చాలామందికి పనిలేదు… ఉన్నా సరే చాలామందికి పనిరాదు… పనివచ్చినా సరే చాలామంది పనిచేయరు… చాలామంది చేస్తారు కానీ తమకు పనికొచ్చే పని అయితేనే చేస్తారు… అర్థం కాలేదా..? ప్రభుత్వ ఉద్యోగుల గురించే… సమాజానికి అల్లుళ్లు… వీళ్ల జోలికి ప్రభుత్వాలు పోవు, వణుకు… వాటి ప్రతాపం సామాన్యుడిపైనే… ఆర్గనైజ్డ్ ఉద్యోగుల గొంతెమ్మ కోరికలు, వల్లెవేసే హక్కులు ఖజానాలకు, తద్వారా సొసైటీలకు జరిగే ఆర్థిక నష్టాల మీద అప్పుడప్పుడూ చర్చ సాగుతూ ఉంటుంది…
కరోనా దెబ్బకు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు కుదేలైనా సరే… మిగతా సమాజం ఇప్పటికీ కోలుకోవడం లేదు… ఐనా సరే, తమ వేతనాలు, తమ హక్కుల విషయంలో మాత్రం నో కాంప్రమైజ్… సంఘాలు ప్రభుత్వాల్ని బెదిరిస్తాయి… ఇంతా చేస్తే జవాబుదారీతనం, సామర్థ్యం, నిబద్ధత, సొసైటీ పట్ల కృతజ్ఞత, నిజాయితీ వంటివి చాలామందిలో కనిపించవు… అందరూ కాదు, అధికులు… మరేం చేయాలి ప్రభుత్వాలు..? సొంత ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలకూ సరిపోని రాష్ట్రాలు బోలెడు…
మన దేశమే… సిక్కిం ప్రభుత్వమూ ఇదే ఆలోచించింది… ఇలాగే ఆలోచించింది… అసలు పనిచేయనివారు, పనిచేతగానివారు, పనికిమాలినవారు అని కాదు… జరగాల్సిన పనికీ రకరకాలుగా అడ్డుపడే వాళ్లతో అధిక సమస్య వస్తోంది… ఎడాపెడా పీకేయలేదు… పొలిటికల్ లాస్ కోణంలో వెనుకంజ… కోర్టులు, ట్రిబ్యునళ్లు, ప్రతిపక్షాలు సరేసరి… అందుకని ఓ వింత ప్రతిపాదనతో ముందుకొచ్చింది… ‘‘పనికిమాలిన ఉద్యోగుల శాఖ’’ అని ఓ ప్రత్యేక ప్రభుత్వ శాఖను క్రియేట్ చేసింది…
Ads
ఆశ్చర్యంగా ఉందా..? నిజమే… ఈ శాఖ పనేమిటో తెలుసా..? పనికిమాలిన ఉద్యోగులకు ఆశ్రయం కల్పించడం… కాస్త వివరంగా చెప్పాలంటే… ప్రభుత్వ పనులకు అడ్డుపడే ఉద్యోగులు, ఎంత చెప్పినా పనిచేయని ఉద్యోగులు, అసలు పనికిరాని ఉద్యోగుల్ని గుర్తిస్తారు… అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ గుర్తింపు జరిగాక వాళ్లను ఈ ‘‘పనికిమాలిన ఉద్యోగుల శాఖ’’కు బదిలీ చేస్తారు… అంటే ఏమీ లేదు… చేయడానికి పనేమీ ఉండదు, ఫైళ్లేమీ ఉండవు, అసలు టైమింగ్స్, ఆఫీసులు కూడా ఉండవు…
జస్ట్, ప్రభుత్వ రికార్డుల్లో ఆ ఉద్యోగులు ఉంటారు… బేసిక్ వేతనాల్ని చెల్లిస్తారు… అధికారిక వాహనాలు, భవనాలు ఇన్సెంటివ్స్, భత్యాలు ఏమీ ఉండవు… ఉంటే ఉండు, లేదంటే రాజీనామా చేసి వెళ్లిపో… అంతే… ఫైళ్లు, నిర్ణయాలు ఏమీ ఉండవు కాబట్టి అవినీతి లేదు, దందాల్లేవు… ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే కూర్చోబెట్టి మేపుతారు… కొందరుంటారు… పనిచేయకపోతే రూపాయి నష్టం, పనిలో ఉంటే పదిరూపాయల నష్టం… అదుగో ముందుగా అలాంటివాళ్లు ఇప్పుడు టార్గెట్…
నిజానికి స్థూలంగా పైపైన చదివితే ఇదేదో బాగుంది కదా అనిపిస్తుంది… కేంద్రం కూడా చాలామంది అధికారుల్ని ఇలాగే ‘‘పనికిరాని సరుకును’’ ఐడెంటిఫై చేసి, కంపల్సరీ రిటైర్‌మెంట్ కింద ఇళ్లకు పంపించేస్తోంది… సిక్కిం కాస్త డిఫరెంటుగా ఆలోచించింది… అయితే ఒకసారి ‘‘పనికిరాని ఉద్యోగి’’ అని తేల్చాక, ఇక కూర్చోబెట్టి వేతనాలు ఎందుకు ఇవ్వాలి, ప్రజాధనం వృథా చేయడమే కదా అనేది ఓ కొత్త వాదన… ఈ ఆదేశాలు సోమవారం జారీ అయ్యాయి కూడా…
సీఎం ప్రేమసింగ్ తమాంగ్ ఏమంటాడంటే..? ‘‘పది మంది ఉద్యోగుల్లో ఏ ఇద్దరో ఇలా ఉంటారు… మొత్తం పనికి అడ్డం పడతారు… ఒక్కరోజులో అయ్యేపనిని నెలల తరబడీ జాప్యం చేయించగలరు… ఇది రాష్ట్ర ప్రజానీకం స్థూల ప్రయోజనాలకు అరిష్టం, నష్టం… అందుకే ఈ నిర్ణయం’’… సరే, సిక్కిం చాలా చాలా చిన్న రాష్ట్రం కాబట్టి, ఉద్యోగుల సంఖ్య చాలా పరిమితం కాబట్టి ఇలాంటి నిర్ణయాలు అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు… కానీ పెద్ద రాష్ట్రాల్లో..? ఇలాంటి నిర్ణయాలు అమలు చేస్తే… ఈ ‘‘పనికిమాలిన ఉద్యోగుల శాఖ’’లే అతి పెద్ద శాఖలు అయిపోతయ్…!!
Share this Article