Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పత్రికలు కోలుకుంటున్నాయట… క్రిసిల్ సంస్థ దిక్కుమాలిన విశ్లేషణ…

July 12, 2023 by M S R

దేశంలో వార్తాపత్రికలు ఈ సంవత్సరం చివరికల్లా ఇంకా కోలుకుంటాయని, కోవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటాయని క్రిసిల్ రేటింగ్ సంస్థ అంచనా వేసిందని ఓ వార్త… ఈ సంవత్సరం కనీసం 15 శాతం ఆదాయం పెరుగుతుందట… ఎందుకంటే… ఈ సంవత్సరం ఎన్నికలు కాబట్టి పిచ్చపిచ్చగా యాడ్స్ వస్తాయని, ఈ దెబ్బకు నష్టాలన్నీ పూడుకుపోతాయని ఆ సంస్థ జోస్యం చెప్పింది…

అంతేకాదు, సోషల్ మీడియా, టీవీ మీడియాకన్నా ప్రజలు పత్రికల్లో వార్తల్నే నమ్ముతున్నారనీ, పత్రికలు తమ విశ్వసనీయత కాపాడుకున్నాయనీ ఓ సర్టిఫికెట్ ఇచ్చేసింది… అంత సీన్ ఏమీ లేదు… క్రిసిల్ తన రేటింగులకు, బాష్యాలకు, అంచనాలకు దిక్కుమాలిన ప్రామాణికాలు ఏవో పెట్టుకుంటుంది… వాటి ఆధారంగా ఇలాంటి విశ్లేషణల్ని జారీ చేస్తుంటుంది…

సరే, ఈ ఏడాది చివరకు కోవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటాయనేదే నిజం అనుకుందాం… మరి ఈ మూడునాలుగేళ్లు పోగొట్టుకున్న ఆదాయం మాటేమిటి..? వృద్ధి ఏది..? అదంతా కోల్పోయినట్టే కదా… పైగా ఈ మూడు నాలుగేళ్లలో పత్రికల ముద్రణవ్యయం 50 శాతానికిపైగా పెరిగింది… వచ్చే ఆదాయం పూర్వ స్థితికి చేరుకుంటుంది నిజమేనేమో, కానీ పెరిగిన ఖర్చులకు తగినట్టు ఆదాయం లేదు, రావడం లేదు, వచ్చే సూచనలు కూడా లేవు కదా… మరి ఆ సిట్యుయేషన్..?

Ads

daily

అనేక మీడియా సంస్థలు ప్రింటింగ్ ఆపేశాయి… ప్రింటింగ్ యూనిట్లను అడ్డికిపావుశేరు చొప్పున అమ్మేసుకున్నాయి… ఉద్యోగుల సంఖ్యను కుదించుకున్నాయి… డిజిటల్ ఎడిషన్లుగా రూపాంతరం చెందాయి… ఈ-పేపర్లదే వర్తమానంలో హవా… మళ్లీ ప్రింటింగ్ వైపు వెళ్లేందుకు ఎవరికీ సాహసం లేదు… కారణం ఏమంటే..? ముద్రణవ్యయం ఇంకా పెరగనుందే తప్ప తగ్గే అవకాశాల్లేవు…

ఇంటివద్దకే పేపర్ వేయగల సౌలభ్యం, సొంత నెట్‌వర్క్ ద్వారా విశ్వసనీయ వార్తలు ఇవ్వగలగడం, చదివే అలవాటు ప్రజల్లో వ్యసనంగా మారడమే పత్రికల బలం అని కూడా క్రిసిల్ పేర్కొంది… అందుకే డిజిటల్ మీడియా మీద ప్రింట్ మీడియాకు పైచేయి అందించాయట… అదే నిజమైతే కరోనా కాలంలో పడిపోయిన సర్క్యులేషన్ తిరిగి యథాస్థితికి చేరాలి కదా… అదెందుకు పరిగణనలోకి తీసుకోలేదు..? ఇంటి వద్దకే పేపర్ వేయగల సౌలభ్యం మాట అటుంచితే టీవీ, డిజిటల్ మీడియా 24 గంటలూ వార్తల్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాయి కదా మరి…

