డెస్టినీ… జీవితం… మనల్ని అనేకసార్లు వంచిస్తుంది… పరీక్షిస్తుంది… అనుగ్రహిస్తుంది… ఆశ్చర్యపరుస్తుంది… మనిషి నిమిత్తమాత్రుడు… తన పాత్ర నిర్వర్తిస్తూ, ఫలితం అనుభవించాలే తప్ప, డెస్టినీని మనం నిర్దేశించలేం… దీన్ని చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా బోలెడు సాహిత్యం… బోలెడు ఉదాహరణలు…
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తాజా పోస్టు కూడా అదే చెబుతుంది… బాగుంది…
నేషనల్ హైవే పక్క నుంచి… ఒక ప్రైవేటు ఘాట్ రోడ్డు కొండల్లోకి వెళ్తుంది. అలా పది కిలో మీటర్లు లొపలికి వెళ్తే అడవి మధ్యలో ఒక ఫామ్ హౌస్.
ఆ ఫాం హౌస్ నుంచి వచ్చిన ఒక కారు కొండ వెనుక ఘాట్ రోడ్ మీద మిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి ఆగిపోయింది. దాన్ని డ్రైవ్ చేస్తున్న నడి వయస్కురాలు దిగి చుట్టూ చూసింది. చుట్టూ చెట్లూ, గుట్టలూ తప్ప మరింకేవీఁ కనబడలేదు.
Ads
కనుచూపు మేరలో ఎక్కడా మానవ సంచారం లేదు. దాదాపు అరగంట గడిచింది. ఆమెకి ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో ఒక యువకుడు సైకిల్ మీద అటుగా వచ్చాడు. ఆమె పరిస్థితి చూసి కారు బాగుచేయటానికి ప్రయత్నించి, ఒక ముఖ్యమైన పార్టు పోయిందని, పక్కనున్న పట్నంలో ఆ పార్టు దొరుకుతుందని చెప్పి వెళ్ళిపోయాడు.
ఏదైనా బస్సు వస్తుందేమో, తను ఎక్కి అక్కడకు వెళ్ళి మెకానిక్‌ని పంపించాలని ఆమె ఉద్దేశం. గంట గడిచినా అటుగా ఏ వాహనమూ రాలేదు.
ఎండ మాడ్చేస్తోంది. వడగాలులు బలంగా వీస్తున్నాయి. మంచినీళ్ళు అయిపోయాయి. ఇంకొంచెం సేపు ఉంటే స్పృహ తప్పటం ఖాయం అనుకుందామె.
ఆ సమయంలో ఒక చిత్రం జరిగింది. కారుకి సంబంధించిన విడి భాగాన్ని తీసుకుని, కొండ ఎక్కి దిగి సైకిల్ భారంగా తొక్కుకుంటూ కొండ మలుపు ఎత్తులో ఆ యువకుడు కనపడ్డాడు. ఆమె ఆశ్చర్యంతో అవాక్కయింది. అతడు అయిదు నిముషాల్లో కారు రిపేరు చేసాడు. పర్సులోంచి వెయ్యి రూపాయల నోటు తీసి అతడికి ఇచ్చింది.
అతడు అయిదొందలు తిరిగి ఇస్తూ, “ఆ పార్టు ఖరీదు నాలుగువందలా యాభయ్యే మేడం. నా దగ్గర మిగతా చిల్లర లేదు” అన్నాడు. “మొత్తం అంతా నీకే. పాపం ఎండలో చాలా కష్టపడ్డావు” అంది. వద్దన్నాడు. ఇచ్చిన డబ్బు సరిపోలేదేమోనని ఆమె మరొక వెయ్యి నోటు జత చేసిoది. అతడు సున్నితంగా తిరస్కరిస్తూ “క్షమించండి మేడం. నాకు డబ్బు అవసరం లేదు. మీరు ఇబ్బందిలో ఉన్నారు. ఇటు వైపు ఏ వెహికిల్సూ రావు. అందుకనే తీసుకువచ్చాను” అన్నాడు.
ఆమెకింకా నమ్మశక్యం కాలేదు. నిజానికి అతడు ఇదంతా డబ్బు కోసమే చేసాడని అనుకుoది. లేకపోతే అంత ఎండలో కొండ ఎక్కి వెనక్కి ఎవరొస్తారు? “అదే పదివేలిస్తే వద్దంటావా? నువ్వు నాకు చేసిన సహాయం చిన్నది కాదు. సాధారణంగా ఎవరూ చెయ్యరు” అన్నది. అతడు అదే చిరునవ్వుతో, “పదివేలు కాదు. లక్ష ఇచ్చినా వద్దంటాను” అన్నాడు. ఆమె అహం దెబ్బతింది. కారులోంచి చెక్‌బుక్ తీసి వ్రాస్తూ “ఇదిగో లక్ష. తీసుకో” అంది.
