కోడిగుడ్డంత చేస్తే.. కొండంత చెప్పే మహామహులు ఎందరో ఉంటే.. కొండంత చేసినా కోడిగుడ్డు మాత్రం కూడా ప్రచారం చేసుకోని మహానుభావులు కొందరు. సవాళ్లకు ఎదురెళ్లిన ఉక్కు పిడికిలై.. తన వారసత్వానికీ సింప్లిసిటీ ప్రాధాన్యత, ప్రాముఖ్యతను చెప్పిన నిరాడంబరతై.. వ్యాపార దక్షతలో ఓ మేనేజ్ మెంట్ గురువై.. వారసత్వ రాజకీయాలపై విమర్శలు వెల్లువెత్తే దేశంలో.. తన వారసత్వం మాత్రమే తన ప్రాంతానికి న్యాయం చేయగలదన్న జన విశ్వాసమైన.. ఓ మాజీ ముఖ్యమంత్రి.. ఫైటర్ పైలట్.. ఓ బిజినెస్ మ్యాగ్నైట్ కథ ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చింది. ప్రధాని ట్వీట్.. ఇప్పుడు ఫైటర్ పైలట్ కమ్ బిజినెస్ మ్యాన్ కమ్ ఎక్స్ సీఎం స్టోరీపై మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆయనే.. ప్రస్తుత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తండ్రి.. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్. మన ప్రాంతంలో.. మన దేశంలో మనకొక గుర్తింపో.. గౌరవమో దక్కడమే గొప్ప. కానీ, ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా స్మరించుకునేలా.. తమ రాయబార కార్యాలయాల్లో ఇతర దేశానికి చెందిన ఓ వ్యక్తిని చిరస్మరణీయుణ్ని చేసేలా ఆయన జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడమే.. బిజూ పట్నాయక్ కథలో విశేషం. అయితే, అందుకు బలమైన కారణాలేంటో.. నేటి సమాజంలో ఎంతమందికి ఆ లెజెండ్ పొల్టీషియన్ గురించి తెలుసో.. తెలిసినా, కేవలం రాజకీయ నాయకుడిగా, ఓ ముఖ్యమంత్రిగా మాత్రమే తెలిసినవారికి.. అంతకుమించి ఆయన గురించి తెలియాల్సిన కథ ఇది.
ఇప్పటికీ రష్యా, ఇండోనేషియా ఈ రెండు దేశాలు బిజూ తమకు చేసిన సేవల్ని తల్చుకుంటూనే ఉంటాయి. ఇండోనేషియా డచ్ పాలకుల నుంచి స్వాతంత్య్రం సాధించడంలో బిజూ పట్నాయక్ అనే భారతీయుడి పాత్రా ఆ దేశమెన్నటికీ మరువలేనిది. అందుకే.. ఇండోనేషియా తమ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భూమిపుత్ర అవార్డుతో బిజూను సత్కరించింది. మరలాంటి బిజూ నాటి సేవలను కొనియాడుతూ ఏకంగా దేశ ప్రధానే ట్వీట్ చేయడంతో.. నాటి ఆయన సాహస ఘట్టాల చరిత్రను మరోసారి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం.
Ads
బిజూపట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యేకంటే ముందు ఓ పైలట్. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి అయితే, ఓవైపు బ్రిటిష్ పాలనలో ఆ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు తన దేశభక్తి చాటుకున్న స్వాతంత్ర్య సమరయోధుడు. అంతకుమించి నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వ్యూహాలను అమలు చేసే క్రమంలో ఓ పైలట్ గా సవాళ్లను స్వీకరించి సమర్థవంతంగా చేసి చూపించిన ధీశాలి బిజూ.
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ అధికారికంగా లొంగిపోయిన తర్వాత.. ఆగ్నేయాసియాలో ఆక్రమించిన దేశాల నుంచి కూడా డచ్ పాలకులు వైదొలగడంతో.. ఇండోనేషియా 1945, ఆగస్ట్ 17వ తేదీన స్వాతంత్ర్యం సాధించింది. ఇండోనేషియా వ్యవస్థాపకులుగా సుకర్ణో, జహ్రీర్, మహమ్మద్ హట్టా వంటివారి పాత్రెంత కీలకమో.. ఆ సాధనలో బిజూది అదే స్థాయి పాత్ర. డచ్ పాలకులు స్వతంత్ర రాజ్యంగా ఇండోనేషియాను ప్రకటించడానికి.. తిరిగి వెళ్లిపోవడానికి తిరస్కరించారు.
