.
పొద్దున మూణ్నాలుగు గుడ్లు… మధ్యాహ్నం ఏదో మాంసాహార భోజనం… రాత్రి కూడా సేమ్… చేపలు, మాంసం, చికెన్ ఎట్సెట్రా…
అంతే… తృణధాన్యాలతో వంటలు నిషిద్దం… ఇదేమిటో తెలుసా..? కార్నివోర్ డైట్… ఈమధ్య ఇదీ ట్రెండ్ కొన్నిచోట్ల… దీని ఉద్దేశం ఏమిటంటే…? కార్బొహైడ్రేట్స్‌ను అసలు ఆహారంగా తీసుకోకపోతే సుగర్ ప్రాబ్లమ్స్ ఉండవు, రక్తప్రసరణ సులభం, బీపీ కంట్రోల్, బరువు తగ్గుదల వంటి బోలెడు ప్రయోజనాలు అని ప్రచారం చేస్తున్నారు సోకాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్… అసలు ఇన్‌ఫ్లుయెన్సర్లే ఇప్పుడు సమాజానికి రోగాలు కదా…
Ads
దీన్ని స్ట్రిక్ట్‌గా పాటించిన అమెరికన్ మహిళ ఒకామె మూత్రపిండాల్లో సమస్యలు వచ్చి, స్టోన్స్ ఫామయి హాస్పిటల్ పాలైంది రీసెంటుగా… ఈ డైట్ మీద సీరియస్ చర్చ జరుగుతోంది ఇప్పుడు…
మనకూ ఉన్నారు కదా… కీటో డైట్, 18 గంటల ఫాస్టింగ్ తరహాలో రకరకాల డైట్స్ చెబుతున్నారు… ఆహార ప్రవచనకారులు… కొబ్బరినూనె వైద్యం వికటించి చాలామంది హాస్పిటల్స్‌పాలయ్యారు తెలుసు కదా… అసలు మన శరీరానికి అవసరమైన శక్తిని ఇచ్చేదే కార్బ్స్… అవి పూర్తిగా మానేసి, ప్రొటీన్ బేస్డ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటే, అధిక ప్రొటీన్లు కూడా అనర్థమే అనేది బేసిక్ పాయింట్…
సింపుల్‌గా చెప్పాలంటే… ఎగ్ మంచిది కాదంటాడు ఒకడు… అబ్బే, వైట్ తీసుకోవచ్చు, పర్లేదు అంటాడు మరొకడు… ఎహె, ఎగ్ సంపూర్ణ ఆరోగ్యం అంటాడు ఇంకొకడు… జస్ట్, ఓ ఉదాహరణ ఇది,., నెయ్యి విషయంలోనూ అంతే… అస్సలు వాడొద్దు అంటారు కొందరు, కాదు అది మితంగా దేహానికి మంచిది అని ఇప్పుడు చెబుతున్నారు…
ఏదీ అతి చేయకూడదు… అంటే ఆహారం విషయంలో అతిగా ఏదీ తినొద్దు, ఏదీ మానేయవద్దు… భారతీయ ఆహారశాస్త్రం ఎన్నో తరాలుగా చెబుతోంది… మన వంటలు కూడా ఆ పద్ధతిలోనే ఉంటాయి… కానీ మన గొప్పతనం మనకు తెలియదు కదా… ఎవడో చెబితే ఆశ్చర్యపోవాలి… కరోనా వచ్చాక గానీ మన పోపులపెట్టెలోని ఆరోగ్యరహస్యం, ఇమ్యూనిటీ మెళకువలు మనకు అర్థం కాలేదు కదా…
సేమ్… ఈమధ్య మాంచెస్టర్‌లో ఓ వరల్డ్ ఫుడ్ సదస్సు జరిగింది… ప్రపంచ దేశాల నుంచి ఫుడ్ సైంటిస్టులు, న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు పాల్గొన్నారు… అందులో మొదటిసారి మన కిచిడీ అంటే దాల్ రైస్ మీద చర్చ జరిగింది… ప్రొటీన్లు, ఫ్యాట్స్, కార్బ్స్ మేలు కలయికగా అంగీకరించారు… ఈమె చెబుతోంది చూడండి…
లోకల్, సీజనల్, ట్రెడిషనల్ ఫుడ్ మన భారతీయ ఆహార విధానం… గొప్ప ఉదాహరణ చద్దన్నం… రాత్రంతా పులిసిన (ఫర్మెంటెడ్) ఆహారం దేహానికి ఎంతటి మేలైన ప్రొబయాటిక్ ఇస్తుందో, అదెంత మంచిదో ఇప్పుడు గుర్తిస్తున్నాం… మన అల్పాహారాల్లో కూడా అధికం ఫర్మెంటెడ్ బాపతే… (అప్పటికప్పుడు ఈనో, సోడా కలిపిన బాపతు కాదు… రియల్లీ ఫర్మెంటెడ్)
కిచిడీ, దాల్ రైస్, తెలంగాణ వంటకం పబ్బియ్యం… ఇవన్నీ సూపర్ ఫుడ్స్ అంటున్నారు ఇప్పుడు ఫుడ్ సైంటిస్టులు… కార్బ్స్, ప్రొటీన్స్, ఫ్యాట్స్ సరైన కలయిక… సాంబార్ రైస్ (పులుపు, ప్రత్యేకించి చింతపండు మన జీర్ణవ్యవస్థకు మంచిది, మలబద్ధకం ఉన్నవాళ్లకు మరీనూ…)… మన బిసబెల్లిబాత్‌తో దీనికితోడుగా పప్పులు… అంటే ప్రొటీన్లు… పర్‌ఫెక్ట్ ఫుడ్… (ఆకు కూరలు వేసిన పప్పు మన తెలుగునాట ఎంత ఫేమసో తెలుసు కదా… గోంగూర పప్పు, పాలకూర పప్పు, కొత్తిమీర పప్పు ఎట్సెట్రా… ఇవి మాంసాహారంకన్నా ఏమాత్రం తక్కువ కాదు…)
అతి ఎప్పుడూ అనర్థదాయకం అంటుంది మన ఆహార సంస్కృతి… అన్నీ తిను, కానీ మితంగా తిను అనేదే సూత్రం… కారం, మసాలా, ఉప్పు, స్వీట్ అన్నీ… ఎస్, మాంసాహారం కూడా… చివరకు మన కిళ్లీలో కూడా (పొగాకు ఉత్పత్తులు ఉపయోగించని) ఆరోగ్యరహస్యం ఉంది… అది మరెప్పుడైనా చెప్పుకుందాం…!
Share this Article