daily paper

తెల్లారి పాచిపోయిన వార్తల్ని వడ్డిస్తే అది ప్రింట్ మీడియా బలమా…? పైగా ప్రతి పత్రిక ఏదో రాజకీయ పార్టీకి భజనపత్రం, కరపత్రం… నిష్పాక్షికత ఎక్కడుంది..? ఎవరు నమ్ముతున్నారు పత్రికా వార్తల్ని…? ఎందుకీ సర్టిఫికెట్లు ఇవ్వడం..? అంతేకాదు, రెవిన్యూ సంగతికొస్తే ఒకప్పుడు కార్డ్ రేటుకు పైసా తగ్గని కఠోర ఈనాడు కూడా ఎంత అడిగితే అంత డిస్కౌంట్ ఇస్తూ ప్రకటనలకు దేబిరిస్తోంది… మిగతా పత్రికల సంగతి ప్రత్యేకంగా చెప్పాలా..?

చదివే అలవాటు వ్యసనంగా మారడం అనేది డిజిటల్ మీడియాకు కూడా వర్తిస్తుంది కదా, అది ప్రింట్ మీడియాకు మాత్రమే బలం ఎలా అవుతుంది..? ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్‌లో డిజిటల్ న్యూస్ రావడం మొదలైందే అప్పుడే పత్రికల పతనం ప్రారంభమైంది… ఇప్పుడు మూణ్నాలుగు వాక్యాల్లో వార్తను చెప్పేస్తున్నాయి న్యూస్ యాప్స్… ఫోటోలు, వీడియోలు, గ్రాఫులు, విశ్లేషణలు, వాట్ నాట్… అన్నీ అరచేతిలోనే…

print

న్యూస్ ప్రింట్ ధరలు తగ్గడం వల్ల పత్రికల ఆదాయాలు పెరుగుతాయనేదీ భ్రమే… ఈ ధరల తగ్గుదల నామమాత్రం, పైగా తాత్కాలికం… జీతాలు, ప్రింటింగ్ మెటీరియల్, ట్రాన్స్‌పోర్ట్, చివరకు ప్యాకర్స్ జీతాల వరకూ ప్రతిదీ భారంగానే మారింది… విశ్వసనీయతే పత్రికల బలం అనేది పూర్తిగా వాస్తవానికి భిన్నమైన స్థితి… విశ్వసనీయత కోల్పోవడం వల్లే పత్రికల సర్క్యులేషన్ పడిపోతోంది… ఎవడూ పత్రికల్లో వార్తల్ని నమ్మకపోవడమే వాటికి శాపం… ఇదంతా ప్రింట్ మీడియా స్వయంకృతం… కరోనా కాలంలో పేపర్లను మానేసిన పాఠకులు మళ్లీ వేయించుకోవడానికి ఇష్టపడటం లేదు… వాళ్లకు సమాచార మార్గాలు బోలెడు అందుబాటులోకి వచ్చాయి…

40 శాతం సర్క్యులేషన్ ఉన్న పత్రికల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చిందట క్రిసిల్… నిజానికి చూడాల్సింది పెద్ద పత్రికల దుకాణాల్ని కాదు… అవి మునిగిపోయేదాకా పచ్చగానే కనిపిస్తాయి… చూడాల్సింది మిగతా తక్కువ సర్క్యులేషన్ ఉన్న 60 శాతం దుకాణాల్ని… అప్పుడు నిజంగా ఈ క్రిసిల్ ఏం చెబుతుందో చూడాలని ఉంది…! డిజిటల్ మీడియా, టీవీ మీడియా రెవిన్యూ పెరుగుదలను కూడా ఈ లెక్కలతో పోలికకు తీసుకుంటే పత్రికలు ఎలా దెబ్బతిన్నాయో అర్థమవుతుంది… పత్రికల రెవిన్యూ 30 వేల కోట్లకు పెరుగుతుంది సరే, కానీ డిజిటల్ మీడియా, టీవీ మీడియా రెవిన్యూ ఎంత పెరిగిందో, పెరగనుందో కాస్త చెప్పండి సార్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions