ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి ఈరోజు… ఆమె గురించి చాలా స్టోరీలు చెప్పుకున్నాం కదా… ఓ కొత్త కథ చెప్పుకుందాం… ఆమె బాగా నమ్మిన గుడి, బలంగా నమ్మిన దేవత… నిజానికి నెహ్రూ కుటుంబం మొత్తానికి ఆ గుడి అంటే విపరీతమైన గురి… నిజానికి పార్టీలకు అతీతంగా ఉత్తరాది జాతీయ నేతలందరికీ ఈ గుడి గురించి తెలుసు…
ఇందిరాగాంధీ ఎంతగా ఈ గుడిని నమ్మేదీ అంటే… ప్రతి కీలక సందర్భంలోనూ ఈ గుడే దిక్కు అనుకుంది… మూడుసార్లు గుడికి వెళ్లింది… సాగిలబడింది… ఇంకా ఉంది… చెప్పుకుందాం… చెప్పుకోవాలి… మన తలతిక్క, అర్ధజ్ఞాన మీడియా మిత్రులు రాస్తుంటారు కదా… క్షుద్ర పూజలు అని… ఆ వామాచార పూజలకు ఈ గుడి ఫేమస్… ఓ మిస్టరీ గుడి… పేరు పీతాంబర పీఠం… ఝాన్సీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది…
2021… ప్రియాంక గాంధీ ఈ గుడిని సందర్శించింది… పూజలు చేసింది… కానీ చీరెలో గాకుండా సల్వార్ కమీజ్‌లో వచ్చినందుకు పూజారులు ఆమెను గర్భగుడి లోపలిదాకా అనుమతించలేదు…
Ads
2018… కమల్‌నాథ్‌తోపాటు రాహుల్ గాంధీ ఆ గుడికి వచ్చాడు, దర్శించుకున్నాడు… ప్రచారం ఇక్కడే ప్రారంభించాడు…
2015… వసుంధర రాజే సింధియా మూడు రోజులపాటు ఆ గుడి దగ్గరే ఉండిపోయింది, పూజారులు చెప్పిన ప్రత్యేక పూజల్ని నిష్టగా జరిపింది…
2016… రాజనాథ్‌సింగ్, అమిత్ షా గుడికి వచ్చారు… సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, ఇప్పటి హోం మంత్రి నరోత్తం మిశ్రా దగ్గరుండి పూజల్ని చేయించారు…
2021… యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ హఠాత్తుగా గుడి దర్శనం చేసుకున్నాడు…
ఇలా ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజపేయి, అఖిలేష్ యాదవ్, ప్రణబ్ ముఖర్జీ, రామనాథ్ కోవింద్… ఎందుకో మన దక్షిణాది నేతలు వరుసకట్టడం లేదు గానీ, ఉత్తరాది ప్రముఖ నేతల్లో ఈ గుడిని సందర్శించనివాళ్లు లేరు… నమ్మని వాళ్లు లేరు… ప్రత్యేకించి క్లిష్టసమయాల్లో నేతలకు అన్నింటికన్నా ముందు గుర్తొచ్చేది ఈ గుడే, ఈ దేవతలే… ఇంతకీ ఆ గుడి ఎక్కడ..? ఏమిటి స్పెషాలిటీ..?
