Prasen Bellamkonda…….. సినిమా వోల్ మొత్తంలో ఒకే ఒక్క పాత్ర ఉంటే చూడడం చాలా కష్టం. ఆ ఒకే ఒక్క పాత్రధారి బండ్ల గణేష్ అయితే అది చూడడం పగోడికి కూడా రాగూడని కనా కష్టం. అసలే తెలుగు ప్రేక్షకుడు ప్రయోగమంటే ఆమడ దూరం పారిపోతాడు కదా.. అలాంటప్పుడు ఒక ప్రయోగాత్మక కథను ఎంచుకోవడమనే తప్పే కాక బండ్ల గణేష్ ను ఎంచుకోవడమనే తప్పు మీద తప్పు ను డేగల బాబ్జి దర్శకుడు వెంకట్ చంద్ర ఎందుకు చేసినట్టో.
అవునూ… తమిళ సినిమాను ముక్కస్య ముక్కహా జెరాక్సించారు కదా ఆ పేరెందుకు పెట్టలేదో… ‘ఒంటి చెప్పు సైజ్ 7’ ను డేగల బాబ్జి గా అనువదించడం ఏంటండి మరీ ఆసయ్యంగా. సరే సరే ఓకే మనోళ్లకు అలాంటి పేరు ఎక్కదండీ అంటారు కదా… నిజమే అలాంటప్పుడు ఆ కథ, ఆ ప్రయోగం మాత్రం మనోళ్లకు ఎలా ఎక్కుతుందనుకున్నారు వెంకట్ చంద్రా?
అదొక తమిళ సినిమా. పేరు ‘ఒత్త సెరప్పు సైజ్ 7 ‘. సినిమా మొత్తం ఒకే ఒక్క పాత్ర. మిగతా పాత్రలు కనపడకుండా వినపడుతుంటాయంతే. ఆ ఒక్క పాత్రధారి పార్థిపన్. ఇరగదీసాడు. తమిలోళ్ళు కదా ఆమోదించారు. సూపర్ హిట్. బోలెడంత క్రిటికల్ అక్లెయిమ్. హిందీలో అభిషేక్ బచ్చన్ తో పార్ధిపనే తీస్తున్నట్టున్నాడు. తెలుగులోకొచ్చేసరికి ఒంటి చెప్పుకు డేగల బాబ్జికీ ఉన్నంత తేడా కొట్టేసింది.
Ads
అలా అని ఇదేమీ పనికిమాలిన సినిమా కాదు. నిజానికి ఇదొక ప్రయోగం. ఒకే ఒక పాత్ర ఒక గదిలో ఉండి కథను నడపడం, కధలోని కరుణ, బీభత్స,శృంగార రసాలన్నింటినీ పండించడం, వినపడే అన్ని పాత్రలు తానే అన్నట్టుగా ప్రేక్షకుడిని మైమరిపింపచెయ్యడం, సినిమా నియమాలను చెరిపేస్తూ ఉన్న ఒక్క పాత్రా నేరుగా ప్రేక్షకుడి కళ్ళలోకి చూస్తూ నటించడం.. లాంటి ప్రత్యేకతలున్న ప్రయోగం ఇది.
ఇలా ఒక్క పాత్రతో సినిమాలు ఇంతకు ముందు రాలేదని కాదు… తెలుగులోనే వేద నటించిన పంచమి అని ఒక సినిమా వచ్చినట్టు గుర్తు. (వచ్చింది 2014లో…) మంజుల నటించిన రెండు పాత్రల షో లాంటివి మనకూ ఉన్నాయి. ఇంగ్లీషులో 14 ఉన్నాయని గూగుల్ చెప్తోంది.
ఒక హత్యా నేరం కింద అరెస్టయిన వ్యక్తిని పోలీసులు ఇంటరాగెట్ చేస్తున్న క్రమంలో బయట పడుతూ వస్తున్న అంశాలే కథ. ఈ కధలో నాలుగు హత్యలుంటాయి, ఒక స్ట్రీ చేసే ద్రోహం ఉంటుంది, పేద ధనిక తారతమ్యం ఎంత నిర్ధాక్షిణ్యంగా ఉంటుందో ఉంటుంది. తండ్రీ కొడుకుల ప్రేమ ఉంటుంది. ఒక పురుషుడి తెలివైన ప్రతీకారం ఉంటుంది.
ఒకే గదిలో కెమెరాను నడిపిన తీరు బాగుంది. బిజీయమ్ చాలా బాగుంది. అక్కడక్కడా వినిపించే ఇళయరాజా పాటల సందర్భాలు బాగున్నాయి. కథను చెప్పడానికి నిర్మించుకున్న స్క్రీన్ప్లే బాగుంది. ఇన్నీ ఉన్నా పార్దిపన్ బండ్ల గణేష్ మద్య ఉన్న తేడా పెద్ద దెబ్బ కొట్టేసింది. పార్దిపన్ చూపించిన పరిణితి గణేష్ చూపలేక పోవడం వల్ల సినిమా నడక కుంటు పడ్డట్టనిపిస్తుంది.
కొండొకచో బోర్ కూడా కొడుతుంది. పార్దిపన్ కళ్ళు నటిస్తాయి. ఏ ఆంగికమూ లేకుండా అనేక భావాలను ప్రకటించగలడు. ఎంత అనువాదమైనా అవి బదిలీ కాలేదు. కేవలం ప్రయోగం మీది ప్రేమతో సినిమాను క్షమించే సుగుణం మన తెలుగులకు లేదు కదా. మనకు అమ్మడి కుమ్ముడూ, బౌన్సింగ్ బాడీసు, లార్జర్ దాన్ లైఫ్ కల్పితాలు కదా కావలసింది. అలాని ఇది మాగొప్ప చిత్రరాజం అని కూడా నేనేం చెప్పట్లేదు.
ఒక ప్రయోగాన్ని క్షమించి సహించే ఓపిక ఉంటే చూడొచ్చు. అయితే సినిమాలో పాత్రలు కనపడకుండా చేసి, వాళ్ళ మాటలు మాత్రమే వినిపించేట్టు చేసి దాన్ని ఒక్క పాత్ర సినిమా అనడం ఒక రకంగా చీటింగ్. బోలెడంత క్రయిం, సస్పెన్స్ ఉన్నాయి కనుక ఇదే కథను ఫుల్ లెంగ్త్ అనేక పాత్రల సినిమా చేసుంటే బాక్సాఫిస్ ఇంకొంచెం పలికేది…
Share this Article