేకరుల సమావేశం పెట్టి మరీ హెచ్చరించాడు. టికెట్లను బ్లాక్ లో అమ్మితే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు తీవ్రంగా నష్టపోతారని ఆ నాయకుడు ఆందోళన – ఆవేదన వెలిబుచ్చాడు. ఇలా జరగడానికి వీల్లేదంటూ.. తమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తామని సెలవిచ్చాడు. ఆ సంఘం పేరు- డీవైఎఫ్ఐ. సీపీఎం అనుబంధ యువజన సంఘం. ‘ఆ నాయకుడి పేరు శివ.. ఏపీలోని నంద్యాల పట్టణ కార్యదర్శి..’ ఇత్యాది వివరాలేవీ ఇక్కడ అంత ముఖ్యం కాదు.
అక్కడి యువతకు సమస్యలేవీ లేవు కాబోలు.. ఈ టికెట్ల ధర పెంపు తప్ప. లేదా, ఏదో ఒక కార్యక్రమం చేపట్టడానికి ఈ సంఘం నాయకుడికి ఇదొక్క ‘సమస్యే’ కనిపించి ఉండొచ్చు. యూత్ ను పోగేయడానికి, సంఘం జెండా పట్టుకుని వీధుల్లోకి వెళ్లడానికి ఇదొక మంచి అవకాశమని అనిపించి ఉండొచ్చు. అతడిని తప్పుబట్టాల్సిందేమీ లేదు. కాకపోతే, ఒకప్పుడు అనేకానేక సీరియస్ ఇష్యూస్ పై యువతను ఉద్యమ బాటన నడిపించిన డీవైఎఫ్ఐ.. నేటి తరం యువజనానికి సమస్యలేవీ లేవన్నట్లుగా, వారి కోసం చేయదగ్గ సత్కార్యమేదీ లేనట్లుగా ఇలాంటి సిల్లీ సమస్యలపై పోరాడుతుంటే… ‘నా సంఘం ఎంత ఎత్తుకు ఎదిగిందో…?!’నని
సంబరపడాలా..?
బాధపడాలా..?
జాలిపడాలా..?
————-
మరో సంఘం సంగతి చూద్దాం. సేమ్.. అది కూడా సీపీఎం ప్రజాసంఘమే. దాని పేరు- అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం (ఐద్వా). ఇంటికే పరిమితమైన అనేకమంది మహిళలను, ఎంతోమంది కాలేజీ అమ్మాయిలను చైతన్యశీలురుగా, శక్తిమంతులుగా తీర్చిదిద్దిన చరిత్ర దానికి ఉంది. అదంతా గతం. ప్రస్తుతమంతా నామమాత్రం’. అయిష్టంగానైనా, అతి కష్టంగానైనా ఈ మాట ఎందుకు అనాల్సి వస్తున్నదంటే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ సంఘం నాయకులెవరో.. ‘స్వాతి’ అనే పత్రిక యాజమాన్యంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏమనీ.. యువతను పెడదోవ పట్టించేలా, వారిలో కామోద్రేకం కలిగించేలా బొమ్మలు, కథనాలు అచ్చొత్తి.. అచ్చోసిన ఆంబోతుల్లా వదిలేస్తున్నదని..! అరచేతిలో ఇంటర్నెట్ ఉన్న ఈ రోజుల్లో.. ఆ పత్రికను డబ్బులు పెట్టి కొని, అందులోని బొమ్మలు/కథనాలు చదివే కామప్రియ యువ పాఠకులు కూడా ఉన్నారా ఇప్పుడు..?! ఈ సంఘం స్పందించడానికి.. ఆడపిల్లలు/ అమ్మాయిలు/ ఆడవాళ్లకు సంబంధించిన ఇంతకు మించిన సమస్యేదీ కనిపించలేదా..? ఒకప్పుడు సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో చురుగ్గా కదిలి, మహిళాశక్తికి చిరునామాగా నిలిచిన ఐద్వా.. ఇప్పుడిలా చౌకబారు ‘పోరాటాల’కు దిగుతుంటే.. ‘నా సంఘం ఎంత ఎత్తుకు ఎదిగిందో…?!’నని
సంబరపడాలా..?
బాధపడాలా..?
జాలిపడాలా..?
————-
ఎర్ర జెండా పార్టీకి ప్రజాసంఘాలే పునాది. పార్టీ నాయకులైనా, కార్యకర్తలైనా అక్కడి నుంచే తయారవుతారు. అవి నిర్వీర్యమైతే దాని ప్రభావం పార్టీపై పడుతుంది. ఎర్ర జెండా పార్టీలకు ఉన్నన్ని (మరీ ముఖ్యంగా సీపీఎంకు) ప్రజాసంఘాలు ఇతర పార్టీల్లో ఏ ఒక్కదానికీ లేవు. అయినప్పటికీ, ఎర్ర జెండాలోని ఎరుపుదనం ఎందుకు తగ్గుతోంది..? ఆ జెండాలోని మెరుపుదనం ఎందుకు మసకబారుతోంది..? ఎర్ర జెండా పార్టీ ప్రజాసంఘాల కార్యకలాపాలు అల్పమైన, అప్రధానమైన అంశాలకే ఎందుకు పరిమితమవుతున్నాయి..? మిగతా ప్రజాసంఘాల్లో అనేకం కనీసం తమ ఉనికిని కూడా ఎందుకు చాటుకోలేకపోతున్నాయి..?
మొత్తంగా ఈ ఎర్ర జెండా పార్టీ(లు)గానీ, ప్రజాసంఘాలుగానీ.. జన బాహుళ్యానికి ఎందుకు దూరమవుతున్నాయి..? దీనంతటికీ ఏకైక మూల కారణం.. పార్టీ(లు), ప్రజాసంఘాలకు దిశానిర్దేశం చేయాల్సిన రాష్ట్రస్థాయి నాయకత్వం గతి తప్పడమేనా..? ఇవన్నీ విశ్లేషించుకోవాల్సిన, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశాలుగా ఎర్ర పార్టీల రాష్ట్ర నాయకత్వాలకు అనిపించడం లేదా..?? ఇలా ఎన్నెన్నో సందేహాలు.. మరెన్నో ప్రశ్నలు…
————-
(ఇదంతా, ఎర్ర జెండా అభిమానిగా నా ఆవేదనకు అక్షర రూపం మాత్రమే)
– ‘సముద్రం’
Share this Article