దీన్ని పీతాంబర పీఠం అని వ్యవహరిస్తారు… పలు గుళ్ల కాంప్లెక్స్ ఇది… ఆశ్రమం కూడా..! ఒక శక్తిపీఠం… అంటే వామాచార పద్ధతుల్లో పూజలు అందుకునే దశమహావిద్యలు కొలువైన చోటు ఇది… ఇక్కడ ప్రతిష్ఠించబడిన వాంఖడేశ్వర లింగం మహాభారతకాలం నాటిదని పురావస్తు శాఖ కూడా నిర్ధారించిందని అంటుంటారు… ప్రధానంగా ఇక్కడ పూజలు జరిగేవి ఈ శివుడికే కాదు… దశమహావిద్యల్లో ఒకరైన భగాలాముఖి, ధూమావతి దేవతలకు…
భారతీయ అర్చన పద్ధతుల్లో నిగూఢంగా ఉంచబడిన అనేక తాంత్రిక పూజలు, సాధనల ఆనవాళ్లు ఇక్కడ దొరుకుతాయి… క్లిష్ట సమయాల్లో శత్రుసంహారానికి, ఇష్టకోరికల సిద్ధికి భగాలాముఖి పూజను దాదాపు పూజారులు అందరూ అంగీకరిస్తారు… ఈ విగ్రహాలు అన్నిచోట్లా ఉండవు, ఈ పూజలు అందరికీ చేతకావు… అందుకే ఇండో- చైనా యుద్ధ సమయంలో నెహ్రూకు, సోహ్రాబుద్దీన్ కేసు వేళ అమిత్ షాకు, ఎన్నికల వేళ రాహుల్ గాంధీకి, ఐపీఎల్ స్కాం సమయంలో వసుంధర రాజేకు, కార్గిల్ యుద్ధ సందర్భంలో వాజపేయికి… ఇలా ఈ మాత గుర్తొస్తుంది… గుర్తొచ్చింది…
ఝాన్సీకి 25 కిలోమీటర్లు, గ్వాలియర్ ఎయిర్ పోర్టుకు 75 కిలోమీటర్లు ఉండే ఈ గుడికి మూడునాలుగు కిలోమీటర్ల దూరంలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది… ఓ ట్రస్టు ఆధీనంలో నడపబడే ఈ గుడిని నిజానికి 1920లో పూజ్యపాదుడు అనే యోగి నిర్మించాడంటారు…
ఆయన అసలు పేరేమిటో, ఎక్కడి నుంచో వచ్చాడో ఎవరికీ తెలియదు… అరబిక్, ఇంగ్లిష్, పాళి, ఉర్దూ, పర్షియన్, సంస్కృతం సహా అనేక భాషలు తెలిసిన ఆయన స్వతహాగా శాస్త్రీయ సంగీతకారుడు… తను ఉన్నప్పుడు పేరుపొందిన అనేకమంది శాస్త్రీయ సంగీతకారులు గుడిని సందర్శించేవారు… ఈరోజుకూ ఇక్కడ దర్శనాలకు, పూజలకు ప్రత్యేక రుసుములు ఏమీ ఉండవ్…
నెహ్రూ కుటుంబానికీ ఈ గుడికీ బంధం గురించి చెప్పుకుంటున్నాం కదా… 1962 చైనా యుద్ధం సమయంలో ఈ పీఠానికి సంబంధించిన స్వామి మహారాజ్ ప్రత్యేక యాగాన్ని నిర్వహించాడు నెహ్రూ కోరిక మేరకు… 1964… నెహ్రూ ఆరోగ్యం క్షీణించినప్పుడు ఆయన రికవరీ కోసం కమలాపతి త్రిపాఠి ఈ గుళ్లో ప్రత్యేక పూజలు చేయించాడు…
1979… ఎమర్జెన్సీ తరువాత ఇందిర ఈ గుడికి వెళ్లింది… తరువాత 1980లో ఎన్నికలకు ముందు… ఎన్నికల తరువాత ప్రధాని అయ్యాక… మూడుసార్లు… అంతేకాదు, గుడి ప్రధానాచార్యుడిని ఢిల్లీకి పిలిపించి, తన నివాసంలో ప్రత్యేక యోగాన్ని నిర్వహింపజేసింది… అంత బలమైన నమ్మకం… 1985… ప్రధాని రాజీవ్ గాంధీ కూడా గుడికి వెళ్లాడు… సో, నెహ్రూ నుంచి రాహుల్ దాకా అందరూ నమ్మే ఈ గుడి మీద ఎందుకోగానీ దక్షిణాది నేతలకు పెద్ద గురి లేదు… ష్… దేశంలోని ప్రతి ప్రధాన ఆలయానికీ వెళ్లిన ప్రధాని మోడీ ఈ గుడికి మాత్రం వెళ్లలేదు… ఎందుకో మరి..?!
Share this Article