విశాఖపట్టణం, సుకన్య థియేటర్‌లో ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకు బదులు ధమాకా అనే సినిమా ప్రదర్శించారట… కాసేపటికి తప్పు తెలిసి, నాలుక్కర్చుకుని సినిమా మార్చారట… నిజానికి సినిమా మొత్తం అయ్యాక ప్రేక్షకుడికి ఒక్క ధమాకా సినిమా ఏం ఖర్మ..? ఖిలాడీ వంటి సినిమాలు మళ్లీ చూసినంత తృప్తి కలుగుతుంది… పలు సినిమాల ఫైట్లు, డాన్సులు, కొన్ని సీన్లు, కథల కిచిడీ ఈ దాస్ కా ధమ్కీ…
ఏదో కొత్తగా తీస్తాను, ఇరగదీస్తాను అనుకుని… తండ్రి కరాటే రాజు పేరుతో డబ్బు పెట్టి, స్క్రీన్ ప్లే రాసుకుని, డైలాగులు రాసుకుని, దర్శకత్వం కూడా చేసి, తనే హీరోగా నటించాడుట విష్వక్సేన్… (బహుశా హైపర్ ఆది రాసి ఉంటాడు డైలాగులు…) ప్రేక్షకులకే ధమ్కీ ఇచ్చినట్టుగా ఉంది సినిమా… మనుషుల తత్వం వాళ్ల పనిలో కనిపిస్తుంది కదా… బూతులు, చెత్తా వివాదాలు, యాటిట్యూడ్ సమస్యతో బాధపడే విష్వక్సేన్ అన్నీ తానై తీసిన సినిమా కూడా అలాగే ఉంది… ఎవరికీ రుచించకుండా…
తెలుగు సినిమాల్లో లాజిక్కులు ఉండవు కదా అనుకుని మనం లాజిక్కురాహిత్యాన్ని భరిస్తూ ఉంటాం… కానీ మరీ అతి… లాజిక్కులకే లాజిక్కుల్లేనితనం… ఓ సీన్ ఉంది… రెంటు కట్టాలని ఓనర్ వస్తాడు… ఆయనకు ఆది ఓ మెసేజ్ పెడతాడు… హాయ్, మీ రెంట్ 8 వేలు వచ్చాయి అనేది మెసేజ్… ఓహో, నా బ్యాంక్ అకౌంటులో డబ్బు పడింది అనుకుని ఓనర్ వెళ్లిపోతాడు… ఇలాంటివి ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసే సీన్లు… హైపర్ ఆది కదా… పలుచోట్ల చేయి చేసుకున్నట్టున్నాడు… శ్రీదేవి డ్రామా కంపెనీ అనుకున్నాడేమో…
Ads
అచ్చం తనలాగే ఉండే వేరే పాత్రలోకి వెళ్లి, కథను ఉద్దరించడం బోలెడు సినిమాల్లో చూశాం… ఇక్కడా అదే డబుల్ యాక్షన్… పెద్ద థ్రిల్ లేదు… హీరోయిన్ అయితే మరీ ఘోరం… ఏదో ఉందంటే ఉంది, గ్లామర్ ఒలకబోయడం కోసం… నిజంగా నివేదకు యాక్షన్ అంటే తెలుసా..? ఒక స్టార్ హోటల్‌లో వెయిటర్ అట, ఓ రిచ్ అమ్మాయి వస్తే ప్రేమించేస్తాడట… హబ్బ, ఎన్నిసార్లు చూపిస్తార్రా బాబూ ఇలాంటి కథల్ని…
ఫస్టాఫ్ వోకే అన్నట్టుగా నడిపిస్తున్న కథనం సెకండాఫ్‌లో విష్వక్సేన్‌లోని దర్శకుడు పూర్తిగా చేతులెత్తేశాడు… బోలెడు ట్విస్టులు ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెడతాయి… కమెడియన్లలో రంగస్థలం మహేశ్ ఉన్నాడు గానీ తన ఎఫర్ట్ వేస్టయిపోయింది… ఇంకా ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకునే పనేమీ లేదు గానీ… విష్వక్… ఈసారి రవితేజ రావణాసుర ఓసారి గట్టిగా చూడు, కాస్త మార్చు… ఈసారి హైపర్ ఆది బదులు ఆటోరాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్, ఫైమా, గెటప్ సీనులను కూడా తీసుకో… ఓ పనైపోతుంది…!! చివరగా :: రంగమార్తాండ వెళ్లాలా, దాస్‌కాధమ్కీ వెళ్లాలా అనే సందేహంలో ఉంటే… నిరభ్యంతరంగా రంగమార్తాండ వెళ్లండి…!!
Share this Article