సైనికులకు ఇచ్చే పురస్కారాల గురించి చదువుతుంటే… ఓ ఎపిసోడ్ ఇంట్రస్టింగుగా అనిపించింది… మన పిల్లలకు బోధించే కరిక్యులమ్‌లో ఇలాంటివి ఎందుకు ఉండవు అనిపించింది..? మరీ కార్తికేయ-2, బ్రహ్మాస్త్ర సినిమాల తరహాలో కాదు గానీ దీని వెనుక కూడా ఓ పురాణగాథ ఉంది… పక్కా భారతీయ స్త్రీగా మారిన ఓ విదేశీ యువతి ఉంది… ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇలా మన సైనిక విభాగాలేమైనా సరే, అందుకోదగిన అత్యున్నత సైనిక పురస్కారం ఏమిటో తెలుసు కదా… పరమవీరచక్ర…
విధినిర్వహణలో అపూర్వ ధైర్యసాహసాల్ని చూపించినవాళ్లకు ప్రకటిస్తారు… ఇప్పటివరకు ఎక్కువశాతం మరణానంతరం ప్రకటించబడినవారే… సైనిక విభాగాల్లో ఎన్ని మెడల్స్ ఉన్నా సరే, అన్నీ ఈ అవార్డు తరువాతే… అంత ప్రతిష్ఠాకరం… మరి ఈ అవార్డు వెనుక కథ ఏమిటి..? ఉంది… Eve Yvonne Maday de Maros… ఇదీ ఆమె పేరు… ఈవ్ మారోస్ అందాం సంక్షిప్తంగా… తండ్రి హంగేరియన్… తను సోషియాలజీ ప్రొఫెసర్… తల్లి రష్యన్… ఈవ్ మారోస్ స్విట్లర్లాండ్‌లో పుట్టింది…
Ads
మారోస్ టీనేజర్‌గా ఉన్నప్పుడు ఓసారి 1929లో బ్రిటన్ (Royal Military Academy, Sandhurs) శిక్షణలో ఉన్న ఓ మరాఠీ ఆర్మీ ఆఫీసర్ విక్రమ్ ఖనోల్కర్‌ను కలిసింది… అది కూడా విక్రమ్ ట్రెయినింగ్ బ్రేక్‌లో స్విట్జర్లాండ్ వెళ్లినప్పుడు మారోస్ కనిపించింది… ఆమె విక్రమ్‌ను ఇష్టపడింది… తనకన్నా చాలా పెద్దవాడే… తననే పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్పింది… ఒక ఇండియన్‌ను పెళ్లిచేసుకోవడానికి తను అంగీకరించలేదు, కానీ ఆమె వినలేదు… 1932లో ఇండియాకు వచ్చేసింది… విక్రమ్‌ను లక్నోలో పెళ్లి చేసుకుంది…
తన పేరును సావిత్రి ఖనోల్కర్‌గా మార్చుకుంది… యూరోపియన్ నేపథ్యంలో పుట్టి పెరిగినా సరే, ఆమె భారతీయతను త్వరగా అలవర్చుకుంది… మరాఠీ, హిందీతోపాటు సంస్కృతం ఇట్టే పట్టుబడింది ఆమెకు… దొరికిన ప్రతి పురాణాన్ని, పాత చారిత్రక గ్రంథాల్ని చదివింది… స్వతహాగా ఆమె డిజైనర్, పెయింటర్… ఆ కళ ఆమెను భారతీయ నాట్యం, సంగీతం, చిత్రలేఖనం వైపు తీసుకుపోయాయి… యూరోపియన్ దేహంలో భారతీయ ఆత్మ అని తన గురించి చెప్పుకునేది… అంతగా భారతీయంలో మునిగిపోయింది…
స్వాతంత్య్రానంతరం నెహ్రూ మేజర్ జనరల్ హీరాలాల్ అటల్‌కు ఓ పని అప్పగించాడు… ధైర్యసాహసాలు కనబరిచిన జవాన్లకు ఇవ్వడానికి అవార్డులను డిజైన్ చేయించడమే ఆ పని… ఆయనకు వెంటనే గుర్తొచ్చిన పేరు సావిత్రి… తను ఆర్మీ ఆఫీసర్ భార్య, భారతీయ పురాణగాథలపై పట్టుంది, తనే సొంతంగా డిజైనర్… అందుకని ఆమెను పిలిచి, ఈ బాధ్యత తీసుకోగలవా అనడిగాడు… మహాభాగ్యం అనుకుంటాను అని బదులిచ్చి, ఆ పనిలో మునిగిపోయింది…
ఆమెకు ఓ ఆలోచన చటుక్కున మెరిసింది… దధీచి కథ గుర్తొచ్చింది… దధీచి మహర్షి తన దేహాన్ని త్యాగం చేసి, శక్తిమంతమైన ఇంద్రుడి వజ్రాయుధంగా మారతాడు… ఆ పురాణగాథ నుంచి ఆమె పరమవీరచక్ర అవార్డును చెక్కింది… కంచు అవార్డు మధ్యలో అశోకుడి సింహాల చిహ్నం, దానికి నలువైపులా వజ్రాయుధం… ఆర్మీ ఆఫీసర్లందరికీ నచ్చింది… వోకే చేసేశారు… అంతేకాదు, అశోకచక్ర, మహావీరచక్ర, కీర్తిచక్ర, వీరచక్ర, శౌర్యచక్రల్ని కూడా ఆమే డిజైన్ చేసింది…
జనరల్ సర్వీస్ మెడల్‌కు కూడా రూపకల్పన చేసింది, కానీ 1965 వరకు మాత్రమే దాన్ని వాడారు… పరమవీరచక్ర అవార్డు డిజైన్ ఫైనలయ్యాక దాని మొదటి గ్రహీత ఎవరో తెలుసా..? సావిత్రి పెద్ద బిడ్డకు స్వయానా బావ… పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో మరణించాడు… 1952 లో తన భర్త మరణించాక సావిత్రి పూర్తిగా మానవసేవకు అంకితమైపోయింది… ప్రధానంగా విభజన వల్ల నష్టపోయిన కుటుంబాలు, జవాన్ల కుటుంబాలకు సేవ చేయడం… తరువాత రామకృష్ణమఠంలో చేరి, ఆధ్యాత్మిక ప్రచారంలో మునిగిపోయింది… 1990లో తన 77వ ఏట మరణించింది..! అమ్మా… నీ జ్ఙాపకాలకు శతాధిక వందనం..!!
Share this Article