దసరా ఆహా ఓహో అని తెగరాసేస్తున్నారు అందరూ… 100 కోట్ల వసూళ్లు ఇలా అలవోకగా వచ్చేశాయి, దర్శకుడికి ఓ సూపర్ బీఎండబ్ల్యూ కారు కూడా కొనిచ్చారనీ పొగిడేస్తున్నారు… ఈ సినిమాలో చూపించిన ‘తాగుడు, నరుకుడు’ స్కీం పుష్కలంగా డబ్బు పారించిందని సినిమా టీం జబ్బలు చరుచుకుంది… కానీ నాణేనికి మరో కోణం ఏమిటో తెలుసా..? పాన్ ఇండియా ఎత్తుగడ ఎదురుతన్నింది… అదీ ఎగిరెగిరి…
చమ్కీల అంగీలేసి ఓ వదినే… ఈ పాట ఎక్కడ చూసినా వినిపిస్తోంది… రీల్స్, షార్ట్స్ మొత్తం అవే… అదొక్కటే సినిమాలో ప్లస్ అన్నట్టుగా ఉంది… ఇది పాన్ ఇండియా సినిమా కదా… తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేశారు… కానీ ఇతర భాషా ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు… చివరకు కీర్తి సురేష్ మొహం చూసయినా తమిళ ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు…
ఆ భాషల్లో వసూళ్లు జస్ట్, కోటీ ఇరవై లక్షలట… అంటే ఇతర భాషల్లో ఏ స్థాయి డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు… పాన్ ఇండియా స్టార్ కావాలన్న నాని కల దారుణంగా భగ్నమైపోయింది… ఇతర భాషల్లో ప్రమోషన్ వర్క్ జరగలేదా అంటే… మస్తు జరిగింది… ఏకంగా ఏడు కోట్ల వరకూ ఖర్చు పెట్టినట్టు సమాచారం… కానీ వచ్చిందేమో కోటీ పైచిలుకు… పుష్ప, కేజీఎఫ్ స్థాయిలో హీరోకు రస్టిక్, రగ్గడ్ లుక్ ఇచ్చి, దొంగ అనే కలరిచ్చి కథను ఏదో వండినా… కేవలం నాని కాబట్టి తెలుగులో నడుస్తోంది, అంతేతప్ప ఇతర భాషా ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు…
Ads
సింగరేణి నేపథ్యం, తెలంగాణ కల్చర్ అని ప్రచారం చేసుకున్నా సరే… నాని తెలంగాణ డిక్షన్ అస్సలు పేలలేదు… తనకన్నా కీర్తిసురేష్ బెటర్… పైగా సినిమా అంతా తాగుడు తాగుడు తాగుడు… దీనికితోడు నరుకుడు, నరుకుడు, నరుకుడు… చిన్నప్పుడే నాని తన ప్రేమను త్యాగం చేయడం కూడా మరీ తెలుగు టీవీ సీరియల్ రేంజుకన్నా తక్కువ స్థాయి వంట… ఈ ట్రయాంగిల్‌కు తోడు మరో విలన్‌కు కూడా ఆమెపై కన్ను… బహుముఖ ప్రేమ కథ…
తెలంగాణ సినిమా అంటే బలగం… నిజానికి తెలంగాణ సినిమా అని కాదు, అనుబంధాల విలువను చెప్పిన కథ అది… దసరాలో ఉత్త రొటీన్ నరుకుడు కథ… కృతకంగా డైలాగ్స్… ఇదే అనుబంధాలు బేసిక్ పాయింట్‌గా కృష్ణవంశీ తీసిన రంగమార్తాండ ఘోరమైన ఫ్లాప్… సోషల్ మీడియాలో పెయిడ్ రివ్యూలు, మొహమాటం రివ్యూలు, ప్రీమియర్ షోలు, మౌత్ టాక్… ఏదీ సినిమాను కాపాడలేకపోయింది… సరే, అదంతా వేరే కథ… ఇలాగే విష్వక్సేనుడు కూడా ఓ పాన్ ఇండియా సినిమా తీసి వదిలాడు… అదీ తెలుగులో కాస్త నడిచినా, ఇతర భాషల్లో ఎంతొచ్చిందో మరి…!! పాన్ ఇండియా అనగానే, పలు భాషల్లో రిలీజ్ చేయగానే సినిమా నడవదురా నాయనా..? దానికీ కొన్ని లెక్కలుంటాయి…!! అది మరోసారి చెప్పుకుందాం….
Share this Article