Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భక్ష్యం… భోజ్యం… లేహ్యం… పానీయం… మాతా అన్నపూర్ణేశ్వరి…

January 18, 2023 by M S R

Alludu – Aaharam: కాశీలో వ్యాసుడికి వరుసగా కొన్ని రోజులపాటు భిక్ష- అన్నం దొరకదు. వారం గడిచినా మింగడానికి ఒక్క మెతుకయినా భిక్షాపాత్రలో పడలేదు. అన్నపూర్ణకు నిలయమయిన కాశీలో అన్నమే పుట్టలేదన్న అసహనంతో కాశీని శపించబోతాడు. ఈలోపు పండు ముసలి ముత్తయిదువు వాకిట్లోకి వచ్చి నాయనా! గంగలో మునిగి… భోజనానికి రండి అని ఆహ్వానిస్తుంది. అమ్మా! నాతోపాటు లెక్కలేనంతమంది నా శిష్యులు కూడా ఆకలితో అలమటిస్తున్నారు… అంటే… దానికేమి భాగ్యం వందలమంది ఒకేసారి రండి…మీరు స్నానం చేసి వచ్చేలోపు వేడి వేడిగా అన్నీ సిద్ధం చేస్తాను అంటుంది. అన్నట్లుగానే రుచిగా, శుచిగా పదార్థాలు సిద్ధం. ఏడు పగళ్లు, ఏడు రాత్రులు ఏమీ లేకుండా మాడిన పొట్టలతో ఉన్న వ్యాస బృందం ఆవురావురుమని అన్ని పదార్థాలను ఆరగించింది.

ఈ సందర్భంగా-..
1.భక్ష్య
2. భోజ్య
3. లేహ్య
4. పానీయాలు
ఎన్నింటిని ఆ తల్లి చేసి పెట్టిందో వ్యాసుడు మైమరచి వర్ణించాడు. ఆ తల్లి వండుతున్న వేళ కాశీ వీధులన్నీ ఘుమఘుమలతో ఎలా మత్తెక్కాయో కాశీఖండంలో శ్రీనాథుడు కూడా మహా రుచికరంగా వర్ణించాడు. తినేవి, చప్పరించేవి, జుర్రుకునేవి, తాగేవి నాలుగు విభాగాల్లో కనీసం 80 రకాల పదార్థాలను శ్రీనాథుడు వరుసగా చెప్పాడు. అందులో చాలావరకు ఇప్పుడు పేర్లు కూడా తెలియవు. నంజుకోవడానికి చేసిన వడియాలు, అప్పడాలు, మిరపకాయలు, వడలులాంటి కొన్ని పదార్థాలు తప్ప మిగతావి ఏమిటో కూడా మనకిప్పుడు అర్థం కాదు.

కాశీని శపించబోయిన వ్యాసుడిని అడ్డుకున్న ముసలి ముత్తయిదువు సాక్షాత్తు అన్నపూర్ణ. తీరా తిన్న తరువాత కాశీని శపించబోయావు కాబట్టి నీకు కాశీలో ఉండే అర్హత లేదు అని విశ్వనాథుడు ఆగ్రహిస్తే… వ్యాసుడు గుండెరాయి చేసుకుని దక్షిణ కాశీ ద్రాక్షారామానికి వచ్చేస్తాడు. అదో పెద్ద కథ. ఇక్కడ అనవసరం.

Ads

మరో సందర్భంలో కూడా దేవుడికి శివరాత్రిపూట ఆలయానికి తెచ్చిన ప్రసాదాలను శ్రీనాథుడు ఇలా ఒక్కో ఐటెం చెబుతూపోయాడు.
మిరియాలపొడి (మరిచిధూళి) చల్లినవి కొన్ని;
సైంధవలవణం వేసి తయారు చేసినవి కొన్ని;
ఆవపెట్టి (సిద్ధార్ధ) వండినవి కొన్ని;
ఇంగువతో (రామఠము) ఘుమఘుమలాడుతున్నవి కొన్ని;
చింతపండుపులుసుతో (తింత్రిణీక రసం) చేసినవి కొన్ని;
నిమ్మరసంతో (జంబీర నీరం) చేసినవి కొన్ని;
తాజా నేతిలో (హైయంగవీనము = నిన్నటి పాలు తోడు పెట్టగా తయారయిన పెఱుగుని నేడు చిలికి తీసిన వెన్నకాచిన నెయ్యి – సద్యోఘృతం) మునిగితేలుతున్నవి కొన్ని;

లేత కొత్తిమీరతో పరిమళిస్తున్నవి కొన్ని;
శాకంగా ఉన్నపుడూ పాకంగా రసంగా మారినపుడూ సౌష్ఠవం కోల్పోనివి (వండకముందు ముడి పదార్థంగా ఉన్న దశలోనూ అవి సౌష్ఠవంగా ఉన్నాయి) కొన్ని;
భక్ష్యాలు (నమిలి తినవలసినవి – కరకరలాడేవి) కొన్ని;
భోజ్యాలు (అంతగా నమలనక్కరలేనివి) కొన్ని;
లేహ్యాలు (నాల్కకు పని చెప్పేవి) కొన్ని;
పానకాలు (తాగేవి) కొన్ని…
ఇలా భక్తితో వండి పాత్రల్లో తెచ్చి పెట్టారట.