అతడు దాన్ని కూడా మర్యాదగా తిరస్కరించాడు. ఆమె ఆశ్చర్యంతో “నీలాంటి వాడిని ఎక్కడా చూడలేదు. ఈ ఎండలో కొండల మధ్య నన్ను వదిలేసి వెళ్ళకుండా అంత దూరం వెళ్ళి నీ డబ్బులతో సామాన్లు తీసుకు వచ్చావు. అంతకన్నా ముఖ్యంగా, ఏమీ ఆశించకుండా ఈ పనులన్నీ చేసావు. ఎందుకు?” అని అడిగింది.
“ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే భగవంతుడు మనకు సహాయం చేస్తాడని మా నాన్న చిన్నప్పటి నుంచీ మాకు చెప్పారు. ఆ పనే నేను చేసాను మేడం. నా కన్నా అవసరం ఉన్నవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారికి సాయం చేయండి. మీ డబ్బే నా దగ్గర యాభై ఉంది” అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆమె అవాక్కై అటే చూస్తూ ఉండిపోయింది.
అతడు ఇంటికి వెళ్ళేసరికి ఎనిమిదేళ్ళ కూతురు ఎదురు చూస్తూ ఉంది. ప్రతి శనివారం సాయంత్రం ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళటం అలవాటు. “ఆలస్యం అయిందేమిటి నాన్నా?” అని అడిగింది. అతడు జరిగింది చెప్పాడు. గుడికి వెళ్ళినప్పుడు మెట్లపై కూర్చున్న బిచ్చగాళ్ళకి కూతురి చేత ఆ యాభై రూపాయలూ దానంగా వేయించాడు.
దిగి వస్తూండగా “దేవుడిని ఏం కోరుకున్నావమ్మా?” అని అడిగాడు. “నాయనమ్మ తొందరగా బాగుపడాలని కోరుకున్నాను” అంది. అది ఎన్నటికీ సాద్యం కాదని అతడికి తెలుసు. ఇక్కడ సంభాషణ జరుగుతూ ఉండగా, అక్కడ ఆమె కారు ప్రయాణం కొనసాగించింది. ఇంకా హైవే ఎక్కలేదు.
కొండల ప్రాంతం దిగిన తర్వాత చిన్న తటాకం కనబడింది. చాలా సేపు ఎండలో ఉండడం వల్ల అలసిపోయినట్టు అనిపించి కారాపి చల్లటి నీళ్ళతో మొహం కడుక్కుంది. ఎంతో రిలీఫ్‌గా ఆహ్లాదంగా అనిపించింది. ఆ సమయంలో అక్కడ చెట్లు కొడుతున్న ఒక వృద్ధుడిని చూసింది. ఎముకల గూడులా బలహీనంగా ఉన్నాడతను. ఆ వయసులో అతను అంత శ్రమ పడటం చూసి ఆమెకి ఆ యువకుడి మాటలు గుర్తొచ్చాయి.
తను చేస్తున్న పని ఏ తర్కానికీ అందదని, ఈ విషయం ఎవరికైనా చెప్పినా తనకి పిచ్చెక్కిందని అనుకుంటారనీ ఆమెకి తెలుసు. కానీ ఎందుకో ఆమెకి అలా అడగాలని అనిపించింది. “…నీకు ఒక లక్ష రూపాయలు అవసరం ఉందా?” అని అడిగింది. ఆ వృద్ధుడు గొడ్డలి కింద పెడుతూ “డబ్బు అవసరం లేనిది ఎవరికమ్మా?” అన్నాడు. ఆమె అతడికి ఆ చెక్కు అందిస్తూ “ఎందుకు? ఏమిటి? అని అడక్కు. ఇది నీకు సహాయపడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది” అని వెళ్ళిపోయింది.
అ వృద్ధుడు ఇంటికి వచ్చి “బాబూ, ఒక చిత్రం జరిగిందిరా. మీ అమ్మ ఆపరేషన్‌కి లక్ష రూపాయలవుతుందని డాక్టరు చెప్పగా ఆశలు వదిలేసుకున్నాం కదా. భగవంతుడు పంపించినట్టు ఎవరో దేవత దయతో ఈ డబ్బు ఇచ్చింది” అంటూ చెక్కు కొడుకు ముందుంచాడు. (‘Unconditional Love’ by Buddha – ప్రేరణతో పదేళ్ళ క్రితం”ప్రేమ ఒక కళ” పుస్తక౦లో వ్రాసింది… యండమూరి) (ఈ కథలో యువకుడు తను చేసిన సాయానికి వెలకట్టదలుచుకోలేదు, ఆపదలో ఉన్నవాళ్లకు సాయం, అంతే, తన ఉద్దేశం… కానీ తనకు ఈ నీతిని పదే పదే చెప్పిన అదే తండ్రి మాత్రం అనుకోకుండా వచ్చిపడిన సాయాన్ని మాత్రం తిరస్కరించలేదు… ఇదొక కంట్రాస్టు)
Share this Article