కానీ, నాడు భారత ప్రధానిగా ఉన్న నెహ్రూ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. యూరప్ వలసవాదుల పెత్తనంపై దూకుడు ప్రచారం సాగించాడు. ఇండోనేషియా పరిస్థితిపై చర్చించడానికి ఆసియా దేశాలను ఏకతాటిపైకి తెచ్చి ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. అయితే రిపబ్లికన్లు జకర్తా స్వాధీనం కోసం యత్నిస్తున్న సమయంలో.. నెహ్రూ అభ్యర్థన మేరకు అప్పటికే బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి.. స్వాతంత్రోద్యమంలో చేరిన బిజూ మళ్ళీ ఫైటర్ పైలట్ అవతారమెత్తాడు. డచ్ గగనతల నిఘాను కూడా తప్పించుకుని ఇండోనేషియాకు చేరుకుని.. ఎన్నో సవాళ్లను ఛేదిస్తూ.. ఇండోనేషియా ప్రధానితో పాటు.. వైస్ ప్రెసిడెంట్ ను ఢిల్లీలో జరుగుతున్న చర్చలకు తీసుకురాగల్గాడు.
ఆ సమయంలో తన భార్య జ్ఞానాదేవితో కలిసి జకర్తా ప్రయాణమయ్యాడు. ఇండోనేషియా గగనతలంలోకి బిజూ విమానం వస్తే కూల్చేస్తామన్న హెచ్చరికలు డచ్ పాలకుల నుంచి వస్తే లెక్క చేయలేదు సరికదా.. అదే జరిగితే, భారత గగనతలంలో ఎగిరే ప్రతీ డచ్ విమానాన్ని తామూ కూల్చేస్తామంటూ కౌంటర్ ఇచ్చారు బిజూ. ఇండోనేషియా ప్రజలపై డచ్ వలస పాలకుల సార్వభౌమాధికారానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని సందేశం పంపాడు. ఈ చరిత్రతో పాటు.. ఆ సమయంలో బిజూపై జరిగిన దాడులకు సంబంధించిన పలు ఘట్టాలను వివరించేలా ఇండోనేషియా రాయబార కార్యాలయంలో.. బిజూ మెమరీస్ కోసం ఓ ప్రత్యేక గదినే కేటాయించడం.. మరో దేశం నుంచి మన భారతీయుడికి దక్కిన ఓ అరుదైన గౌరవం.
ఫిబ్రవరి 25 నుంచి 29వ తేదీ వరకు జరిగిన ‘ఏ మూమెంట్ ఆఫ్ రిఫ్లెక్షన్’ ప్రదర్శనలో భాగంగా 70 ఏళ్ల ఇండోనేషియా-ఇండియా బంధాన్ని వివరించేలా ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది ఆ కాన్సులేట్. అందులో ఎందరో ప్రధానుల చెంత ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిజూ సేవలనూ స్మరించుకోవడం విశేషం. అందుకే బిజూ సేవలకు ఆ దేశ అత్యున్నత పురస్కారమైన భూమిపుత్ర అవార్డ్ వరించడమే కాదు.. ఆ దేశ గౌరవ పౌరసత్వాన్నీ ఇచ్చి సత్కరించింది ఇండోనేషియా. కొసమెరుపేంటంటే.. బిజూ సూచించిన పేరునే ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్ణో.. తన కూతురుకు మెగావతి సుకర్ణోపుత్రిగా నామకరణం చేయడం మరో విశేషం. ఆ మెగావతే ఇండోనేషియా ఐదో అధ్యక్షురాలిగా 2001-04 మధ్య కాలంలో ఎన్నికయ్యారు.
బ్రిటీష్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా.. బర్మా రంగూన్ లో జరుగుతున్న జపనీస్ దాడుల నుంచి ఎందరో బ్రిటీషర్స్ ఫ్యామిలీస్ ను రెస్క్యూ చేసి కాపాడిన బిజూ.. హిట్లర్ దాడుల నుంచి నాడు భారత్ మిత్రదేశమైన సోవియట్ యూనియన్ రష్యాకూ అదే సాయమందించారు. బిజూ సేవలకుగాను.. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 50 ఏళ్లైన సందర్భంగా ఆయన్ను రష్యా కూడా ఈమధ్యే ప్రత్యేకంగా స్మరించుకుంది.
గాంధీ మార్గానికి ఆకర్షితుడైన బిజూ పట్నాయక్.. బ్రిటీష్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నప్పటికీ.. భారత స్వాతంత్ర సమరానికి అదే స్థాయిలో విధేయతను ప్రకటించేవాడు. అందులో భాగంగానే రహస్యంగా జరిగే సమావేశాలకు నాటి జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, అరుణా అసఫ్ అలీ వంటివారినెందరినో తన విమానాల్లో అంతే రహస్యంగా చేరేవేసేవాడు. అలా బ్రిటీషర్స్ అనుమానాలకు గురైన బిజూ పట్నాయక్.. తన గూఢచార చర్యలకుగానూ 1943, జనవరి 13వ తేదీన అరెస్టై.. రెండేళ్ల జైలు శిక్షకు గురయ్యాడు. ఇదే విషయాన్ని సూచించే నాటి లేఖనే ట్విట్టర్ లో ప్రధాని మోడీ షేర్ చేయడంతో ఇప్పుడు బిజూ వంటి నాయకుడి గురించి మరోసారి ఇంత ప్రస్తావన.
