నిమిషం లేటయినా పరీక్ష హాలులోకి అనుమతించేది లేదు అనే ఓ పిచ్చి నిబంధన వల్ల… అన్ని పరీక్షల్లోనూ బోలెడు మంది విద్యార్థులు, అభ్యర్థులు అవకాశాలు కోల్పోయారు… కొంత గ్రేస్ పీరియడ్ అనుమతించాలనే సోయి కూడా లేకుండా అప్పట్లో ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ, విద్యలకు సంబంధించిన ప్రతి పరీక్షలో అమలు చేస్తున్నారు…
ఆ నిబంధనే వేలాది మందికి అనుకోని ఆశనిపాతంగా పరిణమిస్తుంటే… ఇప్పుడు ఇంటర్ బోర్డు అధికారులు మరో తొందరపాటు ప్రకటనకు దిగారు… అసలే విద్యార్థులపై ఒత్తిడి, ర్యాంకులు, మార్కుల టెన్షన్, పరీక్ష ఫెయిలైతే తట్టుకోలేని సున్నితత్వం ప్లస్ కార్పొరేటు కాలేజీల్లో, హాస్టళ్లలో పరిస్థితులు విద్యార్థులను ఆత్మహత్యలకూ దారితీస్తున్నాయి… ఈ స్థితిని మరింత దిగజార్చే ప్రకటనను నిన్న ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా చేసింది…
నిమిషం లేటయినా అనుమతించబోం… తప్పనిసరిగా భరిస్తున్నారు కాబట్టి వోకే, దాన్ని కాస్త సడలించాలనే సోయి ఎలాగూ లేదు, ఐనా పర్లేదు… మొబైల్స్ అనుమతించబోం, గుడ్… నెట్ నుంచి హాల్ టికెట్లు తీసుకోవచ్చు, ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పర్మిట్ చేస్తాం, గుడ్… ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగు స్క్వాడ్లు ఉంటాయి, గుడ్… పోలీసులు, అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారు, వెరీ గుడ్… అన్నీ బాగున్నాయి, కానీ కాపీ చేస్తే పట్టుబడితే కటకటాల వెనక్కి నెడతారట, సదరు కాలేజీ మేనేజ్‌మెంట్‌పైనా క్రిమినల్ కేసులు పెడతారట, విద్యార్థుల్ని డిబార్ చేస్తారట, ఆ హాలులో ఇన్విజిలేషన్ చేసే అధికారులపైనా చర్యలు ఉంటాయట…
Ads
వోకే, ఇది భయం, తద్వారా డిసిప్లిన్ పెంచడం కోసం ఉద్దేశించిన ఉత్తుత్తి బెదిరింపే అనుకుందాం… కానీ అసలే ఒత్తిడిలో ఉండే విద్యార్థులపై ఈ రేంజ్ ప్రెజర్ పెంచడం ఏమిటి..? నిజంగా మన ప్రభుత్వాలకు కాపీ జరిగే హాలు ఇన్విజిలేటర్లపై కేసులు పెట్టే సాహసం ఉందా..? అంతకుమించి చైతన్య, నారాయణ వంటి కాలేజీ యాజమాన్యాలపై కేసులు పెట్టగలదా..? ఎందుకీ గప్పాలు..? అనవసర ప్రకటనలు..? అంతెందుకు..? కాపీతో ఎవరైనా పట్టుబడితే తమపై చర్యలుంటాయనే భయంతో ఇన్విజిలేటర్లే వదిలేస్తారు… అది రియాలిటీ…
కాపీ కొడితే పట్టుకోవడం, డిబార్ చేయడం వరకూ వోకే… అంతకుమించి కఠినంగా ఉండటం అంటే క్రూరత్వాన్ని ప్రదర్శించడం… అది ఆ వయస్సు పిల్లలపై అవసరమా..? ఇదంతా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఓ ప్రయత్నమా అధికారిణీ..! ఒక ఉదాహరణ తీసుకుని పరిశీలిస్తే… ఒక హాలులోకి స్క్వాడ్ వస్తోంది, అప్పటిదాకా ఎంచక్కా కాపీ కొడుతూ, చిట్టీలు రాస్తున్న ఓ విద్యార్థి వెంటనే అటు పక్కకో, ఇటు పక్కకో, ముందుకో, వెనక్కో ఆ చిట్టీ విసిరేస్తాడు, తప్పించుకోవడానికి… అది మరో విద్యార్థి దగ్గర పడుతుంది, స్క్వాడ్ క్రిమినల్ కేసు పెడుతుంది, శృతి ఓజా ఆ పిల్లాడిని లేదా పిల్లను కటకటాల వెనక్కి పంపిస్తుందా..? హాలులో కాపీని ఎవరు, ఎలా రుజువు చేయాలి..? ఎవరిని బలిచేయడం ఇది..? ఇంకా నయం, అక్కడే సంకెళ్లు వేసి తీసుకుపోతామని చెప్పలేదు…
ఆంధ్రప్రభ, ఈనాడు పత్రికల్లో మాత్రమే ఈ క్రిమినల్ కేసులు, కటకటాల అంశం వార్తల్లో కనిపించింది… వేరే పత్రికలకు అసలు ఆ పాయింటే కనిపించలేదు… హేమిటో, ఆమె చెప్పింది, వీళ్లు రాశారు… అంతే… మన ఇంటర్ బోర్డు డొల్ల ప్రెస్ మీట్లు అలవాటయ్యీ అయ్యీ అలా లైట్‌గా రాసిపారేశారన్నమాట…!! అవునూ… ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎవరబ్బా..!!
Share this Article