రామ్‌దేవ్‌బాబా… ఓ వివాదాస్పద యోగాగురు… స్వదేశీ, స్వధర్మ, యోగ, ఆయుర్వేద వంటి పదాలతో ఓ బ్రాండ్ రూపొందించుకుని, వేల కోట్ల వ్యాపారం చేస్తున్న ఒక భిన్నవ్యాపారి… తన రీసెర్చ్, తన బిజినెస్ టెక్నిక్స్, తన మార్కెటింగ్ విషయాల లోతుల్లోకి ఇక్కడ చర్చ అప్రస్తుతం కానీ… అది గట్టి బుర్ర… కానీ దానికి కాస్త వెర్రి కూడా..! అల్లోపతి డాక్టర్ల మీద ఏవో వ్యాఖ్యలు చేసి, పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వాటిని విత్‌డ్రా చేసుకున్న ఆయన మరో 25 ప్రశ్నల్ని అల్లోపతికి సంధించాడు… తన ట్విట్టర్ ఖాతాలో హిందీలో ఈ 25 ప్రశ్నలూ వదిలాడు… నిజానికి ఆయన ఏం అడిగాడు..? అందులో నిజాలున్నాయా..? ఆయన వాదనలో హేతువు ఉందా..? కనీసం సరైన ధోరణిలో ఉన్నాడా..? అడిగాడు, అడిగాడు అని రాసింది తప్ప ఏం అడిగిందో రాయదు మీడియా… ముందుగా ఆయన వేసిన ప్రశ్నలేమిటో సంక్షిప్తంగా చూద్దాం…
- రక్తపోటు, దాని కాంప్లికేషన్లకు అల్లోపతిలో శాశ్వత చికిత్స ఉందా..?
- సుగర్ వ్యాదికి, దాని కాంప్లికేషన్లకు ఏ శాశ్వత పరిష్కారం ఉంది మీ దగ్గర..?
- థైరాయిడ్, ఆస్తమా, కీళ్లవాపు, కొలిటిస్ వ్యాధులకు మందు కనిపెట్టారా..?
- టీబీ, చికెన్ పాక్స్ చికిత్సను అందిస్తున్నారు కదా, మరి ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్, హెపటైటిస్ చికిత్సకు ఏదైనా మందు ఉందా..? 200 ఏళ్ల చరిత్ర ఉన్న అల్లోపతి ద్వారా వాటికి చికిత్సను కనిపెట్టండి..?
- హార్ట్ బ్లాకేజీలు, క్లాట్స్ వంటి సమస్యలకు ఫార్మస్యూటికల్ పరిష్కారం ఉందా..? యాంజియోప్లాస్టీయే శరణ్యమా..?
- హార్ట్ ఎన్లార్జ్, ఈటీ వంటి సమస్యలకు పేస్మేకర్లు వంటి యాంత్రిక పరిష్కారాలే తప్ప ఔషధ పరిష్కారాలు ఉన్నాయా..?
- కాలేయాన్ని నష్టపరచకుండా కొలెస్టరాల్ ట్రైగ్లిజరైడ్లను తగ్గించే మార్గం ఏమైనా ఉందా అల్లోపతిలో..?
- మైగ్రెయిన్ తలపోటుకు ఏమైనా మందు సూచించగలదా అల్లోపతి ఫార్మా..?
- కళ్లద్దాలు, హియరింగ్ ఎయిడ్స్ వంటి యాంత్రిక పరిష్కారాలు గాకుండా చూపు, వినికిడి సమస్యలకు ఫార్మస్యూటికల్ చికిత్స ఏమీ లేదా..?
- దంతాలు, చిగుళ్లకు సంబంధించిన పైరియాకు శాశ్వత నివారణ, చికిత్స ఎందుకు లేవు..?
- గాటుపెట్టకుండా రోజుకు అరకిలో నుంచి కిలో బరువు తగ్గించగల మార్గం సూచించగలరా..?
- సొరియాసిస్, ఆర్థరైటిస్, వైట్ స్పాట్ సిండ్రోమ్ సమస్యలకు ఔషధాన్ని కనిపెట్టారా..?
- స్పాండిలైటిస్‌కు ఈ ఆధునిక వైద్యంలో మందు ఉందా..?
- పార్కిన్సన్స్ వ్యాధికి ఔషధం మాటేమిటి..?
- మలబద్ధకం (కాన్స్టిపేషన్), ఉబ్బసం, అసిడిటీ సమస్యల్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించగలరా..?
- నిద్రలేమి (ఇన్సోమ్నియా)కి ఒక్క మందైనా ఉందా..?
- స్ట్రెస్ హార్మోన్లను తగ్గించడానికి, ఉల్లాసపు హార్మోన్లను పెంచడానికి ఔషధం ఉందా..?
- కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) వంటి పద్ధతులు తప్ప సంతానలేమి నుంచి మందుల ద్వారా బయటపడేయగలరా..?
