.
Subramanyam Dogiparthi ….. రాబిన్ హుడ్ పాత్రలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఖాతాలో మరో సక్సెస్ సినిమా 1988 లో వచ్చిన ఈ ధర్మతేజ … కలియుగ కర్ణుడి పాత్ర . ఆద్యంతం బాగా నటించారు . ఆయన సహధర్మచారిణిగా రాధిక కూడా బాగా నటించింది .
తమిళంలో సూపర్ హిట్టయిన పూంతొట్టా కావల్కరన్ను సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో విజయకాంత్ , రాధిక , ఆనంద్ , వాణీ విశ్వనాధ్ లీడ్ రోల్సులో నటించారు . ఈ చివరి ముగ్గురు తెలుగులో కూడా నటించారు .
Ads
సినిమాలో రెండు స్టోరీలు సమాంతరంగా రన్ అవుతాయి . ఒకటి క్రైం స్టోరీ , మరొకటి లవ్ స్టోరీ . క్రైం స్టోరీలో కృష్ణంరాజు , కోట శ్రీనివాసరావు , రంగనాధ్ ప్రధాన పాత్రధారులు . దొంగ సారాయి , ఇతర స్మగ్లింగులలో రన్ అవుతుంది ఈ స్టోరీ . వీరిలో కృష్ణంరాజు మంచి క్రిమినల్ , రాబిన్ హుడ్ . కొండల్లో నివసించే జనం అతన్ని దేవుడిలాగా కొలుస్తారు .
లవ్ స్టోరీ మాఫియా డాన్ , ఒకనాటి ధర్మతేజ భాగస్తుడు రాం కుమార్ పాత్రలో నటించిన రంగనాధ్ కూతురు వాణీ విశ్వనాధ్ , ఆమె క్లాస్ మేట్ ఆనందుల స్టోరీ . ఇంట్లో నుంచి పారిపోయి కృష్ణంరాజు , రాధికల ఆశ్రయంలో ఉంటారు . వారిద్దరికి పెళ్లి జరిపించే క్రమంలో ధర్మతేజ ప్రాణాలను కోల్పోతాడు .
ఆరు ఓట్ల మెజారిటీ MLA గా , చిల్లర MLA గా వెకిలి నవ్వుతో శకుని మామ లాగా కోట శ్రీనివాసరావు తన వైవిధ్య నటనను అద్భుతంగా చూపారు . ఇతర ప్రధాన పాత్రల్లో శివకృష్ణ , పండరీబాయి , తాతినేని రాజేశ్వరి , జగ్గయ్య , మాణిక్ ఇరానీ , భీమేశ్వరరావు , ప్రభృతులు నటించారు .
పేరాలగా పిలవబడే ప్రకాశం జిల్లా ఉప్పుగొండూరు గ్రామ వాసి పేరాల సుబ్రమణ్యం ఈ సినిమాకు దర్శకుడు . బాగానే తీసారు . సాయినాథ్ డైలాగులు కూడా పదునుగానే ఉంటాయి . సంగీత దర్శకుడు విద్యాసాగర్ తెలుగులో మొదటి ప్రయత్నం . బహుశా సినిమాకు కొంత మైనస్ ఇతని సంగీతమేనేమో !
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుండి రాలిన పాటలు పాపులర్ కాలేకపోయాయి . పాటల్ని బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ పాడారు . సంబరాలు జరగాలి అనే గ్రూప్ డాన్స్ పాట కృష్ణంరాజు మీద ఉంటుంది .
క్లైమాక్సులో వెళ్ళిపోనీ విడిచి వెళ్ళిపోనీ అంటూ సాగే విషాద గీతంలో కృష్ణంరాజు నటన చాలా బాగుంటుంది . ఎద మీటే వానజల్లు పడగా వాన పాట , పచ్చని ముచ్చట అంటూ సాగే రెండు డ్యూయెట్లు ఆనంద్ , వాణీ విశ్వనాథ్ మీద ఉంటాయి .
ఏక్షన్ , సెంటిమెంట్ , ఎమోషన్ , క్రైంల కలయికే ఈ సినిమా . రెబెల్ స్టార్ కృష్ణంరాజు అభిమానులకు నచ్చుతుంది . ఇతరులకు కూడా చూడబులే . యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే ట్రై చేయవచ్చు .
నేను పరిచయం చేస్తున్న 1169 వ సినిమా ఇది . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article