స్వర్ణదేవాలయంపై సైనికచర్య అనంతరం సిక్కుల్లో ఇందిరాగాంధీ మీద తీవ్ర ఆగ్రహం ప్రబలుతోందనీ, ఆమె అంగరక్షకుల్లో సిక్కులను తొలగించాలని ఉన్నతాధికారులు భావించారు… ఆమెకు చెప్పారు… ఆమె తేలికగా తీసుకుంది… స్వర్ణదేవాలయంపై యాక్షన్‌ను సగటు సిక్కులు అర్థం చేసుకుంటారని అనుకుంది… అంగరక్షకులను మార్చాల్సిన అవసరం లేదని చెప్పింది… ఫలితంగా ఆమె ప్రాణాలే కోల్పోయింది… నిజంగానే ఆమె తన ప్రొటెక్షన్ టీం నుంచి వాళ్లను తప్పించడానికి అనుమతించి ఉంటే..? ఆ సివంగి ఇంకొన్నేళ్లు బతికి ఉండేది… దేశ రాజకీయాలు వేరేగా ఉండేవి… కానీ విధిరాత…
రాజీవ్ గాంధీ విశాఖపట్నంలో ఉన్నాడు… అక్కడి నుంచి తమిళనాడు వెళ్లాలి… కానీ విమానంలో సాంకేతిక పొరపాటు ఏదో తలెత్తిందని టెక్నిషియన్స్ సమాచారం ఇచ్చారు… రాజీవ్ పాల్గొనాల్సిన పెరంబుదూరు సభ రద్దయినట్టే అనుకున్నారు అందరూ… కానీ కాసేపటికే విమానం వోకే అయ్యిందని చెప్పారు… రాజీవ్ బయల్దేరాడు… తన కోసం ఎదురుచూస్తున్న మానవబాంబు థాను తనతోపాటు రాజీవ్‌ను పేల్చేసింది… నిజంగానే ఆ సభ రద్దయి ఉంటే..? విమానం బాగుపడకుండా ఉండి ఉంటే..?
నిజానికి పెరంబుదూరు సభాప్రాంగణం మొదట్లో వేరే అనుకున్నారు… తరువాత మార్చేశారు… అదేమంటే అక్కడి కాంగ్రెస్ నాయకులు అడ్డదిడ్డంగా జవాబులు చెప్పారు పోలీసులకు… మొదటి సభాప్రాంగణమే అయి ఉంటే…? ఎల్టీటీఈ పాచిక అక్కడ పారకుండా ఉంటే..? భద్రత ఏర్పాట్లలో ఉన్న ఓ లేడీ సబ్‌ఇన్‌స్పెక్టర్ అనసూయ ఏవో అనుమానాస్పద మొహాలు అకస్మాత్తుగా వేదిక దగ్గర తచ్చాడుతున్న తీరు గమనించింది… వాళ్లను అక్కడి నుంచి తరిమేసింది… తరువాత రాజీవ్‌కు స్వాగతం చెప్పే మహిళల టీంలో వాళ్లు మళ్లీ కనిపించారు…
Ads
ఆమెకు డౌటొచ్చింది… అటువైపు చకచకా నడిచింది… చేతిలో దండతో రాజీవ్ సమీపంలోకి వస్తున్న మానవబాంబు థానును వెనక్కి నెట్టేసింది… కానీ విధిరాత… రాజీవే స్వయంగా అనసూయను ఆపి, థానును దగ్గరకు రమ్మన్నాడు… దేవుడి దగ్గరకు వెళ్లిపోయాడు… అనసూయ కొన్ని క్షణాల ముందు థానును అక్కడి నుంచి మళ్లీ తరిమేసి ఉంటే..? రాజీవ్ ఆమెను దగ్గరకు రమ్మనకుండా ఉంటే..? బతికిపోయేవాడు… ఈ దేశ రాజకీయాలు వేరేగా ఉండేవి…
వైఎస్ ప్రభుత్వం ఓ కొత్త ఛాపర్ కొన్నది… రచ్చబండ ప్రోగ్రాం ఆరంభానికి వైఎస్ అందులోనే వెళ్లాల్సి ఉంది… తీరా సమయానికి పాత చాపర్ తీసుకొచ్చారు… ఆయన అదే అడిగితే కొత్తది ఏదో ప్రాబ్లంతో అందుబాటులో లేదనీ, అందుకే పాత చాపర్ తెచ్చామన్నారు… అదే ఆయన ప్రాణాల్ని బలిగొన్నది… (చాపర్ ఎందుకు మారిందో నిజంగా సీరియస్ దర్యాప్తు జరిగిందా..?) వాతావరణ ప్రతికూలతల్ని ఇంకా గట్టిగా తట్టుకునే కొత్త చాపర్ అందుబాటులో ఉండి ఉంటే..? వైఎస్ బతికి ఉండేవాడు… రాష్ట్ర రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉండేవి…
సో… జరగాల్సింది జరిగే తీరుతుంది… బయటికి కారణం ఏమైనా కనిపిస్తూ ఉండవచ్చు… కానీ డెస్టినీ శాసిస్తుంది… రాజీవ్ హత్య తాలూకు వార్తలు చదువుతూ ఉంటే ఇదే అనిపిస్తుంది… శ్రీలంక నుంచి రాజీవ్ హత్య కోసం తొమ్మిది మంది టీం వచ్చింది… మన రా, ఇంటలిజెన్స్ వ్యవస్థలో ఒకరకమైన నిర్లక్ష్యం… తప్పుడు అంచనాలు… ఐపీకేఎఫ్ పేరిట మన బలగాలు శ్రీలంక వెళ్లి మరీ మనం పెంచి పోషించిన టైగర్లనే టార్గెట్ చేశాయి…
ప్రభాకరన్ కోపంతో రగిలిపోతున్నాడు… ఏకంగా రాజీవ్ ప్రాణాల్నే బలిగొంటాడని మన గూఢచార వ్యవస్థలు పసిగట్టలేదు… లేక పసిగట్టీ తేలికగా తీసుకున్నాయా..? ఏదయితేనేం… రాజీవ్‌ను బలిగొన్న ప్రభాకరన్ తరువాత తనూ హతమారిపోయాడు… ప్రపంచంలో హార్డ్‌కోర్ ఉగ్రవాద సంస్థల్లో ఒకటైన ఎల్టీటీఈ పునాదులతో సహా లేచిపోయింది… అల్టిమేట్ నీతి ఏమిటయ్యా అంటే..? భింద్రన్‌వాలే కావచ్చు… ప్రభాకరన్ కావచ్చు… పులులు, సింహాలు కారు… పాములు… అవి పాలుపోసిన చేతుల్నే కాటేస్తాయి అని..!!
Share this Article