- వయస్సు మీదపడటం వల్ల వచ్చే సమస్యల్ని (ఏజింగ్) తగ్గించే మందు అల్లోపతిలో ఉందా..?
- రక్తంలో హీమోగ్లోబిన్ పెరగానికి మీ దగ్గర మందు ఉందా..?
- మనిషి హింస, ద్వేషం, అసహనం వైపు వెళ్తున్నాడు, అల్లోపతిలో చికిత్స ఉందా..?
- డ్రగ్ అడిక్షన్స్ నుంచి బయటపడేయగల ఔషధం చెప్పగలరా..?
- అల్లోపతికీ ఆయుర్వేదానికి మధ్య కొట్లాటకు తెరవేసే మందు ఉందా..?
- ఆక్సిజన్ పంపింగ్ తప్ప కరోనాకు మీ దగ్గర విరుగుడు చికిత్స ఉందా..?
- మీ డాక్టర్లు ఏ జబ్బూ పాలబడకుండా చేయగల పద్ధతి ఏమీ లేదా..?
Ads
………. ఇవీ ఆయన వేసిన ప్రశ్నలు… వీటన్నింటికీ తన దగ్గర మందు ఉంది అని పరోక్షంగా చెబుతున్నాడు… తనకు కూడా చేతకాని జలుబు, జాండీస్, పైల్స్, ఎయిడ్స్, వైరస్ వ్యాధులు వంటి అల్లోపతిలో జవాబుల్లేని ప్రశ్నలు కూడా వేయడం మొదలుపెడితే వంద ప్రశ్నలు అవుతాయి… వీటిల్లో విలువైన ప్రశ్నలు ఉన్నయ్… కానీ మనిషి ద్వేషాన్ని తగ్గించే మందుందా..? అల్లోపతి, ఆయుర్వేద తగాదాకు మందుందా..? డాక్టర్లు కూడా జబ్బుపడుతున్నారు కదా..? ఇలాంటి ప్రశ్నలు రామ్దేవ్బాబాలోని పర్వర్షన్కు అద్దం పడతాయి… తన ప్రశ్నల విలువకు తనే పంక్చర్ చేసుకున్నాడు ఈ ప్రశ్నలతో… తను కూడా అప్పట్లో ఒకసారి అల్లోపతి హాస్పిటల్లో చేరిన విషయం మరిచిపోయినట్టున్నాడు… ఈ వ్యాధులకు అల్లోపతి మందు కనిపెట్టలేదు, చికిత్స లేదు అంటే… ఇక అల్లోపతి నమ్మదగిన వైద్యవిధానమే కాదని తీసిపారేస్తే ఎలా..? ఆయుర్వేదాన్ని గుడ్డిగా ద్వేషించే వితండులకూ రామ్‌దేవ్‌బాబాకు తేడా ఏముంది..?
అల్లోపతి గొప్పది… ఇందులో వీసమెత్తు విభేదం అవసరం లేదు… పేస్మేకర్లు, కళ్లద్దాలు వంటి యాంత్రిక సహకారం తప్పుకాదు, నిషిద్ధం కాదు… అంతేకాదు, రాబోయే కాలంలో స్టెమ్ సెల్ సాయంతో కొన్ని అద్భుతాలు సృష్టించబోతోంది అల్లోపతి… అవయవాల్ని పునఃసృష్టించనుంది… జెనెటిక్ మోడిఫికేషన్లు మనిషి తలరాతనే మార్చబోతున్నయ్… కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటళ్లు, ఫార్మాసురుల డబ్బు కాంక్ష, అనైతిక చికిత్సలు ఆ వైద్యానికి పెద్ద మరకలు కావచ్చుగాక… దానికి అనేకానేక ప్రభుత్వ వైఫల్యాలు కూడా ప్రధాన కారణాలు… కాకపోతే మాది మాత్రమే సైన్స్, దేశీవైద్యం ఉత్త చెత్తా అనే కొందరి వాదనలతో ఈ వివాదాలు… అదొక మానసిక వైకల్యం, దానికి కూడా అల్లోపతిలో చికిత్స లేదు… అయితే రామ్‌దేవ్‌బాబా కూడా ఏ ఫార్మాసురుడికీ తక్కువ కాదు… ఏ కార్పొరేట్ దురాశాపరుడికి కూడా తక్కువ కాదు… కాకపోతే బ్రాండ్ వేరు, అంతే… సంప్రదాయ వైద్యంలోని ఉపయుక్త పద్ధతులను, ఔషధాల్ని దూరం చేసుకోకుండా, ఇంకా డెవలప్ చేసుకోవడం ఎంత అవసరమో… ఈ బాబాల వాదనలతో అల్లోపతి పట్ల అపనమ్మకం పెంచుకోవడమూ అంతే అనవసరం… ఆనందయ్య కరోనా మందును గుడ్డిగా వ్యతిరేకించడం ఎంత మూర్ఖత్వమో, ఇలాంటి ప్రశ్నల దాడి కూడా అంతే మూర్ఖత్వం…!!
Share this Article