జ్యుడీషియల్ సర్వీసెస్ లో పనిచేసే తన తండ్రి లక్ష్మీనారాయణ నాటి ఒరియా ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో తండ్రితో పాటు తిరిగిన బిజూపై ఆయన ప్రభావం అధికం. అయితే బిజూ జీవన గమనాన్ని మార్చడంలో రెండు సంఘటనలు కీలక పాత్ర పోషించాయి. 1927లో ఖాదీ పర్యటనలో భాగంగా కటక్ కు వచ్చిన గాంధీని చూడటానికి తన పదకొండేళ్ల వయస్సులో వెళ్లినప్పుడు బ్రిటీష్ ఆఫీసర్ తనపై దాడి చేసిన ఘటనతో పాటు.. తాను కటక్ పాఠశాలలో చదువుతున్నప్పుడు ఎగురుతున్న ఎరోప్లేన్ ను చూసినప్పుడు ఆయన మస్తిష్కంలో రికార్డైన విషయాలే ఆ తర్వాత ఆయన జీవితంలో భాగమయ్యాయి.
ఒరిస్సా అసెంబ్లీకి నార్త్ కటక్ స్థానం నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బిజూ పట్నాయక్.. చౌద్వారా వేదిగా కళింగ ట్యూబ్స్ పేరుతో ఆసియాలోనే అతి పెద్ద పైపుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన బిజినెస్ మ్యాన్ కూడాను. అంతేకాదు స్వాతంత్ర పోరాటం నడుస్తున్న సమయంలో కళింగ ఎయిర్ లైన్స్ ను కూడా స్థాపించగా.. బిజూ డకోటా ఏరోప్లేన్సే ఇండోనేషియా స్వాతంత్ర పోరాటంలో కీలక భూమికకు కారణమయ్యాయి. ఆ తర్వాత 1953లో కళింగ ఎయిర్ లైన్స్ ఇండియన్ ఎయిర్ లైన్స్ లో విలీనమైంది. ఇండియా-టిబెట్ మధ్య ఎయిర్ లింక్స్ పునరుద్ధరించడంలోనూ బిజూది కీలకపాత్ర. అప్పటికే చైనా దురాక్రమణలతో సతమతమవుతున్న టిబెటన్ ఫైటర్స్ కూ బిజూ పట్నాయక్ సాయమందించారు.
మొత్తంగా తన జీవన గమనంలో బహుముఖ పాత్రలు పోషిస్తూ.. సాహసాలతో సావాసం చేస్తూ.. ఓ నైపుణ్యం కల ఫైటర్ పైలట్ గా మాతృదేశానికే కాకుండా.. మిత్ర దేశాలకూ సేవలందించిన ఘనుడు బిజూ పట్నాయక్. ఓ బిజినెస్ మ్యాన్ గా కళింగ ఎయిర్ లైన్స్ తో ఆకాశమంతెత్తు ఎదిగిన వ్యాపారదక్షుడు బిజూ. 45 ఏళ్ల వయస్సులో 1961లో ఒరిస్సా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. శక్తివంతమైన నాయకుడిగా గుర్తింపు పొందడమే కాకుండా.. తన వారసత్వంగా తన కుమారుడైన నవీన్ పట్నాయక్ నూ ఓ కవిగా, ఓ ముఖ్యమంత్రిగా మనకందించినవాడు. ఆరడుగుల 2 అంగుళాల ఎత్తైన బిజూ అనే విగ్రహం.. 1997లో భౌతికంగాఅస్తమించినా.. ఆయన వేసిన చెరగని ముద్రలను.. దేశ, విదేశాలు ఇంకా యాజ్జేసుకుంటూనే ఉన్నాయి.
అయితే ఇప్పుడు బిజూ గురించి చెప్పుకుంటున్నవి మచ్చుకు కొన్ని మాత్రమే. శ్రమ, పట్టుదల, సంకల్పం, ఓర్పు, నేర్పరితనం, క్రమశిక్షణ ఇలా ఎన్నో విశేషాలు కలిస్తే కనిపించే కేరీర్ బిజూ పట్నాయక్. అందుకే బిజూ ఈజ్ ఏ లెజెండ్. ఇలాంటివారి బయోగ్రఫీస్ నేటితరానికి తెలియాలంటే సినిమాలు, రచనల రూపంలో ఇంకా అందుబాటులోకి తీసుకురావల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు.. పౌర సమాజంపైనా ఉందేమో బహుశా!…. By Ramana Kontikarla
Share this Article