పలు సినిమాల్లో అవకాశాల కోసం తిరిగీ తిరిగీ… నలిగీ నలిగీ… చివరకు మందలో ఒకడిగా నటించిన రోజుల నుంచి హీరోగా రవితేజ ప్రస్థానం చిన్నదేమీ కాదు… ఏ పాత్ర దొరికితే ఆ పాత్ర… కష్టపడేవాడు… నా ఆటోగ్రాఫ్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి సినిమాలు ఒకప్పుడు… తరువాత ఇమేజీ బందిఖానాలోకి చేరిపోయాడు… ప్రత్యేకించి రాజమౌళి విక్రమార్కుడు సినిమా తనను పెద్ద హీరోను చేసేసింది…
ఇక ఆ తరువాత రవితేజ అంటే మొనాటనీ… ఫార్ములా… రొటీన్… తను ఏం సినిమా చేస్తున్నాడో కూడా తనకు అర్థమవుతున్నదా అనిపించేది… ఉదాహరణకు కిక్-2… రవితేజ అంటే తన మార్కులో కాస్త కామెడీ, డిష్యూం డిష్యూం, ఒకే తరహా కథలు, కథనాలతో ఏమాత్రం కొత్తదనం లేకుండా సాగిపోతూనే ఉన్నాడు… ఇది నా సినిమా అని రవితేజ చెప్పుకునే సినిమా రాక ఎన్నేళ్లయింది..?
కాకపోతే రవితేజ అదృష్టవంతుడు… టైమ్‌కు ఎవరో ఓ నిర్మాత వస్తాడు, అదే రవితేజ మార్క్ కథతో సినిమా తీస్తాడు… పోయే సినిమాలు పోతూనే ఉంటాయి… రవితేజకు సినిమాలు వస్తూనే ఉంటాయి… అయితే ఇలా ఎన్నాళ్లు..? నడిచినన్ని రోజులు.,.! అదే జవాబు… ధమాకా అని సినిమా వచ్చింది… ఆ పోస్టర్లు, ట్రెయిలర్ల షెకల్ చూస్తేనే తెలుస్తుంది… అది పక్కా రవితేజ ఇమేజీ మార్క్ రొడ్డకొట్టుడు రొటీన్ ఫార్ములా సినిమా అని…
Ads
ఓ పేద నిరుద్యోగి, ఓ పేద్ద బిజినెస్ టైకూన్… ఆ పాత్రలోకి ఈ పాత్ర వెళ్లి ఉద్దరించేస్తుంది… నడుమ నడుమ మన తెలుగు సినిమా, రవితేజ లెక్కల ప్రకారం… హీరోయిన్ ఉంటుంది, గెంతులుంటాయి… ఫైట్లుంటాయి… కామెడీ ఉంటుంది… అవి అలరిస్తాయా లేదానేది వేరే విషయం… ఫార్ములా ప్రకారం ఉందా లేదానేదే ముఖ్యం… ఉంది… అవే ఫోజులు, నటనలో అదే మొనాటనీ… ఈ మొనాటనీ ఇలాగే కొనసాగితే ఏం జరుగుతుందో బహుశా ఫీల్డులో తనకు చెప్పేవాళ్లు ఎవరూ లేరు కావచ్చు… మాస్ మహారాజా అని ఎవడో బిరుదప్రదానం చేయగానే ఇక దానికే ఫిక్సయిపోవాలా..? మాస్ తప్ప ఇంకేమీ పట్టదా..? తనలోని మంచి నటుడిని తనే చంపేసుకోవడం… తన పొటెన్సీని తనే చిన్నబుచ్చుకోవడం, ప్రయోగాలకు వెళ్లలేని పిరికితనం… చివరకు ఏవో సినిమాలకు పేరడీ సీన్లు..! ఫాఫమ్….
సినిమాలో కాస్త హీరోయిన్ శ్రీలీల నయం… అందంగా, హుషారుగా గంతులేసింది… అంతకుమించి చేయడానికి తనకు ఏ స్కోపూ లేదు… రవితేజ హీరోయిన్ అంటే అంతేగా… మిగతా అంశాల మాటెలా ఉన్నా రవితేజకు మరో లక్ ఏమిటంటే… ప్రస్తుతం మార్కెట్‌లో అవతార్ మినహా వేరే చూడబుల్ సినిమా ఏమీ లేదు… ఏదో కాస్త టైంపాస్ కావాలనుకునేవాళ్లకు ఈ ధమాకా డిష్యూం డిష్యూం అందుబాటులో ఉంటుంది…!! (ప్రీమియర్ షోల ఫీడ్ బ్యాక్ ఆధారంగా…)
Share this Article