సంస్కృత ఆంధ్ర కన్నడ ప్రాకృత భాషల్లో పండితుడు, విఖ్యాత విమర్శకుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ “రాయలనాటి రసికత” పేరుతో సుదీర్ఘమయిన వ్యాసం రాశారు. విజయనగర సామ్రాజ్యంలో జనం అభిరుచులు, భాష, వేషం, తిండి, అలంకారాలు, ఉత్సవాలను అనేక గ్రంథాల ఆధారాలతో వివరించారు. నిజానికిది పరిశోధన స్థాయి వ్యాసం. అందరూ రాయలేరు.

ఆ రోజుల్లో ఒక్కో రుతువుకు కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలు చేసుకునే వారు. ఇంటిల్లిపాది వెన్నెల్లో భోంచేయడానికి డాబా మీద ప్రత్యేకమయిన ఏర్పాట్లు ఉండేవి. జాజి, మల్లె, తీగ సంపెంగ తీగలు ఆ డాబా దాకా అల్లుకుని ఉండేవి. పారిజాతం చెట్టు లేని ఇల్లు ఇల్లే కాదు.

నీళ్లల్లో అల్లం, జీలకర్ర, మిరియాలు ఉడికించి కాచి వడపోసిన పానీయం, చెరుకు రసం, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పోపు వేసిన మజ్జిగ, యాలకులు, మిరియాలు దంచి వేసిన బెల్లం పానకం…ఇలా భోజనానికి ముందు- భోజనం తరువాత వారు తాగిన రసాలను చెబుతూ పోతే పెద్ద రస గ్రంథమవుతుంది. ఇక మెయిన్ కోర్సులో తిన్న ఐటమ్స్ తెలుసుకుంటే మనకు కళ్లు తిరుగుతాయి.

సైడ్ డిష్ లుగా నంజుకోవడానికి పెట్టుకున్న వడియాలు, అప్పడాలు, వడలు, మిరపకాయలు, ఉల్లి గడ్డలు చెబితే నోరెళ్లబెడతారు. అలా ఎలా తిన్నారని మనం ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు.

నోటికి దొరికింది తినకుండా- రుతువు, పగలు, రాత్రి, వయసు, సందర్భాన్ని బట్టి ఏది తినాలో అదే తినేవారు. ఏది తాగాలో అదే తాగేవారు. పెద్దన వర్ణించిన దానిమ్మ రసం వట్టి వర్ణన కాదు- ఆయన రోజూ తాగిన ఫలరసమే అని రాళ్లపల్లి నిరూపించారు. ఇప్పుడు మనం ఏమి తింటున్నామో? ఎలా తింటున్నామో? ఎవరికి వారు తేల్చుకోవాలని మనకే వదిలేశారు.

తినడానికే పుట్టినట్లు తిన్న కాలాలు పోయి… ఏదో ఊపిరి నిలిచి బతకడానికి తింటే చాలు అనే సైజ్ జీరో- శూన్య శరీర ఆరాధన రోజుల్లోకి వచ్చాము కాబట్టి-
పావు పుల్కా
చెంచా కూర
27.7 గ్రాముల అన్నం
15.62 గ్రాముల పప్పు
60 ఎం ఎల్ మజ్జిగ
త్రాసులో కొలిచి తింటున్నాం కాబట్టి…

మనకు కాశీలో వ్యాసుడు తిన్న ఐటమ్స్, శ్రీనాథుడు గుళ్లో చూసిన ప్రసాదాలు, రాళ్లపల్లి విజయనగరం ఇళ్లల్లో చూసిన రుచులు, ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన పచ్చళ్లు వింతగా అనిపిస్తాయి. వంద ఐటమ్స్ ఒక పూట ఎలా తింటారని ప్రశ్నిస్తాం.

ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఏలూరులో సంక్రాంతి పూట ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి జస్ట్ 379, భీమవరంలో 173 రకాల భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయాలతో ప్రేమగా వండి…కొసరి కొసరి వడ్డించారు. ఈ 379, 173 ఐటమ్స్ మీద తేటగీతులు రాసి రుచి రుచిగా చెవులూరేటట్లు మనకు వినిపించే శ్రీనాథులే లేరు!
-పమిడికాల్వ మధుసూదన్, madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions